సమ్మె చేయాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేయండి

-రాజకీయ అంశాలపై మీ ఆందోళనలేంటి?

-అంతగా అయితే.. రాజకీయాల్లో చేరండి
-మీరు కార్మికులు కాదు..ప్రభుత్వ ఉద్యోగులు
-ఏపీఎన్జీవోల ఆందోళనలపై హైకోర్టు ఆగ్రహం
-వేతనాల సమస్య అయితే అర్థం చేసుకోవచ్చు
-మీ ఆందోళనలకు కారణం మీరు చెబుతున్నది కాదు
-పిటిషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ జ్యోతిసేన్
-కేసు విచారణ సోమవారానికి వాయిదా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన ఏపీ ఎన్జీవోలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం తీవ్రంగా మండిపడింది. ఉద్యోగులకు రాజకీయ అంశాలతో సంబంధమేమిటని నిలదీసింది. సమ్మె విరమించాలని ఆదేశించింది.
లేదంటే ఉద్యోగాలకు రాజీనామాలు చేసి.. రాజకీయాల్లో చేరి సమ్మె చేయాలని సూచించింది. మీరు చేస్తున్న ఆందోళనలకు కారణం మీరు చెబుతున్నది కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి, సర్వీస్ సమస్యలపైకాకుండా ఇతర అంశాలపై ప్రభుత్వానికి సవాలు విసరటమేంటని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జూలై 30న సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏపీ ఎన్జీవో నేతృత్వంలో ఉద్యోగులు ఆగస్టు 12నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సమ్మెను సవాలు చేస్తూ తెలంగాణ జూనియర్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వద్యారపు రవికుమార్ గత వారం హైకోర్టులో ప్రజావూపయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని, రాజ్యాంగబద్ధమైన కొత్త రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించే హక్కు ఉద్యోగ సంఘాలకు లేదని రవికుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సర్వీస్ సమస్యలపై కాకుండా ఇతర రాజకీయ అంశాలపై ఉద్యోగులు సమ్మె చేయడాన్ని తప్పుపడుతూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై మొదటిసారిగా సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ కేసీ భాను ఆధ్వర్యంలోని ధర్మాసనం.. ప్రతివాదులైన ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, సీమాంధ్ర సెక్ర ఉద్యోగుల సంఘం తరఫున మురళీకృష్ణకు నోటీసులు జారీచేసింది. ఆ మేరకు తదుపరి విచారణను బుధవారం చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన వినిపిస్తూ.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జీవోలు సమ్మె చేపడుతున్నాయని వివరించారు. రాజకీయ అంశంపై ఉద్యోగ సంఘాలకు సమ్మె చేపట్టే హక్కు లేదని కోర్టుకు వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా స్పందిస్తూ.. సమ్మె ఎందుకు చేస్తున్నారని ఏపీ ఎన్జీవో, సీమాంధ్ర సెక్ర ఉద్యోగుల సంఘం తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు.

దీనికి వారు బదులిస్తూ.. సమ్మె ఎందుకు చేపట్టిందీ వివరించేందుకు సమయం కావాలని కోరారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విజయనగరంలో ఉన్నారని, కనుక కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె చేపట్టడానికి ముందే ప్రభుత్వానికి నోటీసులు సైతం ఇచ్చామని పేర్కొన్నారు. తమ కేసులో సీనియర్ న్యాయవాది అందుబాటులో లేరని, కనుక కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని ఏపీ ఎన్జీవో తరఫు మరో న్యాయవాది కూడా కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇలాంటి పొంతనలేని (ఇపూరిపూ సమాధానాలు చెప్పవద్దని అన్నారు. సమ్మెకు ముందు ప్రభుత్వానికి నోటీసులు అందించినట్లు, నోటీసులోని 11వ పేజీలో ఇదే అంశాన్ని ప్రభుత్వానికి తెలియజేసినట్లు అశోక్‌బాబు తరఫు న్యాయవాది వివరించారు. దాంతో ధర్మాసనం ఆ పేజీని పరిశీలించింది. ఉద్యోగ అంశాలపై కాకుండా రాజకీయ నిర్ణయం ప్రకటనపై ఆందోళన చేస్తున్నట్లు ఈ పేజీని పరిశీలిస్తే అర్థమవుతున్నదని వ్యాఖ్యానించింది. రాజకీయ అంశంపై సమ్మెకు వెళ్లే హక్కు, అధికారం ఉద్యోగులకు లేదు కదా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దీనిపై.. ఏపీ ఎన్జీవో రిజిస్టర్డ్ సంస్థ అని, గుర్తింపు పొందిన సంఘమని ప్రతివాది తరఫు న్యాయవాదులు చెప్పబోయారు. ఇందుకు న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రిజిస్ట్రేషన్ కావచ్చు.. కాకపోవచ్చు. మీరు కార్మికులు (వర్క్‌మెన్) కాదు.

