సీఎం కిరణ్ రాజీనామా

రాజీనామాను ఆమోదించిన గవర్నర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన చివరి మీడియా సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ తెలుగుజాతిని ఐక్యంగా ఉంచలేకపోయినందుకు, కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ తాను ఈ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

కిరణ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఆపద్ధ్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగలేనని గవర్నర్‌కు కిరణ్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో తదుపరి పరిపాలనపై కేంద్ర కేబినెట్ ఈరోజు సాయంత్రం చర్చించి నిర్ణయించనుంది.

విభజనపై విషం కక్కిన సీఎం కిరణ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముఖ్యమంత్రి కిరణ్ మరోమారు తనదైన శైలిలో అవాస్తవాలను మాట్లాడుతూ విషంకక్కారు. విభజనతో తెలుగు ప్రజలందరికీ నష్టం జరిగిందని తన ఆక్రోశం వెల్లగక్కారు. రైతులకు, ఉద్యోగులకు, యువకులకు నష్టం వాటిల్లిందని ముసలి కన్నీరు కార్చారు. సీట్ల కోసం, ఓట్ల కోసం తెలుగుజాతికి అన్ని పార్టీలు నష్టం కలిగించాయి. విభజన జరిగినా చిచ్చు పెట్టే అంశాలు చాలా ఉన్నాయి. నిబంధనలు, సంప్రదాయాలు ఉల్లంఘించారు. డ్రాఫ్ట్ బిల్లును అసెంబ్లీకి పంపడం న్యాయం కాదంటూ పాత పాటే పాడుతూ పేర్కొన్నారు.

‘తెలంగాణ ఏర్పాటును 4 నెలలు అడ్డుకున్నా’
హైదరాబాద్: చెప్పిన సమయానికి రాజీనామా చేయకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నాలుగు నెలలు ఆపగలిగామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వంలో కొనసాగితేనే ఏర్పాటును అడ్డుకోవచ్చిని ఆలోచించి ఇంతవరకు పదవిలో కొనసాగనని పేర్కొన్నారు.

సీఎం పదవిలో 3 సం. 2 నెలల 19 రోజులు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవిలో 3 సంవత్సరాల 2 నెలల 19 రోజులు కొనసాగారు. 25 నవంబర్, 2010న కిరణ్ సీఎం పదవి చేపట్టారు. కొత్త పార్టీపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కిరణ్ సమాధానం దాటవేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించడానికి బయలుదేరారు. నా రాజీనామా విభజన ఆపేందుకు కాదు. నిరసన తెలిపేందుకేనని పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.