సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం అబద్ధం-సీఎం

హైదరాబాద్, జనవరి 23 :సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఏ రకమైన అన్యాయం జరగలేదని గురువారం శాసనసభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై బుధవారం చేసిన ప్రసంగాన్ని ఆయన గురువారం కొనసాగించారు. మధ్యాహ్నం ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కొందరు సత్యదూరమైన మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి, విద్వేషాలు సృష్టించారని అన్నారు. ఆ విద్వేషాలను తాను తొలగించే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆంధ్రా ముఖ్యమంత్రులంతా తెలంగాణకు అన్యాయం చేశారని అన్నారని, దానిని తొలగించే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. ఇందిరాగాంధీ చెప్పినట్లు విభజన జరిగినా కలిసి ఉండాలని, విద్వేషాలు ఉండకూడదని చెప్పే ప్రయత్నం చేస్తున్నానన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని లెక్కలతో సహా వివరిస్తానన్నారు. nallari
సాగునీటి రంగంలో ఆంధ్రలోనే తక్కువ అభివృద్ధి..
1956లో రాష్ట్రంలో 69.65 లక్షల ఎకరాల భూమి సాగులో ఉందని సీఎం పేర్కొన్నారు. ప్రాంతాలవారీగా పరిశీలిస్తే ఆంధ్రలో 62%, రాయలసీమలో12.3% తెలంగాణలో 25% భూములకు సాగునీరు అందేదన్నారు. 1956 నుంచి ఈరోజు వరకు చూస్తే ఆంధ్రప్రాంతంలో ఆయకట్టు అభివృద్ధి 40.96% మాత్రమేనని, రాయలసీమలో 13.3% కాగా తెలంగాణలో 45.68% అభివృద్ధి చేశామని చెప్పారు. 1956 నుంచి ఇప్పటివరకు ఇరిగేషన్ కోసం ఆంధ్రాలో రూ.31.360 లక్షల కోట్లు, రాయలసీమలో రూ.25.885 లక్షల కోట్లు, తెలంగాణలోరూ.44.150 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీంట్లో అన్యాయం జరుగలేదన్నారు. 2004 నుంచి రూ. 85 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. తెలంగాణలో 46శాతం నిధులు ఖర్చు చేశామని వివరించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం రెండు ప్రాంతాలు కలిసి ఉన్నాయి కనుకనే సాధ్యమైందని అన్నారు.

1955లో ఈ ప్రాజెక్టుకు నెహ్రూ పునాది వేస్తే 1967లో ఇందిర ప్రారంభించారన్నారు. ప్రకాశం బ్యారేజీని కలుపుకుంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కలుపుకొని 27.67 లక్షల భూమి సాగులో ఉందన్నారు. శ్రీశైలం డ్యామ్‌ను మొదట పవర్ జనరేషన్ కోసం నిర్మించినా ఇరిగేషన్‌లోకి తీసుకు వచ్చామని, దీంతో 26 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నికర జలాలు, వరద జలాలు వాడుకుంటున్నామన్నారు. మొన్ననే పులిచింతల ప్రారంభమైందని దీని ద్వారా 13 లక్షల భూమి స్థిరీకరణ జరిగిందన్నారు. కృష్ణా డెల్టాలో 1955లోనే నాలుగున్నరలక్షల ఎకరాల భూమి సాగులో ఉండేదని, ఇప్పుడు 43 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. కృష్ణా డెల్టా అంటే కృష్ణా జిల్లా కాదని, కృష్ణా నీటి పరివాహక ప్రాంతం మొత్తమని తన ఉద్దేశమన్నారు. ఆనాడు కృష్ణా నదిపై ప్రాజెక్టులు లేవని, నీరు అంతా కిందకే వచ్చేదన్నారు. పైన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు ఉన్నాయని నీరు ఆగస్ట్ తరువాతనే వస్తుందన్నారు.

దీంతో పంటలు తుపాన్‌కు గురవుతున్నాయని, దీనిని ఏవిధంగా నివారించాలనే ఉద్దేశంతో డిల్లీ ఐఐటీని స్టడీ చేసి ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు అన్ని పూర్తి అయితే 281 టీఎంసీల నీరు తగ్గుతుందన్నారు. కరువు వచ్చినప్పుడు 59 టీఎంసీల నుంచి 100 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. నీరు బాగా ఉన్నప్పుడు వాడుకునే వెసులు బాటు ఉందన్నారు. కృష్ణా నీటి పంపకాలపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును మనం అంగీకరించడం లేదన్నారు. దేశంతో పాటు, మన రాష్ట్రం మీద ప్రభావం ఉంటుందని ప్రధానికి వివరించామన్నారు. అన్ని పార్టీలతో అఖిల పక్షం ప్రధాని వద్దకు వెళ్లామన్నారు. ఆగస్టు తరువాత నీరు వస్తుందని, జూన్‌లో పంటలు వేసుకుంటే తుఫాన్లను తప్పించుకోవచ్చునన్నారు. ఈ మేరకు 175 టీఎంసీల నీటిని అదనంగా తెచ్చుకునే అవకాశం ఉందని ఐఐటి ఢిల్లీ వారు వివరించారన్నారు. రైతులకు జూన్‌లో నీరు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని ఇందులో భాగంగానే పులిచింతల, పోలవరం, దుమ్ముగూడెం- టెలిఫాండ్ పూర్తి చేసుకుంటే నీరు ఇవ్వవచ్చునని, ఇవన్నీ రాష్ట్రం కలిసి ఉంటేనే చేయవచ్చునని అన్నారు.

