సరబ్ ఆరోగ్యం విషమం

మరింతగా క్షీణించిన పరిస్థితి
– బ్రెయిన్ డెడ్ అని తొలుత వార్తలు.. ఖండించిన వైద్యులు
– భారత్‌కు తరలించి మెరుగైన వైద్యమందించాలి
– సరబ్ సోదరి దల్బీర్ కౌర్ డిమాండ్
లాహోర్: భారత జాతీయుడు సరబ్‌జిత్‌సింగ్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారింది. కోమాలో ఉన్న ఆయన ఆరోగ్యం మరింత దిగజారిందని లాహోర్‌లో సరబ్‌కు చికిత్స నిర్వహిస్తున్న వైద్యులు మంగళవారం వెల్లడించారు. అయితే సరబ్‌ను బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారని, వెంటిలేటర్ తొలగించే విషయంపై ఆలోచిస్తున్నారని తొలుత వార్తలు వచ్చాయి. వాటిని ఆస్పత్రి వర్గాలు ఖండించాయి. సరబ్‌ను ఇంకా బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించలేదని అల్లామా ఇక్బాల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మహమూద్ షౌకత్ సోమవారం వెల్లడించారు. మహమూద్ షౌకత్ నేతృత్వంలోని నలుగురు వైద్యుల బృందం లాహోర్‌లోని జిన్నా ఆస్పవూతిలో సరబ్‌జిత్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. జిన్నా ఆస్పవూతిలోని ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ న్యూరోసర్జన్లు, వైద్యులు ఉత్తమ వైద్యం అందించి.. ఆయన ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. సరబ్‌జిత్ పరిస్థితి మరింత దిగజారడంతో ఆయనకు అందిస్తున్న ఔషధాలను వైద్యులు మార్చారు. రెండోసారి తీసిన సీటీ స్కాన్‌లోనూ సరబ్‌జిత్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని తేలిందని, పేషంట్ పట్ల రోజువారీ గ్లాస్గో కోమా స్కేలు (జీసీఎస్) పర్యవేక్షణను కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, సరబ్‌జిత్‌కు వైద్యమందించేందుకు లాహోర్‌కు భారత వైద్యులను పిలిపించాలని ఆయన సోదరి దల్బీర్‌కౌర్ డిమాండ్ చేశారు.

ఈ విషయమై భారత్‌కు రావాలని ఆమె యోచిస్తున్నారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు అధికారులు, ఈ ఘటనపై ఏర్పాటు చేసిన భారత్-పాక్ జ్యుడీషియల్ కమిటీలోని సభ్యులు జస్టిస్ ఏఎస్ గిల్, జస్టిస్ ఎంఏ ఖాన్ మంగళవారం సరబ్‌జిత్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సరబ్‌జిత్‌కు రక్షణ కల్పించడంలో విఫలమైనందుకు పంజాబ్ ప్రభుత్వం కోట్‌లఖ్‌పత్ జైలు సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్ సహా ఏడుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. కోట్‌లఖ్‌పత్ జైల్లో ఆరుగురు సహచర ఖైదీలు సరబ్‌జిత్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఆయన తలకు తీవ్రగాయమై. పుర్రె ఎముక విరిగిపోయిందని, ఆయన బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు. 1990 నాటి పంజాబ్ పేలుళ్ల కేసులో సరబ్‌జిత్ పాక్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్నారు. సరబ్ కోలుకుంటారని కేంద్ర విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయం వెలువడిన వైద్య బులిటెన్ అంత ఆశాజనకంగా లేదని పార్లమెంట్ వెలుపల విలేకరులతో తెలిపారు. మరోవైపు కోమాలో ఉన్న సరబ్‌జిత్‌సింగ్‌ను మెరుగైన చికిత్స కోసం భారత్ తీసుకువచ్చేందుకు అత్యున్నత స్థాయిలో కృషి చేయాలని ప్రధాని మన్మోహన్‌కు పంజాబ్ షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ విజ్ఞప్తి చేసింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.