సాధికారత కోసమే స్వరాష్ట్రం

 

ktr
అన్ని రంగాల్లో వివక్ష నుంచి బయటపడే విముక్తి పోరాటం
– ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ జేఏసీ ధర్నాలో
మెయిన్ స్ట్రీం సంపాదకుడు సుమీత్ చక్రవర్తి
– పలు జాతీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, మేధావుల మద్దతు
– న్యాయమైన తెలంగాణ డిమాండ్ నెరవేర్చాలని సూచన
తెలంగాణ ఉద్యమం వెనుకబాటుతనం నుంచి అభివృద్ధి కోసం మాత్రమే కాదని, రాజకీయ ఆర్థిక రంగాలలో సాధికారత సాధించడానికేనని ప్రముఖ జర్నలిస్టు, మెయిన్ స్ట్రీం పత్రిక సంపాదకుడు సుమీత్ చక్రవర్తి స్పష్టం చేశారు. భారతదేశంలో అనేక ఉద్యమాలు జరిగాయని, తెలంగాణ ఉద్యమం చాలా తీవ్రమైనదన్నారు. బీజేపీ నుంచి కమ్యూనిస్టుల వరకు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు భిన్న పక్షాలు తెలంగాణకు మద్దతుగా నిలిచాయని, ఇప్పటికైనా తెలంగాణ ప్రకటించకపోతే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే అవుతుందన్నారు. తెలంగాణ డిమాండ్‌తో సంసద్ యాత్ర నిర్వహించిన టీ జేఏసీ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం ప్రారంభించిన రెండురోజుల సత్యాక్షిగహ దీక్షకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సీపీఐ, బీజేపీ, ఎన్సీపీ తదితర జాతీయ పార్టీల నేతలు, పలు ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. న్యాయమైన తెలంగాణ డిమాండ్‌ను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సుమీత్ చక్రవర్తి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను కేవలం అభివృద్ధి కోణంలోనే చూడొద్దని, తెలంగాణ కోసం సాగుతున్న పోరాటం ప్రజలు ఆర్థిక రాజకీయ రంగాలలో ఎదుర్కొంటున్న వివక్ష నుంచి బయటపడే విముక్తి పోరాటమన్నారు.

తెలంగాణ ఉద్యమం రాత్రికి రాత్రికి వచ్చిందికాదని, 1956 నుంచే నడుస్తోందన్నారు. ఫజల్ అలీ కమిషన్ సిఫారసులను అమలుచేయకపోవడంవల్లనే ఇన్నాళ్లుగా ఉద్యమం కొనసాగుతోందన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. జాతీయ మీడియా తెలంగాణ అంశాన్ని ప్రసారం చేయకుండా మోసం చేస్తున్నదని చిన్న రాష్ట్రాల వేదిక కన్వీనర్ ఆర్‌కే తోమర్ ఆరోపించారు. గల్లీ నుంచి ఢిల్లీకి వచ్చినా అదే తెలుగు మీడియాలో ప్రచురించడం వలన ఫలితం లేదన్నారు. తెలంగాణను జాతీయ సమస్యగా మార్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయంది తెలంగాణ రాష్ట్రం సాకారంకాదని తెలంగాణవాదులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే కేంద్రం ప్రకటించిందని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ భట్టాచార్య స్పష్టం చేశారు. తెలంగాణవాదులు తెలంగాణ ప్రకటించాలని డిమాండు చేయకూడదని, ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ కోసం కేంద్రాన్ని డిమాండు చేయాలన్నారు. తెలంగాణ గతంలో ప్రత్యేక దేశంగా మనుగడ కొనసాగించిందని యూపీఏ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీ నేత త్రిపాఠి గుర్తుచేశారు. తెలంగాణ డిమాండు కొత్తదేం కాదని, ఐదు శతాబ్దాలదన్నారు. తమ పార్టీ అధినేత శరద్‌పవార్ మొదటినుంచి తెలంగాణ ఉద్యమానికి మద్దతునిస్తున్నారని, భవిష్యత్తులో కూడా మద్దతు కొనసాగుతుందన్నారు. పార్లమెంటులో బిల్లుపెడితే తాము సంపూర్ణ మద్దతునిస్తామన్నారు. తెలంగాణ కోరిక త్వరలో నెరవేరుతుందని ఆశిస్తున్నానన్నారు.

