ఈ రోజు ఎంతో ఉద్వేగంగా ఉంది. 22 గజాల మధ్య 24 ఏళ్లపాటు గడిచిన కెరీర్ నేటితో ముగుస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా కెరీర్ ఇక్కడిదాకా రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం అంజలి నా భార్య కావ డం. ఆమె తన డాక్టర్ వృత్తిని వదులుకొని నా కెరీర్‌నే తన కెరీర్‌గా భావించింది. నా జీవితంలో నా బెస్ట్ పార్టనర్షిప్ అంజలి.. క్రికెట్ కారణంగా నేను నా బిడ్డల పుట్టినరోజున కూడా వారితో కలిసివుండలేని సందర్భాలెన్నో ఉన్నా యి. 16 ఏళ్లపాటు వారికి సమయం కేటాయించలేకపోయిన నేను.. ఇకపై ఆ లోటును తీరుస్తాను. డకౌట్ అయినా, సెంచరీ చేసినా అవే ప్రేమాభిమానాలను ప్రదర్శించి నాకు మనోధైర్యాన్నిచ్చిన అభిమానులకు ఎప్పటికీ రుణపడివుంటాను.
– సచిన్ టెండూల్కర్,16, నవంబర్ 2013,వాంఖడే స్టేడియం
-సచిన్‌ను వరించిన అత్యున్నత పురస్కారం
-ప్రధాని సాంకేతిక మండలి చైర్మన్ సీఎన్ఆర్ రావుకు కూడా..
– భారతరత్నకు ఎంపికైన తొలి క్రీడాకారుడిగా, అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్
– దేశ క్రీడా రాయబారిగా టెండూల్కర్ సేవలు ఎనలేనివి: రాష్ట్రపతి భవన్ ప్రకటన
అమ్మకు అంకితం: సచిన్
తనకు ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించడంపై క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ‘ఇంతటి గౌరవాన్ని అందించినందుకు కృతజ్ఞతలు. ఈ అవార్డును మా అమ్మకు అంకితమిస్తున్నా.. భారత్ నా మాతృభూమి’ అని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, నవంబర్ 16: క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్, ప్రఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ సీఎన్ఆర్ రావులను భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ వరించింది. మాస్టర్ బ్లాస్టర్గా, క్రికెట్ దేవుడిగా ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్న సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినరోజునే ఆయనను ఈ అత్యున్నత పురస్కారం వరించడం విశేషం. ‘భారత రత్న’ అందుకుంటున్న తొలి క్రీడాకారుడిగా, అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ చరి త్ర సృష్టించారు. సచిన్ (40), సైంటిస్ట్ రావు (89) ఇప్పటికే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. వారి సేవలకు గుర్తింపుగా ఇప్పుడు ‘భారత రత్న’ దక్కింది. 1954లో ఏర్పాటుచేసిన ఈ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇప్పటివరకు 41 మంది ప్రముఖులు అందుకోగా, సచిన్, సీఎన్ఆర్ రావుల చేరికతో ఈ అవార్డు గ్రహీతల జాబితా 43కు చేరింది. 24 ఏళ్ల పాటు అలుపెరగకుండా క్రికెట్ ఆడుతూ.. ఎన్నో రికార్డులు తిరగరాసిన సచిన్ క్రీడా వీడ్కోలుకు ఘనమైన ముగింపునిస్తూ.. ఆయనను ‘భారత రత్న’ వరించింది.
శనివారం ముంబైలో వెస్టిండీస్‌పై తనకు చివరిదైన 200వ టెస్టు ముగించుకున్న కాసేపటికే రాష్ట్రపతి భవన్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ప్రకటన చేసింది. ‘క్రీడా ప్రపంచంలో భారత్‌కు నిజమైన రాయబారిగా సచిన్ వ్యవహరించారు. క్రికెట్లో ఆయన సాధించిన విజయాలను అసాధారణమైనవి. ఆయన సాధించిన రికార్డులు అనన్య సామాన్యమైనవి. ఆయన ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి అందరికీ ఆదర్శప్రాయం’ అని అధికారిక ప్రకటన సచిన్ కీర్తిని కొనియాడింది. 16 ఏళ్ల ప్రాయం నుంచే క్రికెట్ ఆడుతున్న సచిన్ తన 24 ఏళ్ల క్రీడా ప్రస్థానంలో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడి.. దేశ కీర్తిని ఇనుమడింపజేశారని ప్రశంసించింది.
