సమైక్య భూస్కామ్

మంత్రి గంటా శ్రీనివాసరావు.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం రాజీనామా చేస్తానని ఇప్పటికీ బెదిరిస్తూనే ఉన్న సీమాంధ్ర నేత! హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తామేనని, రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని పార్లమెంటులో సైతం నానా రగడ చేసిన టీడీపీ ఎంపీ సుజనాచౌదరి! జై సమైక్యాంధ్ర నినాదంతో గుంటూరు జిల్లాలో చెలరేగి ఉద్యమిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు! మతం పేరుతో సుద్దులు చెప్పే రెవరెండ్ డాక్టర్ సతీష్‌కుమార్! తనకు నేరుగా సోనియాతోనే పరిచయం ఉందని ప్రచారం చేసుకుంటూ సీమాంధ్ర ప్రజా ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన మంచాల సాయిసుధాకర్!! వీరందరి మధ్య ఒక సారూప్యత ఉంది! వీరందరి మధ్య కబ్జాల అనుబంధమూ ఉంది! రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆవిర్భవిస్తే ఇక్కడ ఏర్పడే ప్రభుత్వం తమ భరతం పడుతుందన్న ఆందోళన ఉంది! సమైక్య రాష్ట్రం కొనసాగితే తమ కబ్జాలు యథేచ్ఛగా కొనసాగించి.. కోట్లు దండుకోవచ్చన్న పన్నాగాలున్నాయి! విభజన అనివార్యమైతే హైదరాబాద్ శాంతి భద్రతలను కేంద్రం చేతిలో పెట్టాలన్న డిమాండ్ల వెనుక.. అసలు నగరాన్ని యూటీ చేయాలనే కోరికల వెనుక అనేక కుట్ర కోణాలు కనిపిస్తున్నాయి.
ఆ కుట్రల వెనుక ఉన్న ప్రయోజనాల్లో మచ్చుతునకే.. ఇప్పటికే ఆచరణలో పెట్టిన హైదరాబాద్ శివార్లలోని రూ.860 కోట్లు విలువ చేసే 62 ఎకరాల హెచ్‌ఏఎల్ ఉద్యోగుల భూ స్కామ్! కబ్జాకు గురైన హెచ్‌ఏఎల్ ఉద్యోగుల 62 ఎకరాలుసీమాంధ్ర నేతల గుప్పిట్లో రూ.860 కోట్ల భూములు

హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఉద్యోగులు పైసా పైసా కూడగట్టుకుని కొనుకున్న భూమిని సీమాంధ్ర నాయకులు బినామీల పేరుతో కబ్జా చేసేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శేరిలింగంపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోగల హఫీజ్‌పేటలోని సర్వే నంబరు 77లో ఉన్న 62 ఎకరాల భూమి ఎకరం 14 కోట్లు పలుకుతున్నది. అంటే మొత్తం విలువ రూ.860 కోట్లపైనే ఉంటున్నది. అన్నదమ్ముల్లా కలిసుందాం రమ్మనే ఈ సమైక్యవాదులు.. తాము కబ్జా చేసిన భూముల అసలు యజమానులను కనిపిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులకు మొరపెట్టుకుంటే పట్టించుకున్న నాథుడు లేకపోయాడని వాపోతున్నారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు అమలు చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను అడిగేవారు లేరన్న ధీమా పెంచుకున్న కబ్జాకోరుల్లో ఒకరు ప్రార్థనామందిరం నిర్మిస్తుంటే.. మరొకాయన ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్‌నే మొదలు పెట్టేశారు. కానీ.. స్థలం అసలు యజమానులైన హెచ్‌ఏఎల్ ఉద్యోగులు మాత్రం ఎప్పటికైనా తమకు న్యాయం దక్కకపోతుందా? అన్న ఆశతో దశాబ్దకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తేనైనా తమ భూములు తమకు దక్కతాయని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ నేపథ్యం:
1948కి ముందు ఇవి నిజాం సర్ఫేఖాస్ భూములు. ఇవి తమవేనని పైగా వారసులు, కాదు.. ఇవి సర్కారీ భూములేనని ప్రభుత్వ అధికారులు 1958లో పరస్పరం కేసులు (సీఎస్ 14/1958) వేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ భూములు పైగా వారసులకే చెందుతాయని 1963లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై ప్రభుత్వం హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. దానిని పరిశీలించిన హైకోర్టు ఫుల్ బెంచ్ 1976లో కూడా ఈ భూమి పైగా వారసులదేనని తేల్చి చెప్పింది. అయినా కోర్టు తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయలేదు. దీంతో కోర్టు అపాయింట్ కమిషనర్ 1981లో హక్కుదారులకు ఈ భూమిని అప్పగించారు. అప్పటికే వివిధ కారణాలతో ఈ భూమిని విక్రయించాలని భావించిన పైగా వారసులు 13 మంది కలిసి ఈ భూమిని హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు విక్రయించారు.