పారిక్షిశామిక వివాదాల చట్టాల ప్రకారం సమ్మె చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం లేదు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పారిక్షిశామిక వివాదాల చట్టాలు (ఐడీ యాక్ట్) వర్తిస్తాయా? అంటూ ప్రతివాదుల తరఫు న్యాయవాదులను కోర్టు ప్రశ్నించింది. సమ్మె చేయడం ప్రాథమిక హక్కు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. కార్మిక వర్గాలకు కొన్ని అంశాల ఆధారంగా ఐడీ యాక్ట్ ప్రకారం సమ్మె చేసే హక్కు ఉంటుందని, అది శాసన హక్కు (స్టాట్యూటరీ రైట్) మాత్రమేనని కోర్టు పేర్కొంది. సమ్మె చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘ముందుగా సమ్మెను విరమించండి. ఒక వేళ మీరు సమ్మె కొనసాగించాలనుకుంటే ముందుగా ఉద్యోగాలకు రాజీనామా చేసి, రాజకీయ పార్టీల్లో చేరి, సమ్మెలకు వెళ్లండి’ అని కోర్టు తీవ్రస్థాయిలో మందలించింది. ప్రభుత్వంలో భాగస్వాములై ఉండి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ పాలనా కార్యకలపాలు ఎందుకు స్తంభింపచేస్తున్నారని ఏపీ ఎన్జీవోపై మండిపడింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాధనం (పబ్లిక్ ఎక్స్‌చెకర్)తో సంబంధముంటుందని, పన్నుల రూపంలో చెల్లించే ధనం నుంచి జీతాలు చెల్లిస్తారని కోర్టు పేర్కొంది. ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ అంశాలు, విధులపై సమస్యలు ఉంటే పరిష్కరించడానికి తాము సుముఖంగా ఉన్నట్లు న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

రాజకీయ అంశాలపై సమ్మె చేపడుతూ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా విభాగానికి ఎందుకు అంతరాయం కల్గిస్తున్నారని (వై ఆర్ యూ ప్యారలైజింగ్ ది స్టేట్ ఆడ్మినిస్ట్రేషన్?) నిలదీసింది. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని (నో బడీ కెన్ ది లా ఆన్ హిజ్ ఓన్ హ్యాండ్స్) స్పష్టం చేసింది. దీనిపై ఎన్జీవోల సంఘం తరఫు న్యాయవాది ‘సమ్మెకు వెళ్లడంపై పూర్తిస్థాయిలో కౌంటర్ దాఖలు చేస్తాం. భావవ్యక్తీకరణ హక్కు ఉద్యోగులకు ఉంది’ అని చెప్పారు. దీంతో మరోసారి న్యాయస్థానం విరుచుకుపడింది. రాజకీయ అంశంపై సమ్మెకు వెళ్లడం భావ వ్యక్తీకరణ హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది. విభజన ప్రక్రియ రాజకీయ అంశం కదా? దాంతో ఉద్యోగులకు సంబంధమేంటి? రాజకీయ పార్టీ ప్రకటనపై మీరు సమ్మె చేపట్టడమేమింటి? అని ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై ప్రతివాద తరఫు న్యాయవాది సమాధానమిస్తూ.. పార్టీ ప్రకటన కాదని, పార్లమెంట్‌లో సైతం మంత్రి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ముందుకు వెళుతున్నామని ప్రకటన చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్‌గౌడ్‌ను వివరణ అడిగింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. కేంద్ర కేబినెట్ ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వివరించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ఒకవేళ విభజనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నిరోధించే అధికారం లేదని స్పష్టం చేసింది. సమ్మెకు వెళ్లడాన్ని అంగీకరించేది లేదని తెలుపుతూ.. సమ్మెకు వెళ్లడాన్ని ఏ విధంగా సమర్ధించుకుంటారో సోమవారం (ఆగస్టు 26)లోగా తమకు కౌంటర్ రూపంలో తెలియచేయాలని ప్రతివాదులైన ఏపీఎన్జీవో ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, సీమాంధ్ర సెక్ర ఉద్యోగుల సంఘం తరఫు న్యాయవాదులకు న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుందా? అనే విషయాన్ని తెలియచేయాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పొన్నం అశోక్ గౌడ్‌కు ఆదేశాలు జారీచేసింది. సమ్మె విరమింపజేయడానికి చేస్తున్న ప్రయత్నాలు, సమ్మెతో ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దడానికి చేపడుతున్న చర్యలపై వివరణను సోమవారంలోగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసును ఆ రోజు మొదటగా కోర్టు ముందుకు వచ్చేలా చూడాలని హైకోర్టు సిబ్బందిని ఆదేశించింది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.