సమాజాన్ని మేల్కొలిపే శేఖర్ కార్టూన్లు

క్యాన్సర్ వ్యాధిని కార్టూనిస్ట్ శేఖర్ అధిగమించి సమాజాన్ని చైతన్యపరిచే మరిన్ని మంచి కార్టూన్లు వేయాలని సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ఆకాంక్షించారు. మలుపు ప్రచురణల ఆధ్వర్యంలో కార్టూనిస్ట్ శేఖర్ రూపొందించిన కులం క్యాన్సర్ కార్టూన్ ఆల్బం ఆవిష్కరణ సభను శనివారం సాయంత్రం అబిడ్స్ బొగ్గులకుంటలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో నిర్వహించారు. ఆల్బంను ఆవిష్కరించిన సందర్భంగా బొజ్జా తారకం మాట్లాడుతూ భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడినవారు ఉన్నారు కానీ కులం నుంచి బయటపడినవారు లేరనేలా శేఖర్ గొప్ప కార్టూన్లు వేశారని, సమాజాన్ని మేల్కొలిపే గొప్ప ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. సమాజాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి శేఖర్ తన కుంచెతో అద్భుత రూపంలో రూపొందించిన చిత్రాలు స్థిరంగా నిలిచిపోతాయని అన్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక అంశాలతో కూడిన కార్టూన్లు వేసే ధోరణి శేఖర్ సొంతమని అన్నారు. వ్యంగ్యంతోపాటు విమర్శనాధోరణితో ఆయన కార్టూన్లుంటాయని, తెలంగాణ నేపథ్యంతో ఆయన వేసిన కార్టూన్లు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

నమస్తే తెలంగాణ పత్రిక సంపాదకుడు అల్లం నారాయణ మాట్లాడుతూ సమాజంలో కులం కట్టుబాట్లు, ఆంక్షలు ఏ విధంగా ఉంటాయో ఈ చిత్రాలు చాటిచెప్తాయన్నారు. కులం క్యాన్సర్‌ను నిర్మూలించేందుకే కలం పట్టి శేఖర్ తిరగబడ్డారని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో అనేక మంది కార్టూనిస్టులున్నారని, వారి కార్టూన్లు సమాజానికి ఎంతో దోహదపడుతున్నాయని చెప్పారు. సభాధ్యక్షుడు సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ సమాజంలోని క్యాన్సర్ మీదికి తన పెన్సిల్‌ను కుంచెను క్రోక్విల్‌నూ ఎక్కుపెట్టి ఆసుపత్రి గదిలోనే బాధామయ చికిత్సల మధ్య శరపరంపరగా శేఖర్ గీసిన కార్టూన్లు అమ్ములపొదివంటివని అన్నారు. వ్యవస్థ మూలాలను పట్టి పీడిస్తున్న కులం క్యాన్సర్ మీద ఆయన కార్టూన్లు చరిత్రలో నిలుస్తాయన్నారు.

సాహితీవేత్త ఎన్ వేణుగోపాల్ మాట్లాడుతూ సజనాత్మకతతో కూడిన కార్టూన్లు శేఖర్ సొంతమని, తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా శేఖర్ చిత్రాలు దోహదపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కార్టూనిస్టు మోహన్‌తోపాటు విప్లవ రచయిత వరవరరావు, మలుపు నిర్వాహకుడు బాల్‌రెడ్డి, శేఖర్ ఆత్మీయులు ఆయనను అభినందించారు.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.