ఇక ‘భారత రత్న’ అందుకుంటున్న మూడో శాస్త్రవేత్తగా క్తీరి గడించిన ప్రొఫెసర్ చింతామణి నాగేశ రామచంద్రరావుకు అంతర్జాతీయంగా ఎంతోగానో పేరు ప్రఖ్యాతలున్నాయి. ఆయన ఘన భౌతిక రసాయనాలపై (సాలిడ్ స్టేట్, మెటిరియల్ కెమికల్స్) దాదాపు 1,400 పరిశోధన పత్రాలు ప్రచురించారు. 45 పుస్తకాలు రాశారు. సీవీ రామన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తర్వాత ‘భారత రత్న’ అందుకుంటున్న మూడో శాస్త్రవేత్తగా సీఎన్ఆర్ రావు ఘనత సొంతం చేసుకున్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఆయన సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన సైంటిఫిక్ అకాడెమీలు గుర్తించాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనకు దక్కాయని అధికారిక ప్రకటన తెలిపింది. సీఎన్ఆర్ రావు ప్రస్తుతం ప్రధానమంత్రి సాంకేతిక సలహా మండలి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సచిన్‌కు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని కొన్నాళ్లుగా డిమాండ్ వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులకు కూడా ‘భారత రత్న’ను అందజేసేందుకువీలుగా అర్హత ప్రమాణాలను సవరించారు. రాజ్యసభకు ఎన్నికైన తొలి క్రియాశీల క్రీడాకారుడిగా సచిన్ నిలిచారు. ఆయన గత ఏడాది పెద్దలసభకు ఎంపికైన విషయం తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ‘భారత రత్న’ అవార్డును అందజేశారు. చివరిసారిగా 2009లో హిందూస్థాన్ సంగీత దిగ్గజం భీమ్‌సేన్‌ను ఈ పురస్కారం వరించింది.
ధ్యాన్‌చంద్‌ను విస్మరించారు!
క్రీడాశాఖ సిఫారసు చేసినా పట్టించుకోని వైనం
ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు అందజేసిన హాకీ మాంత్రికుడు, క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్‌కు దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’ దక్కకపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సచిన్‌తోపాటు ధ్యాన్‌చంద్‌కు కూడా ఈ అత్యున్నత పురస్కారం ఇచ్చి సత్కరించాల్సి ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి సచిన్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతున్నప్పటికీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గత జూలైలో ధ్యాన్ చంద్ పేరును ఇందుకు సిఫారసు చేసింది. మరణానంతరం ధ్యాన్‌చంద్‌కు ఈ పురస్కారం అందజేయాలని కోరుతూ ప్రధానమంవూతికి లేఖ రాసింది. అయితే క్రీడా శాఖ సిఫారసును పక్కనబెట్టి మరీ సచిన్‌కు ‘భారతరత్న’ అందజేసినట్టు స్పష్టమవుతోంది. 1928, 32, 36 ఒలింపిక్స్ క్రీడలలో వరుసగా భారత్‌కు స్వర్ణం పతకం అందించి.. విశ్వ క్రీడా వేదికపై మువ్వన్నెలను రెపపలాడించారు ధ్యాన్‌చంద్. జాతీయ క్రీడ, మన దేశంలోనే పురుడుపోసుకున్న క్రీడ అయిన హాకీలో ఎన్నో విజయాలు నమోదుచేసి.. ప్రపంచంలోనే అత్యున్నత హాకీ క్రీడాకారుడిగా ఆయన ప్రశంసలందుకున్నారు.
ధ్యాన్‌చంద్ కూడా అర్హుడే: గురుబక్ష్ సింగ్
భారత రత్న పురస్కారానికి హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ మరింతగా అర్హుడని సహచర హాకీ క్రీడాకారుడు, ఒలింపియన్ గురుబక్ష్‌సింగ్ అభిప్రాయపడ్డారు. ‘భారతరత్న’ వచ్చినందుకు సచిన్‌కు కృతజ్ఞతలు. అదే సమయంలో ధ్యాన్‌చంద్‌కు కూడా ఈ పురస్కారాన్ని అందజేయవలసి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.
