సర్కార్ కుట్రలను కూలదోసి సడక్ పై సమరనాదం చేసిన తెలంగాణ

(పోరుతెలంగాణ శ్రీనివాస్) : 144 సెక్షన్ అమలు.. ఎటు చూసినా పోలీసులు.. హైవే అంతా ముళ్లకంచెలు.. కనబడితే అరెస్టులు, జై తెలంగాణ నినాదం చేస్తే జీపులో పీఎస్ కు తరలింపు. శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు అనేక కుట్రలు..  అయినా డోన్ట్ కేర్ అన్నది తెలంగాణ. వలసపాలకుల కుట్రలను భగ్నం చేసి బెంగళూరు హైవేపై తెలంగాణవాదులు జంగ్ సైరన్ మోగించిన్రు. పోలీసుల వలయాలను ఛేదించుకుని సడక్ బంద్ ను సక్సెస్ చేసిన్రు. ఎన్ హెచ్ పై ఆత్మగౌరవ నినాదాలు చేసిన్రు. బెంగళూరు హైవే తాకే ప్రతిగ్రామం దగ్గర ప్రజలు రోడ్డు మీదికొచ్చిన్రు. కర్నూలు సరిహద్దులోని అలంపూర్ లో విడతల వారీగా టోల్ గేట్ ను ముట్టడించిన్రు. జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల, ఎమ్మెల్యే జూపల్లి, టీజీఏ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన్రు. అక్రమ అరెస్టుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేసిన్రు. అలంపూర్ లో 55 వాహనాలను ధ్వంసం చేసిన్రు. జడ్చర్లలో వందలాది మంది ప్రజలు హైవేపై రణన్నినాదం చేసిన్రు. వ్యవసాయ పనుల్లో ఉన్నవాళ్లు సైతం రోడ్డుమీదికి వచ్చి జై తెలంగాణ నినాదాలు చేసిన్రు. పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడంతో 40 వాహనాలను నాశనం చేసిన్రు. మాచారంలోనూ 8 వాహనాలను పగలకొట్టిన్రు. షాబాద్ లో కేటీఆర్, హరీశ్వర్ రెడ్డి, బాల్క సుమన్ ను  అరెస్ట్ చేసిన్రు. దీంతో ఆగ్రహించిన తెలంగాణవాదులు పోలీస్ జీపు టైర్లలో గాలితీసిన్రు. అటు శంషాబాద్ లో 5 గంటల పాటు సడక్ బంద్ నిరాటంకంగా జరిగింది. పోలీసులు హరీష్ రావు, పోచారం, స్వామిగౌడ్, నాయిని, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కవిత, టీఆర్ ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, న్యూడెమోక్రస నేతలు, పీవోడబ్ల్యూ సంధ్యను అరెస్ట్ చేసిన్రు. షాద్‌నగర్ వద్ద యువకులు, టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, జేఏసీ నేతలు భారీ సంఖ్యలో సడక్ బంద్‌లో పాల్గొన్నారు. పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నా లెక్క చేయకుండా నిరసన కొనసాగించారు.  కొత్త కోట దగ్గర రైతులు ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. హైవే పొడవునా వందల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉద్యమకారులను భయపెట్టే ప్రయత్నం చేశారు. అయినా తెలంగాణ బిడ్డలు జపడవలేదు సరికదా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలిన్రు. అరెస్టులు, బైండోవర్‌లు, పోలీసుల, ప్రభుత్వ బెదిరింపులు ఆత్మగౌరవ ఆకాంక్ష ముందు ఓడిపోయినయి. హైదరాబాద్-కర్నూ ­లు, ఏపీ-కర్నాటక మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినయి

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.