సీఎంపై మంటెత్తిన టీ మంత్రులు తిరుగుబావుటా!

హైదరాబాద్, జనవరి 27 :ఇన్నాళ్లూ తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రిని నిలదీసేందుకు వెనుకాడిన టీ మంత్రులు.. ఇప్పుడు నేరుగా సమరాంగణంలోకి దూకారు! సీఎం ఒంటెత్తు పోకడలపై విసుగెత్తిన తెలంగాణ ప్రాంత మంత్రులు.. ముఖ్యమంత్రితో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు! తమ నాయకుడిపైనే తిరుగుబాటు బావుటా ఎగురేశారు. ఇప్పటిదాకా స్పీకర్ పోడియం వద్ద తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల నినాదాలే వినిపించగా.. అనూహ్యంగా.. అసాధారణంగా.. రాష్ట్ర శాసనసభలోనే ఎన్నడూ లేని విధంగా సోమవారం మొదటిసారి తెలంగాణ మంత్రులు పోడియంను చట్టుముట్టారు. టీ బిల్లును తిప్పిపంపాలని సీఎం చేస్తున్న కుట్రలకు అడ్డుగా నిలిచారు.

asemgumpuసీఎం డౌన్ డౌన్ అంటూ వారు చేసిన నినాదాలతో సభ దద్దరిల్లింది! ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని పట్టుపట్టారు! సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ మేరకు ప్రకటన వచ్చేంతవరకూ పోడియం ముందు నుంచి వెళ్లేది లేదని భీష్మించారు! డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ వంటివారు సైతం తమ స్థానంలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా మంత్రులకు మద్దతు ప్రకటించారు. వారుసైతం పోడియం వద్దకు చేరుకుని జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు! సీమాంధ్ర సీఎం కుటిల యత్నాలకు వ్యతిరేకంగా ఒక్కతాటిపై నిలిచిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల విశేష ఐక్యతతో సోమవారం సభ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే మంగళవారానికి వాయిదాపడింది! రాష్ట్ర నాయకులు, రాష్ట్ర శాసనసభే కాదు.. కేబినెట్ సైతం నిట్టనిలువునా చీలిపోయి ఉందన్న వాస్తవాన్ని సోమవారంనాటి సభలో పరిణామాలు ప్రపంచానికి చాటి చెప్పాయి.

అటు రాష్ట్ర శాసనమండలిలో సైతం ఇవే పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కిరణ్, మండలిలో సభా నాయకుడు సీ రామచంద్రయ్యపై టీ ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా నిప్పులు చెరిగారు. రామచంద్రయ్య సభా నాయకుడి హోదాలో బిల్లును తిప్పి పంపాలని నోటీసు ఎలా ఇస్తారని నిలదీస్తూ టీ ఎమ్మెల్సీలు చైర్మన్ స్థానాన్ని చుట్టుముట్టారు. జై తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. ఒక వైపు బిల్లుపై మండలిలో చర్చ జరుగుతుంటే మధ్యలో దానిని తిప్పి పంపాలని ఎలా కోరుతారని నిలదీశారు.
తెలంగాణ బిల్లును రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం అభివర్ణిస్తూ.. ఇన్నాళ్లు చర్చ జరిగిన తర్వాత ఇప్పుడు దీనిపై చర్చించేది లేదని, వెనక్కి తిప్పి పంపాలని కోరుతూ కిరణ్ ప్రవేశపెట్టిన తీర్మానంతో టీ మంత్రులు మంటెత్తిపోయారు. ఏకపక్షంగా సీఎం తీసుకున్న నిర్ణయం మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్‌నే అతలాకుతలం చేసింది.

ముఖ్యమంత్రి తమ నాయకుడే కాదని ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత దామోదర రాజనర్సింహ బహిరంగంగా విమర్శనాస్ర్తాలు సంధించగా.. ఆయనపై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతామని మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. పలువురు సీనియర్ మంత్రులు కూడా ఆయన నాయకత్వంలో పని చేయలేమనే పరిస్థితికి వచ్చారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే ఉద్దేశంలో వారు ఉన్నట్లు తెలుస్తున్నది. రాష్ట్రపతి నుంచి టీ బిల్లు అసెంబ్లీకి వచ్చేనాటికే రెండు శిబిరాలుగా చీలిపోయి ఉన్నా.. కేబినెట్ మంత్రులు నేరుగా విమర్శలు, ఆరోపణాస్ర్తాలు సంధించుకున్న సందర్భాలు తక్కువే. ఒకరిద్దరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా.. సభలో సీఎం చర్యను నిలదీసేంత పరిస్థితి ఎన్నడూ లేదు. కొద్ది రోజలుగా ఈ రెండు శిబిరాల మధ్య ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, తెలంగాణ మంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోయే స్థాయిలో విభేదాలు ముదిరిపోయాయి.

