సీఎంకు దమ్ముంటే రాజీనామా చేయాలి: కేటీఆర్

హైదరాబాద్: సీఎం కిరణ్ రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని హెచ్చరించడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. అసలు సీఎం కిరణ్ ఇంతకు ముందు స్పీకర్ పనిచేసిన వాడే కదా, మరిప్పుడు బిల్లుపై ఓటింగ్ జరగాలా? వద్దా? అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. స్పీకర్‌గా ఉన్నపుడు ఏం చదువుకున్నాడో అని ఎద్దేవా చేశారు. సీఎం కిరణ్ అధిష్ఠానాన్ని వ్యతిరేకించడంకాదని, దమ్ముంటే సీఎం తన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాలు విసిరారు. అర్హత లేకున్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనను సీఎం చేసిందని అన్నారు. సీఎం కిరణ్ మూడేళ్లపాలనలో మూడు ఉగ్రవాద ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. కిరణ్ హయాంలోనే దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పేలుడు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కిరణ్ సొంత జిల్లా చిత్తూరులోని పుత్తూరులో ఉగ్రవాదులు తిష్ట వేశారని విమర్శించారు. తన పదవీ కాలంలో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లను అడ్డుకోలేకపోయిన సీఎం నక్సలిజాన్ని అడ్డుకోవాలనడం హాస్యాస్పదమన్నారు.

ఇక్కడి ఉద్యమాలు సీఎంకు కనిపించలేదా? : కేటీఆర్
సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతుంటే కేంద్రానికి కనిపించడంలేదా? అని సీఎం కిరణ్ అనడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కళ్లుండి చూడలేని కబోదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉద్యమాలు జరుగుతున్నపుడు కిరణ్‌కు కనిపించలేదా? డబ్బు మదంతో కళ్లు తలకెక్కాయా? అపుడు ఆయనే కదా సీఎం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల 54 ఏళ్ల పోరాటం సీఎంకు కనిపించలేదా? అని అడిగారు. నాలుగు కోట్ల మంది ఉద్యమం చేసినపుడు కనిపించలేదా? అని నిలదీశారు.

కిరణ్ కాళ్లకింద భూమి కుంగిపోతోంది కేటీఆర్
కేసీఆర్ సృష్టించిన భూకంపంతో కిరణ్ కాళ్ల కింద భూమి కుంగిపోతోందని కేటీఆర్ అన్నారు. దోపిడి ఆగిపోతుంటే సీఎం కిరణ్ కాళ్లకింద భూమి కుంగిపోతుందని అన్నారు. కేసీఆర్‌ను సీఎం చేద్దామనడం దారుణమని అన్నారు. కేసీఆర్ మంత్రి పదవిని ఎడమ కాలి చెప్పులా తీసిపడేశాడని తెలిపారు. తాము పదవుల కోసం కక్కుర్తి పడబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక తెలంగాణ కోరామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ప్రక్రియ ఆగదని తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.