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో పని చేస్తున్న ఉద్యోగులు 805 మంది హెచ్‌ఏల్ ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీగా ఏర్పడ్డారు. తలా కొంత సొమ్ము వేసుకొని సొసైటీ తరపున పైగా వారసుల నుంచి హఫీజ్‌పేట (మియాపూర్ వద్ద ఉన్నది)లోని సర్వే నంబర్ 77లో 62 ఎకరాల 6 గుంటల భూమిని 1981లో కొనుగోలు చేసి, లేఅవుట్ చేసుకున్నారు. అప్పట్లో హఫీజ్ పేట.. శేరిలింగంపల్లి పంచాయతీలో ఉండడంతో రూ.59 వేలు గ్రాపంచాయతీకి చెల్లించి లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నారు. ఇళ్లు కట్టుకునేందుకూ సిద్ధమయ్యారు. ఆ తరుణంలో అధికారులు కొత్త పేచీలు పెట్టారు. 1983లో ఈ భూమి తమదంటూ సీమాంధ్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. 2002లో సుప్రీంకోర్టు కూడా ఉద్యోగస్తులకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భూములను కొనుగోలు చేసినవారికే అప్పగించాలని 2004లోనూ ఆదేశించింది. కానీ.. వాటిని అమలు చేసిన అధికారులు లేకపోయారు.

భూముల విలువ అమాంతంగా పెరగడంతో….
2004లో సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన సమయానికి హైదరాబాద్‌లో రియల్ బూమ్‌కు రెక్కలు వచ్చాయి. గతంలో ఎకరం భూమి లక్షల్లో ఉండగా అది ఇప్పుడు కోట్లకు పెరిగింది. హెచ్‌ఏఎల్ ఉద్యోగులు కొన్న భూమి 9వ జాతీయ రహదారికి అతిసమీపంలో ఉండడంతో ఎకరం భూమి విలువ రూ. 14 కోట్లు పలుకుతున్నది. దీంతో అత్యంత విలువైన ఈ భూములపై సీమాంధ్ర కబ్జాదారుల కన్ను పడింది. భూమి కొనుగోలు చేసిన ఉద్యోగులను అక్కడి నుంచి గెంటేశారు. ఇది తమ భూమేనంటూ సీమాంవూధకు చెందిన మంత్రి గంటా శ్రీనివారావు, టీడీపీ ఎంపీ సుజనాచౌదరి, టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, మత ప్రభోధకుడు డాక్టర్ సతీష్‌కుమార్, సీమాంధ్ర ప్రొటెక్షన్ ఫ్రంట్ సంస్ధ వ్యవస్థాపకుడు మంచాల సాయిసుధాకర్, కూకట్‌పల్లి స్థానిక నేత శ్రవణ్‌కుమార్ తదితరులు రెచ్చిపోయి కబ్జా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎవరికి వారు దొంగ పత్రాలు, దొంగ వారసులను సృష్టించి రూ.850 కోట్ల విలువ చేసే భూమిని ఫలహారంలా పంచుకున్నారని ఉద్యోగులు వాపోతున్నారు.