అగ్గికి ఆజ్యం పోసినట్లు వ్యవహరించిన సీఎం.. టీ బిల్లును తిప్పి పంపాలని స్పీకర్‌కు నోటీసు ఇవ్వడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోయింది. జాతీయ నేతలు సైతం సీఎం తీరును తప్పుపడుతుండటం తెలంగాణ నాయకత్వానికి కొత్త బలాన్ని ఇచ్చినట్లయింది. దీంతో సీఎంను, ఆయన కూటమిని ఎదుర్కొనేందుకు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, సీనియర్ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, జే గీతారెడ్డి, డీ శ్రీధర్‌బాబు తదితరులు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్నారు. సొంత కేబినెట్ సహచరులే తనపై తిరుగుబాటు ప్రకటిస్తున్నా పట్టించుకోని సీఎం.. తన దుందుడుకు స్వభావాన్ని చాటుకుంటూ సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తూ తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు కనిపిస్తున్నది. అయితే తాము బిల్లుకు వ్యతిరేకమని, అదే అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నామని కొందరు సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. కానీ.. బిల్లును మధ్యలో తిప్పి పంపాలన్నది సరైంది కాదని అంటుండటం విశేషం.

ఏకపక్ష నిర్ణయం చెల్లదు
ప్రజాస్వామ్యంలో శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యే అధికారపార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమిస్తే ఆయన తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకుంటారు. కేబినెట్‌లో సీఎం ఇతర మంత్రుల కంటే ముందు వరుస (ఫస్ట్ అమాంగ్ ది అదర్ మినిస్టర్స్)లో ఉంటారు. ఈ సూత్రాన్నే ప్రస్తావిస్తున్న టీ కాంగ్రెస్ మంత్రులు సీఎం ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. మంత్రివర్గంలో చర్చించి, తీర్మానించి నిర్ణయాలు ప్రకటించాలి తప్ప సభానాయకుడిగా ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రిగా ఒక్కరే నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని టీ మంత్రులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కిరణ్ శాసనసభ నియమావళి-77 ప్రకారం స్పీకర్‌కు ఇచ్చిన నోటీసు చెల్లదని వారు వాదిస్తున్నారు.

అసెంబ్లీలో సభానాయకుడిగా సీఎం కిరణ్, కౌన్సిల్‌లో సభానాయకుడిగా మంత్రి సీ రాంచంద్రయ్య ఇచ్చిన నోటీసులు అసమంజసమని, వాటిని తిరస్కరించాలని టీ మంత్రులు ఉభయ సభల అధ్యక్షులను స్వయంగా కలుసుకుని ఆదివారం, సోమవారం వరుసగా వినతిపత్రాలు సమర్పించారు. కిరణ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు అధిష్ఠానం అనుమతి తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు బహిరంగంగా ప్రకటించడం విశేషం. ఒంటెత్తు పోకడలు పోతున్న కిరణ్ తమ నాయకుడే కాదని, ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను తాము అంగీకరించమని ఉప ముఖ్యమంత్రి కూడా మీడియా ముందు కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ సైతం సీఎంకు మొట్టికాయలు వేసే విధంగా మాట్లాడటం గమనార్హం. ముఖ్యమంత్రికి రాజ్యాంగంపై ఎక్కువ అవగాహన ఉందని జైరాం వ్యంగోక్తులు విసిరారు.

రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కూడా కిరణ్‌పై ఎప్పటికప్పుడు చేస్తున్న పరోక్ష విమర్శలు టీ కాంగ్రెస్ నేతలకు కొత్త బలాన్నిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. యుపీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం నిర్ణయించాక.. తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ మద్దతు ప్రకటించిన తర్వాత.. ఆ నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించిన తర్వాత టీ బిల్లు తయారీ ప్రక్రియ మొదలైంది. అనంతరం కేబినెట్ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపిస్తే దానిని ఆయన అసెంబ్లీ అభిప్రాయం నిమిత్తం పంపారు. మొత్తంగా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కేంద్రం, కాంగ్రెస్ పార్టీ శరవేగంగా చర్యలు తీసుకుంటుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ప్రతి సందర్భంలో అధిష్ఠానాన్ని ధిక్కరించేలా వ్యవహరిస్తున్నారని టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు.

అలాంటి వ్యక్తిని సభా నాయకుడిగా తాము గుర్తించడం లేదని ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజనకు కూడా ముందస్తుగానే కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక కమిటీ నియమించాలని ఆదేశాలు జారీ చేసిందంటే జాతీయ నేతలు రాష్ట్ర విభజన పట్ల చిత్తశుద్ధితో ఉన్నారో తెలుస్తున్నది. కానీ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఎన్నికల ఏడాదిలో తమ పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ రాష్ట్రంలో పార్టీని అభాసుపాలు చేస్తున్నారని, పార్టీ వ్యతిరేక ప్రచారానికి వారే ఊతం ఇస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు తూర్పారపడుతున్నారు. ఈ పరిణామాలతో ఇక ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేయలేని పరిస్థితి ఏర్పడటమే కాకుండా.. వారి మధ్య రోజురోజుకూ అంతరాలు పెరిగిపోతున్నాయి.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.