క్రీడా ప్రపంచానికి సిసలైన రాయబారి సచిన్ టెండూల్కర్. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న దక్కడం అభినందనీయం. ఇది దేశానికి ఉత్తమ సందేశం పంపడం అవుతుంది. సచిన్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు. దేశంలో క్రీడల అభివృద్ధికి సచిన్ విశేష కృషి చేయాలని, ఆయనకు ఉజ్వలకు భవిష్యత్ ఉండాలని ఆకాంక్షిస్తున్నా.
– మన్మోహన్సింగ్, ప్రధానమంత్రి
యువత కొలిచే వ్యక్తుల్లో సచిన్ అగ్రస్థానంలో ఉంటారు. క్రీడాకారులకు సైతం ఆయన మార్గదర్శకుడు. భారతరత్న అవార్డు దక్కించుకున్న సచిన్‌కు అభినందనలు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా.
– సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత్రి
సచిన్ ప్రసంగం నా మనస్సును తాకింది. ‘లక్ష్యసాధనలో సులువైన దారులు వెతకకు’ అని సచిన్ తండ్రి అనే మాటలు దేశంలోని యువతరానికి ఎల్లప్పటికీ స్ఫూర్తినిస్తాయి.
– సునీల్ గవాస్కర్, మాజీ క్రికెటర్
సచిన్ సంపూర్ణ క్రికెటర్. క్రికెట్ జీవితం ఆరంభంనుంచి రిటైర్మెంట్ వరకూ అన్ని క్రమబద్ధం చేసుకున్నాడు. ఆయనకు ఓ రాయబారి పదవి కానీ ఐక్యరాజ్యసమితిలో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం ఇచ్చినా సక్రమంగా నెరవేరుస్తాడు.
– వీవీఎస్ లక్ష్మణ్, మాజీ క్రికెటర్
భారతరత్న అవార్డుకు క్రీడాకారుడు ఎంపిక కావడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. ఆ అవార్డు అందుకోవడానికి సచిన్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. క్రీడల్లో విశేష కృషి చేసిన వారికి ఇది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.
– అశోక్‌కుమార్, ధ్యాన్‌చంద్ కుమారుడు
ఓ క్రీడాకారుడు 24 ఏళ్లపాటు మైదానంలో కొనసాగడం చిన్న విషయమేమీ కాదు. ఓ క్రీడా కారుడికి భారతరత్న దక్కడం గొప్ప విషయం.
ఆ గౌరవానికి సచిన్ అన్నివిధాలా అర్హుడు.
-భైచుంగ్ భూటియా, ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్
భారతరత్న పురస్కారానికి ఎంపికైన సచిన్‌కు అభినందనలు. ఈ తరం క్రీడాకారులందరికీ సచిన్ ఓ స్ఫూర్తి. క్రికెట్ మైదానంనుంచి ఆయన దూరమవడం బాధాకరమే. ఆయన విశ్రాంత జీవితం ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటున్నా. భారతరత్న అందుకోవాలన్న క్రీడాకారుల ఆకాంక్షకు ఇదో ముందడుగు.
– సుశీల్‌కుమార్, ఒలింపిక్ అవార్డుగ్రహీత
సచిన్‌కు భారీ శుభాకాంక్షలు. క్రీడాకారులకు భారతరత్న ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– ధన్‌రాజ్‌పిళ్లై, భారత హాకీ మాజీ కెప్టెన్
ఇది చారిత్రక క్షణం. రెండు దశాబ్దాలకుపైగా అనితర విజయాలతో సచిన్ భారత ఖ్యాతిని నలుదిశలా చాటాడు. భారతరత్నకు ఎంపికైన సచిన్‌కు హృదయపూర్వక అభినందనలు.
– సంజయ్‌పటేల్, బీసీసీఐ కార్యదర్శి
అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌రావు ఎంపిక కావడం అభినందనీయం. ఈ ఇద్దరు తమ తమ రంగాల్లో విశేషంగా రాణించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చారు. సచిన్, రావులు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తారు.