గంటా బాటలో సుజనా.. తదితరులు
గంటా కబ్జా విజయవంతం కావడంతో టీడీపీ ఎంపీ, బడా వ్యాపార వేత్త సుజనాచౌదరి కూడా ఓ బినామీని ముందుకు తెచ్చి.. నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేశారని సమాచారం. చౌదరి స్వంత సంస్థ అయిన సుజనాలో ఉపాధ్యక్షులుగా పని చేస్తున్న జవహర్‌బాబు పేరుతో కథంతా నడిపారని తెలుస్తున్నది. షబ్బీర్ అలీఖాన్ అనే పైగా కుటుంబీకుడు తనకు ఈ స్థలాన్ని విక్రయించాడని వీరు చెబుతున్నారు. తామెందుకు వెనుకబడాలనుకున్నారేమో.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు తీవ్రమైన సమయంలో నగరంలో ప్రత్యక్షమైన గుంటూరు జిల్లాకు చెందిన మత బోధకుడు రెవండ్ డాక్టర్ సతీష్‌కుమార్, రెండేళ్ల క్రితం అదే జిల్లా నుంచి నగరానికి వలస వచ్చిన మంచాల సాయికుమార్ కలిసి దేవుడి పేరుతో హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు చెందిన 13 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఇక్బాల్ ఆలీఖాన్ దగ్గర తాము భూమిని కొన్నట్లు చెపుతున్న వీరు ఇక్కడ దేవుడి పేరుతో భారీ దందానే కొనసాగిస్తున్నారు. శాశ్వత నిర్మాణాలు చేశారు. ఎవరైనా అడిగితే ఈ భూమిపై తమకు చట్టబద్ధమైన హక్కులున్నాయని బుకాయిస్తున్నారు. ఇదే జిల్లాకు చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఇదే భూమిపై కన్నేశారు. ఇందుకోసం ఆయన రావెళ్ల రోశయ్య అనే బినామీని ముందుకు తెచ్చినట్లు సమాచారం. కూకట్‌పల్లిలో స్థానిక నాయకుడిగా చెలామణీ అయ్యే శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తి కూడా ఈ ఖాళీ భూమిలో తనది కూడా ఉందని అక్కడే మకాం వేశారు. దీంతో ఉద్యోగులకు చెందిన స్థలంలో ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమంగా నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి.