విభజన వల్ల నెట్టింపాడు కల్వకుర్తికి నీళ్లుండవు..
రాష్ట్ర విభజన జరిగితే నెట్టెంపాడు, కల్వకుర్తి, ఏ ఎం ఆర్‌టీ ప్రాజెక్టులకు పై రాష్ట్రం కావడం వల్ల నీటి వెసులు బాటు కోల్పోతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులకు నీరు కోల్పోతారని వివరిస్తున్నానన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన రూ.12,700 కోట్ల రూపాయల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అవుతుందన్నారు. కలిసి ఉంటే ఇంటర్ బేసిన్ చేంజ్ ద్వారా నీరు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడకు మళ్లించుకునే అవకాశం ఉంటుందన్నారు. అన్ని జిల్లాలు నీరు కోరితే కేంద్రం ఆధీనంలో ఉండే పంపిణీకి అవకాశం ఉండదని, హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లా ఇంజనీర్లు ప్రాణాలకు తెగించి కాపాడారన్నారు. మన ప్రాజెక్టులన్నీ రెండు ప్రాంతాలకు సరిహద్దులో ఉన్నాయని, కృష్ణా నది రెండు ప్రాంతాలకు సరిహద్దుల్లో 250 కిలో మీటర్లు ప్రవహిస్తుందని, దీంతో సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. విద్యుత్, నీటి పంపిణీ ఒక రాష్ట్రంలో అయితేనే న్యాయం చేయవచ్చునన్నారు.

శ్రీశైలంలో 872 అడుగులకు పైన హంద్రీ- నీవాకు నీళ్లు వదులుతారని, దానిపైన కేవలం 65 టీఎంసీలకు మాత్రమే అవకాశం ఉందన్నారు. విద్యుత్ ఉత్పత్తిని, సాగునీటిని బ్యాలెన్స్ చేస్తేనే మేలు జరుగుతుందని వివరించారు. ఆరురోజుల్లో హంద్రీ-నీవాకు నీరు వెళ్లాలని అన్నారు. 857 అడుగులకు 20 రోజుల పాటు ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్‌లకు నీరు వెళుతుందని, వీటి ద్వారా 13 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. పవర్, ఇరిగేషన్ బ్యాలెన్స్ చేసుకొని పోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ప్రాంతానికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు సీమాంధ్ర ప్రజలు అభ్యంతరం చెప్పలేదని, పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతం వాళ్లు అభ్యంతరం చెప్పడం ఎంత వరకు సబబు అని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మంలో 205 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారని 45 వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతున్నదన్నారు. దీనిని పూర్తి చేయడానికి కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
విద్యుత్ ప్రాజెక్టులకు 62 వేల కోట్లు కావాలి..
తెలంగాణలో నీటిని లిఫ్ట్ చేయాలంటే 175 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమన్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు పూర్తికావాలంటే రూ.62 వేల కోట్లు కావాలని అన్నారు. సమైక్య రాష్ట్రం ఉంటేనే ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలమన్నారు. 1956-57లలో రాష్ట్రంలో 4930 పంపుసెట్లు ఉంటే తెలంగాణలో 231 మాత్రమే ఉన్నాయని, 2012 నాటికి ఆంధ్రా, రాయలసీమలో 13 లక్షల పంప్ సెట్లు ఉండగా తెలంగాణలో 17 లక్షల పంపుసెట్లు ఉన్నాయన్నారు. 57 శాతం కరెంటును తెలంగాణ రైతులకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. ఉచిత పవర్ ద్వారా రూ.19,377 కోట్లు తెలంగాణ రైతులకు మేలు జరిగిందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే 40 నుంచి 50 శాతం విద్యుత్ తెలంగాణలో ఉండదన్నారు. తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని, మనం అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వారు తమకు బొగ్గు ఉన్నదని, బొగ్గు అంతా ఆంధ్రాలో వాడుకుంటున్నారని పదే పదే అంటున్నారని, 2007 నుంచి సింగరేణి బొగ్గు కేటాయింపులు కేంద్రం చేస్తున్నది కానీ రాష్ట్రం కాదని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు 185.60 లక్షల టన్నుల బొగ్గు కేటాయిస్తే, రాయలసీమకు 38.80 లక్షల టన్నుల బొగ్గు కేటాయించారని, ఆంధ్రాకు ఒక్క టన్ను బొగ్గు కూడా కేటాయించలేదన్నారు. అసత్యాలు పదే పదే చెపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.