కాంగ్రెస్ ఆడుకుంటున్నది: ఈటెల
తెలంగాణ ప్రజలకిచ్చిన మాటను కాంగ్రెస్ పార్టీ మర్చిపోయి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆటలాడుతున్నదని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్ దుయ్యబట్టారు. పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వెనక్కితీసుకుని తన బాధ్యతను తానే విస్మరించిందని విమర్శించారు. చివరి పార్లమెంట్ సమావేశాల్లో మర్యాదగా బిల్లుపెడితే సరేనని, లేదంటే తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొందపెడుతారనిహెచ్చరించారు. గతంలో అధికారం కోసం వైఎస్ హయాంలో 42 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను సోనియాకు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్ భవనం ముందు యాదిడ్డి ఆత్మహత్య చేసుకున్నా సోనియాగాంధీకి చలనంలేదని విమర్శించారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే.. అనారోగ్యాలతో మృతిచెందారని దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

మనుగడ ఉండదు: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయకుండా కాంగ్రెస్ పార్టీ మనుగడ కొనసాగించలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. తన పుత్రుడు రాహుల్‌గాంధీ ఎన్నటికీ ప్రధాని కాలేడనే విషయాన్ని సోనియా గుర్తించాలన్నారు. తెలంగాణ ప్రజలకిచ్చిన మాటలు తప్పినందున ఆత్మహత్యలు పెరిగాయని గర్భశోకంతో విలపిస్తున్న ఆ తల్లుల ఉసురు సోనియాకు తగులుతుందన్నారు. ఆరెస్సెస్ నుంచి ఆరెస్‌యూ వరకు ఉన్న భిన్న రాజకీయ వ్యవస్థలను తెలంగాణ ఉద్యమం ఒక్క వేదిక మీదకు చేర్చిందని తెలిపారు. లోక్‌పాల్ విషయంలో అన్నా హజారే దీక్ష చేసినపుడు పార్లమెంటే సుప్రీం అన్న కాంగ్రెస్ నేతలు అదే పార్లమెంటులో తెలంగాణ ప్రకటన చేసినప్పటికీ ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. టీ ఎంపీల సమావేశాలు టీ బిస్కట్లకే పరిమితయ్యాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే ఊరుకునేది లేదంటున్న తెలంగాణ మంత్రులు జానాడ్డి, శ్రీధర్‌బాబులు కనీసం కిటికీ నుంచైనా సోనియాను చూశారా అని ప్రశ్నించారు. జేఏసీలో భాగస్వామ్యమైన పార్టీలు ఎవరిగోల వారిది అన్నట్లు గా వ్యవహరించడం సరికాదన్నారు.

భూస్థాపితం చేసేందుకు సిద్ధం: దత్తావూతేయ
మోసాలకు కాంగ్రెస్ పెట్టిన పేరని, రెండుసార్లు తెలంగాణ పేరుతో గెలిచి రాష్ట్రాన్ని ప్రకటించకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తావూతేయ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తే సంక్షోభం ఏర్పడుతుందని, తద్వారా తెలంగాణ ప్రకటన ఖాయమన్నారు. అందరి అభివూపాయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ తన అభివూపాయం చెప్పకుండా నాటకం ఆడుతున్నదన్నారు. తెలంగాణ ప్రకటనకు ఇవే ఆఖరు సమావేశాలని, పార్లమెంటులో బిల్లుపెడితే బీజేపీ తక్షణ మద్దతుంటుందన్నారు.

మార్గం: న్యూ డెమొక్షికసీ నేత సూర్యం
ఎన్నికలతో నిమిత్తం లేకుండా పోరాటాలు చేయడం ద్వారానే తెలంగాణ సాధ్యమని న్యూ డెమొక్షికసీ నేత సూర్యం అన్నారు. అది జేఏసీకి మాత్రమే సాధ్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విభిన్న పార్టీలను ఒకే గొడుగుకిందకు తెచ్చి జేఏసీగా సంఘటితపరిచిన ఘనత ప్రొఫెసర్ కోదండరాందేనని కొనియాడారు. జేఏసీలో భాగస్వామ్య పార్టీలందరికి సమాన హోదా కల్పించాలని కొందరికి పెద్దపీట వేయడం వలన ఉద్యమ స్ఫూర్తి దెబ్బతింటుందని హెచ్చరించారు. తమను స్టేజీ మీదకు పిలవకుండా అవమానించారని న్యూ డెమొక్షికసీ కార్యకర్తలు కొద్దిసేపు సభావూపాంగణం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన జరగడం పట్ల తాము చింతిసున్నామని సూర్యం ప్రకటించారు. అయితే తమ ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఊరుకోబోమన్నారు.

భూత వైద్యం చేయాలి: నాగం
తెలంగాణపై నోరు విప్పకుండా సోనియాగాంధీ దయ్యం పట్టినట్లు మౌనం వహించడం వల్లనే తెలంగాణ యువత బలిదానాలు జరుగుతున్నాయని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్‌డ్డి ఆరోపించారు. వందల మంది బలిదానాలకు ఆమె మౌనమే కారణమవుతున్నందున, ఆమెకు తక్షణమే భూత వైద్యం చేసి దయ్యాన్ని వదిలించాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేయడం మాని సోనియా ఇంటిముందు దీక్షలు చేస్తే బాగుంటుందని సూచించారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చవట దద్దమ్మలు, ద్రోహులని ఘాటుగా విమర్శించారు.