– ఈఎస్ఎల్ నరసింహన్, గవర్నర్
సచిన్‌కు భారతరత్న ప్రకటించి, కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కోరికను భారత ప్రభుత్వం నెరవేర్చింది. ఆయన ఈ అవార్డుకు అన్నివిధాలా అర్హుడు.
-కే శంకరనారాయణన్, మహారాష్ట్ర గవర్నర్
అత్యున్నతమైన పౌర పురస్కారమైన భారతరత్నకు ఎంపికైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక అభినందనలు. రిట్మైంట్ రోజునే సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారాన్ని అందుకోవటం ఆయనకు మధురమైన జ్ఞాపకాన్ని మిగిలిస్తుంది. 24 సంవత్సరాలుగా సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు చేసిన సేవలు శ్లాఘనీయం.
– కిరణ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యమంత్రి
నిజమైన క్రీడాకారుడికి ఘనమైన పురస్కారం దక్కింది. భారతరత్న అవార్డుకు సచిన్ అన్నివిధాలా అర్హుడు. సచిన్‌కు అవార్డు ప్రకటించాలని గత కొన్నేళ్లుగా నేను డిమాండ్ చేశాను. ఆయన విశ్రాంత జీవితం ఆనందమయం కావాలి.
-మమతాబెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం
అత్యుత్తమ క్రికెట్ క్రీడాకారుడికి భారతరత్న ప్రకటించడం అభినందనీయం. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఈ విషయంలో యావత్ దేశ ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వారందరితోపాటు బీహార్ ప్రజలు కూడా సచిన్ కీర్తిని కొనియాడుతున్నారు.
-నితీశ్‌కుమార్, బీహార్ ముఖ్యమంత్రి
భారతరత్న అవార్డుకు సచిన్ టెండుల్కర్ అత్యంత అర్హుడు. మైదానంలో సచిన్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయన రిట్మైంట్ నిర్ణయం కోట్లమంది క్రికెట్ ప్రేమికులను బాధించింది. దేశం సచిన్‌ను చూసి గర్విస్తున్నది.
– నవీన్ పట్నాయక్, ఒడిశా ముఖ్యమంత్రి
క్రమశిక్షణే సచిన్‌ను క్రికెట్లో అత్యున్నతస్థానాలు అందుకునేలా చేసింది. సచిన్‌కు భారతరత్న ప్రకటించడం వేలమంది క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇతరులకు మార్గదర్శకంగా సచిన్ నిలుస్తాడు.
– అశోక్‌గెహ్లాట్, రాజస్థాన్ ముఖ్యమంత్రి
క్రికెట్ దిగ్గజం, యావత్ భారతీయుల అభిమానపావూతుడు సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న లభించడం హర్షణీయం. సచిన్‌కు భారతరత్న ప్రకటించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తనను తాను గౌరవించుకుంది. సచిన్‌కు లభించిన ఈ పురస్కారంపై ప్రతీ భారతీయుడు సంబరపడుతున్నాడు. సచిన్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రధాత.. మార్గదర్శకుడు.
– చిరంజీవి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
బ్యాటింగ్ మాంత్రికుడు సచిన్టెండుల్కర్కు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించడం సంతోషదాయకం. దేశ యువత సచిన్‌ను ఆదర్శంగా తీసుకుంటుంది. భారతరత్న అందుకుంటున్న తొలి క్రీడాకారుడిగా సచిన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
– చంద్రబాబు, టీడీపీ అధ్యక్షుడు
సచిన్‌కు భారతరత్న దక్కడం క్రికెట్ అభిమానుల్ని కేరింతలు కొట్టించింది. సచిన్ సిక్సర్లు, ఫోర్లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టిన కోట్లాది చేతులు నేడు అతడికి సెల్యూట్ చేస్తున్నాయి. క్రికెట్ దేవుడికి భారత ప్రభుత్వం సముచితంగా సన్మానించింది. క్రీడామైదానంలో సచిన్ లోటు పూడ్చలేనిదే అయినా, ఆయన ఆట ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది.
– బాలీవుడ్ ప్రముఖులు లతామంగేష్కర్, అమితాబ్‌బచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, మాధురిదీక్షిత్, అభిషేక్