సమైక్యంపై చిత్తశుద్ధి ఉంటే చర్చలో పాల్గొనండి-సీఎం

రాష్ట్ర అసెంబ్లీ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తేనే ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతుందని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుంటే బిల్లును అసెంబ్లీ పంపించరని, దీనినే తమిళనాడు, కర్నాటక రాష్ట్ర అసెంబ్లీలకు ఎందుకు పంపలేదు ? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం దాని తూకం దానికి ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. బుధవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు.

తనకు తెలిసినంతవరకు ఒక అసెంబ్లీ భిన్న అభిప్రాయాలు తెలిపిన తర్వాత విభజన జరగలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా కొనసాగించేందుకు టీడీపీ, వైఎస్సార్సీపీలకు నిజంగా చిత్తశుద్ధ్ది ఉంటే అసెంబ్లీ చర్చలో పాల్గొనాలని కోరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని అన్ని రాజకీయపార్టీలు కోరిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఆఖర్లో నిర్ణయాన్ని ప్రకటించాయని తెలిపారు. ‘మా పార్టీ ఒక జాతీయపార్టీ, రాష్ట్రంలో మా పార్టీ ప్రభుత్వం ఉంది. మా నిర్ణయాలన్నీ కూడా జాతీయపార్టీ తీసుకున్న నిర్ణయాలు. మామూలుగా అయితే వాటిని మేమంతా పాటించడం జరుగుతుంది . కానీ, ఈ నిర్ణయాన్ని(విభజన) వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ప్రజల ఆకాంక్షమేరకు పోరాటం చేస్తున్నారని సీఎం వివరించారు.

ఈ అంశంలో మాఅందరి రాజకీయ భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందనే ఆలోచన చేయకుండా అన్ని రకాల ఇబ్బందులు వస్తాయని, సమైక్యంగా కలిసి ఉంటేనే మరింత వేగవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, విభజనను మేము వ్యతిరేకిస్తున్నా కూడా ముసాయిదా బిల్లు అసెంబ్లీకి పంపించారు. సమైక్యరాష్ట్రం మా నినాదం కాదు, విధానం అని ఇప్పటికీ స్పష్టంగా చెబుతున్నాం, సభలోనూ అదే చెబుతామన్నారు. తెలుగుదేశం, వైఎస్సార్సీపీ సభ్యులు వివిధ సందర్భాల్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ, ఇప్పుడున్న ముసాయిదా బిల్లులో అభిప్రాయాలను చెప్పాల్సిన అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉందని సీఎం చెప్పారు. వివిధ ప్రాంతాల వారికి వివిధ అభిప్రాయాలున్నా, అసెంబ్లీలో చెప్పేదానికే ప్రాముఖ్యత ఉంటుంది, దానిపైనే రాష్ట్రపతి, ఆతర్వాత పార్లమెంటుకు పోతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

మీ అభిప్రాయాలను చెప్పే అవకాశం వచ్చింది, సద్వినియోగం చేసుకోండని సూచించారు. ప్రజా ప్రతినిధులుగా అభిప్రాయాలు చెప్పకుండా బిల్లును పంపిస్తే రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా నిర్ణయం వచ్చే అస్కారం ఉంటుందన్నారు. బీహార్ అసెంబ్లీ అంశాన్ని మీడియా ప్రస్తావించగా, నేను ఏమి చేస్తానో అసెంబ్లీలో చూస్తారు కదా! అని సీఎం వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పరిధిలో అసెంబ్లీ ఓటింగ్ తీసుకుంటారు, సభ అభిప్రాయం ఏవిధంగా తీసుకుంటారు ? వ్యక్తి గత అభిప్రాయమే సభ అభిప్రాయం అవుతుంది, అదే ఓటింగ్ అని సీఎం వ్యాఖ్యానించారు.

అభిప్రాయాల కోసం అవసరమైతే సభ గడువు పెంపుపై నిర్ణయం తీసుకుంటామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాన్ని, సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతికి చెప్పే అవకాశం ఉంది, చిత్తశుద్ధ్ది ఉంటే మీరంతా కలిసిరండని టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభ్యులనుద్దేశించి అన్నారు. మాది జాతీయపార్టీ, మీవి(టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ) రాష్ట్రపార్టీలు, మీ పార్టీలో మీరే ఏకచత్రాధిపతులు, మీ నిర్ణయమే పార్టీ నిర్ణయం, అలాంటి పరిస్థితుల్లో సభలో మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పే అవకాశం ఉందని ఆ రెండు పార్టీలను సీఎం కోరారు.

ఆర్టికల్-3 ప్రకారం విభజన చేయండని మీరు(టీడీపీ, వైఎస్సార్సీపీ) సలహా ఇచ్చారు కదా ! అంటే విభజన కోసమే సలహా ఇచ్చారా ? అయితే అభిప్రాయాలు సభలో చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఏపీఎన్జీవో ఎన్నికల్లో చెయ్యిపెట్టి చేతులు కాల్చుకున్నారు. వారి ఎన్నికల్లో ఎందుకు వేలు పెట్టారని పరోక్షంగా వైఎస్సార్సీపీని ఉద్దేశించి ప్రశ్నించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.