కొనసాగనున్న దీక్ష
సత్యాక్షిగహ దీక్ష మంగళవారం కూడా కొనసాగుతుందని, ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం మూడుగంటల వరకు జరుగుతుందని జేఏసీ కో ఆర్డినేటర్ పిట్టల రవీందర్ ప్రకటించారు. రాత్రి తొమ్మిది గంటలకు హైదరాబాద్‌కు రైలు బయలుదేరుతుందని తెలిపారు.

వ్యతిరేకంగా బలమైన లాబీ
– సీపీఐ జాతీయ నేత సురవరం
తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాకుండా ఓ బలమైన లాబీ పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌డ్డి అన్నారు. తెలంగాణలో వెయ్యి మంది యువత మరణించినా నాన్చడం కాంగ్రెస్ ద్రోహచింతనేనన్నారు. తెలంగాణ ఇస్తే మరిన్ని డిమాండ్లు తలెత్తుతాయని సాకులు చూపడం సరికాదని, ఒకవేళ అవి న్యాయమైన డిమాండ్లయితే తీర్చాలని అన్నారు. తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను పక్కదారి పట్టించేందుకు యూపీఏ ప్రభుత్వం పసలేని ప్రత్యామ్నాయ మార్గాలను చూపుతూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. సంసద్ యాత్ర కాంగ్రెస్ పార్టీకి తుది హెచ్చరికగా ఉందన్నారు. భారీగా తరలివచ్చిన తెలంగాణవాదులను ఆయన అభినందించారు. తెలంగాణ వచ్చేదాకా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. తాము తెలంగాణ వచ్చేవరకు ఉద్యమానికి అండగా ఉంటామన్నారు.

పెట్టడానికి కాంగ్రెస్‌కు దిల్ లేదు
– బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్
తెలంగాణ ప్రజలను నిత్యం మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి నీతిలేదని, కమిటీల మీద కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి సంసద్ యాత్ర ద్వారా ఆఖరు హెచ్చరిక జారీ చేసినట్లయిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు ప్రజల్లో జై తెలంగాణ అంటూ అధిష్టానం ముందు నై తెలంగాణ అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు ఎప్పుడు పెట్టినా తమ పూర్తి మద్దతు ఉంటుందని తాము ఎన్నడో ప్రకటించామని, తెలంగాణ ప్రకటనకు ‘బ్లాంకు చెక్కు’ ఇచ్చామని అన్నారు. ప్రతిపక్షంగా తాము పూర్తి మద్దతు ప్రకటించినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బిల్లు తేవడానికి దిల్ (మనసు) లేదన్నారు. శ్రీకృష్ట కమిటీ పైసలతో మీడియాను కొనేయాలని సూచించిందని, ఉద్యమకారులను కొనడం ఎవరితరమూ కాదని స్పష్టం చేశారు. అందుకు సంసద్ యాత్ర నిదర్శనమన్నారు.

యాభై రాష్ట్రాల అవసరముంది
– జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి
రాష్ట్రాలు చిన్నగా ఉండటం వల్ల దేశం సత్వర అభివృద్ధి జరుగుతుందని జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా దేశంలో దాదాపు యాభై రాష్ట్రాల అవసరమున్నదన్నారు. తెలంగాణ కంటే అనేక చిన్న రాష్ట్రాలున్నాయన్నారు. హర్యానా, పంజాబ్, హిమాచల్‌వూపదేశ్ లాంటి అనేక రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. తెలంగాణ ఇండియాలోనే ఉన్నదని, పాకిస్థాన్‌లో లేదంటూ, రాష్ట్రంగా ప్రకటించడం దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదమేంకాదన్నారు. చెన్నాడ్డి హయాం నుంచి ఇప్పటివరకు కొనసాగుతున్న తెలంగాణ సమస్యకు పరిష్కారం చూపించకపోవడం కాంగ్రెస్ పార్టీ అసమర్థతేనని ఆరోపించారు.

ఆకాంక్షలను మరోసారి చాటాం
– జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
సంసద్ యాత్ర ద్వారా నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి మరోసారి చాటినట్లయిందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్‌కు ఇదే ఆఖరు అవకాశమని అన్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సాధించుకుంటామని కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే ఆత్మహత్యలకు మూలమన్నారు. తెలంగాణ ప్రకటనకు యూపీఏను ఒత్తిడి చేయాలని రాజకీయ పార్టీలను ఆయన కోరారు. మండుటెండలో కష్టనష్టాలను లెక్కచేయకుండా రైలులో ఢిల్లీకి వచ్చిన జేఏసీ కార్యకర్తలను, నాయకులను ఆయన అభినందించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.