సమైక్య రాష్ట్రంలో గౌడ్‌లకు తీరని అన్యాయం

సమైక్యరాష్ట్రంలో గౌడ్‌లకు తీరని అన్యాయం జరుగుతుందని తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు కత్తి వెంకట స్వామి అన్నారు. ఈ నెల 24న నిజాం కళాశాల మైదానంలో జరిగే తెలంగాణ గౌడ సమరభేరి సభను విజయవంతం చేయాలని కోరుతూ కౌండిన్యగౌడ, గీతవృత్తిదారుల సంఘం, తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సన్నాహక సభకు హాజరైన వెంకట స్వామి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో కుల వృత్తులను నమ్ముకొని జీవిస్తున్నవారి పట్ల సీమాంధ్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, ఈ వృత్తులను కనుమరుగు చేసేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు కొనసాగిస్తోందని ఆయన అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కల్లుదుకాణాలను నడుపుతున్న గీత కార్మికుల సంక్షేమం కోసం పాటుపడకుండా ప్రభుత్వం పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నదని ఆరోపించారు. టీజీవో అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో గౌడ్‌లకు తీవ్రఅన్యాయం జరిగిందన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న నిజాం కళాశాల మైదానంలో జరిగే గౌడ సమరభేరికి లక్షలాది మంది గౌడ్‌లు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్షికమంలో గౌడ వృత్తిదారుల సంఘం నాయకులు మాజీ ఎమ్మెల్యే దేశం చిన్న మల్లయ్య, పంజాల జైహింద్‌గౌడ్, శంకర్‌గౌడ్, అంబాల నారాయణగౌడ్, టీ పోచయ్యగౌడ్, ఏ మాణిక్ ప్రభుగౌడ్, కే విష్ణుగౌడ్, ఏ వెంకన్నగౌడ్, బీ భిక్షపతిగౌడ్‌లు పాల్గొన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.