ఉద్యోగులు బాసటగా కోర్టు తీర్పులు
హెచ్‌ఏఎల్ ఉద్యోగులకు అండగా న్యాయస్థానం పలు తీర్పులను ఇచ్చింది. ఒకే భూమి విషయంలో న్యాయస్థానాలు పలుసార్లు తీర్పులు ఇచ్చిన అరుదైన కేసు ఇదే కావచ్చునని పరిశీలకులు అంటున్నారు. అయినా న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను గౌరవించి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు దక్కే విధంగా చూడాల్సిన అధికార యంత్రాంగం.. అందుకు విరుద్ధంగా తమ ప్రాంతానికి చెందిన కబ్జాదారులకే వంతపాడుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. పైగా కోర్టు తీర్పులు అమలు కాకుండా ఏం చేయాలో సలహాలు కూడా ఇస్తున్నారని సమాచారం.
వివిధ సందర్భాల్లో ఈ స్థలంపై వచ్చిన తీర్పులు..
-హఫీజ్‌పేట గ్రామ పరిధిలో గల సర్వే నంబర్ 77లోని 62 ఎకరాల భూమి కొనుగోలుదారులకే చెందుతుందని 2002లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. భూమిని కొనుగోలుదారులకు అప్పగించాలని నవంబర్ 2004లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
-భూ ఆక్రమణలను అడ్డుకోవడానికి సొసైటీ తరపున సివిల్ కోర్టులో వేసిన కేసు సివిల్ సూట్ 359/2001పై న్యాయస్థానం తీర్పును ఇస్తూ సదరు భూమి కబ్జా కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇన్‌జంక్షన్ ఆర్డర్ ఇచ్చింది.
-ప్రస్తుతం హైకోర్టులో డబ్ల్యూపీ 18933/2012 సంబంధించిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ నర్సింహాడ్డి పోలీసుల సహాయంతో హెచ్‌ఏఎల్ ఉద్యోగుల ఇళ్ల స్థలాలను రక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
-ఇదే భూమిని అక్రమంగా రిజిస్టర్ చేశారని, వాటిని రద్దు చేయించాలని కోరుతూ డబ్ల్యూపీ 32913/2012కు సంబంధించిన పిటిషన్‌లో న్యాయమూర్తి జస్టిస్ నాగార్జునడ్డి తీర్పు ఇస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని ఆదేశించారు. తీర్పును నిర్దిష్ట సమయంలో అమలు చేయనందుకు 2013లో కోర్టు ధిక్కార నేరం నమోదైంది. దీనిపై అన్యాయం జరుగకుండా ఆపాలని న్యాయమూర్తి ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు.
-కోర్టు ఆదేశాలను అధికారులు గౌరవించడం లేదంటూ, తమకు భూమిని తమకు ఇప్పించడం లేదంటూ ఉద్యోగులు సొసైటీ నుంచి డబ్ల్యూపీ 27045/2013 పేరుతో హైకోర్టులో మరో కేసు వేశారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు.
-ఉద్యోగుల స్థలంలో అక్రంగా కల్వరి టెంపుల్‌ను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే జీహెచ్ ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని, వారికే అండగా ఉన్నారని ఆరోపిస్తూ ఉద్యోగస్థులు సొసైటీ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్‌రావు తీర్పు ఇస్తూ ఈ భూమిలో వెలసిన అనుమతి లేని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. ఆ ఆదేశాలూ అమలు కాలేదు. పైగా అక్రమణదారులను అధికారులు పరోక్షంగా ప్రోత్సహించి, డివిజన్ బెంచ్‌కు వెళ్లి స్టే తెచ్చుకునేలా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. స్టే అనేది కేవలం 15 రోజులు మాత్రమే అమల్లో ఉంటుంది. ఆలోపు న్యాయస్థానం నుంచి తదుపరి ఆదేశాలు రావాలి. లేనిపక్షంలో స్టే రద్దయిపోతుందని ర్యాజాంగంలోని సెక్షన్ 226 స్పష్టం చేస్తున్నది. దీని ప్రకారం స్టే వెకేట్ అయినా.. న్యాయమూర్తి ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదు.

బినామీలతో కథ నడిచింది ఇలా..
విలువైన ఈ భూమిని స్వాధీనం చేసుకునేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు తమ బినామీలను రంగంలోకి దింపారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో టీడీపీ తరఫున ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన గంటా.. 2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి అధికార పార్టీ టీడీపీ అండతో భూ కబ్జాలకు తెర లేపారన్న విమర్శలు ఉన్నాయి. తన పలుకుబడిని ఉపయోగించి 2005లో ఈ భూమికి దొంగ యాజమానులను సృష్టించి తనకు అనుకూలంగా ఉన్న అధికార యంత్రాంగంతో కథంతా నడిపారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గంటాకు బినామీగా భావించే వీ రాజారావు.. వెదిరె పాండురంగాడ్డికి చెందిన వెదిరె ఎస్టేట్‌కు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎస్టేట్‌లో ప్రధాన భాగస్వామిగా కూడా మారారు. కొద్దికాలానికే వెదిరె ఎస్టేట్ పేరుతో హెచ్‌ఏఎల్‌కు చెందిన 25 ఎకరాల భూమిని తమ పేర రిజిస్టర్ చేసుకొని కబ్జా చేశారు. ఈ భూమి తమదంటూ ఉద్యోగులు అక్కడికి వెళితే.. వారిని అడ్డుకున్న మంత్రి గూండాలు తమను కాల్చి చంపుతామని బెదిరించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పాండురంగాడ్డి ఏకంగా మంత్రి తమవాడేనని, తమను పీకేవీడు ఎవడూ లేడని అడ్డగోలుగా మాట్లాడటంతో తాము బెదిరిపోయామని ఉద్యోగస్తులు చెబుతున్నారు.

-నమస్తే తెలంగాణ

This entry was posted in ARTICLES.

Comments are closed.