సభ్యులు పట్టుబట్టితే మా నోట్ అందించండి -సీఎస్‌ను ఆదేశించిన హోంశాఖ

హైదరాబాద్, జనవరి 9 :ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు -2013 రాష్ట్ర అసెంబ్లీకి చేరినపుడే పలువురు సీమాంధ్ర నేతలు మూడు వేర్వేరు బృందాలుగా సీఎస్‌ను కలిసి అదనపు వివరాలు కావాలని విన్నవించారు. వారు కోరిన మూడు ప్రధాన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసన్నకుమార్ మహంతి కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఈ అంశాలపై ఎలా వ్యవహరించాలో సూచించాలని ఆ లేఖలో కోరారు. ముసాయిదా బిల్లులో విస్మరించిన అంశాలు, తప్పులు దొర్లిన విషయాలను తన లేఖలో ప్రస్తావించారు. దీనిపై స్పందించి కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇటీవల ఒక నోట్ పంపింది.
ఈ నోట్‌లో ప్రధానంగా వివిధ పార్టీల సీమాంధ్ర సభ్యులు కోరిన సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. అన్ని విషయాలు సమక్షిగంగా పరిశీలించి తామే తుది బిల్లులో చేర్చి పార్లమెంటు ముందుంచుతామని వివరించింది. సభ్యులు వ్యక్తం చేసే అభ్యంతరాలు, అనుమానాలు, విస్మరించిన అంశాలు చర్చద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రం ఈ లేఖలో ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీకి వెల్లడించాలని సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ముఖ్యమంత్రి, శాసనసభ్యులు కనుక పట్టువీడకపోతే తాము పంపిన నోట్‌ను సభలో సభ్యులకు అందించమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఎస్‌ను ఆదేశించినట్లు సమాచారం.

సమాచారం సేకరించుకున్న ఉన్నతాధికారులు..
ఇదిలా ఉంటే ముసాయిదా బిల్లులో కొన్ని అంశాలను విస్మరించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు గతంలోనే గుర్తించి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతనెలలో 56 ప్రభుత్వ శాఖలు 15రోజులకుపైగా శ్రమించి పూర్తి స్థాయి నివేదికలను సిద్ధం చేసి అర్ధగణాంక శాఖకు నివేదించాయి. ఈ విషయాన్ని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చింది. ఈలోగా సీమాంధ్ర నేతలు బిల్లును ఎలాగైనా అడ్డుకునేందుకు, చర్చకు ఆటంకాలు కల్పించేందుకు బిల్లులో పూర్తి వివరాలు లేవనే సాకును ముందుకు తెచ్చారు. ఇందులో భాగంగా సీఎంతోపాటు టీడీపీ, వైసీపీ ప్రతినిధి వర్గాలు సీఎస్‌ను కలిసి ఇరిగేషన్, ఫైనాన్స్, అప్పులు, ఆస్తులపై మరింత సమగ్ర సమాచారం కావాలని కోరాయి. వీటిపై ఆచీతూచి అడుగు వేయాలని భావించిన సీఎస్ వాటిని హోంశాఖకు లేఖ ద్వారా పంపినట్లు తెలిసింది. సీఎస్ లేఖకు స్పందించిన కేంద్ర హోంశాఖ అన్ని విషయాలను నివేదిక రూపంలో తమకే పంపాలని, వాటిని తుది బిల్లులో చేర్చుతామని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని శాఖలనుంచి సేకరించిన తప్పొప్పుల సవరణలతోపాటు, సభ్యులు కోరిన విషయాలపై సమగ్ర సమాచారాన్ని కేంద్రానికి అందించేందుకు సీఎస్ సమాయత్తం అవుతున్నారు. ఆయా ప్రధాన విభాగాలకు చెందిన అధికారులకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేయగా, ఆయన తనకందిన పూర్తి వివరాలతో కేంద్రానికి రిపోర్టును పంపేందుకు సంసిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమచారం.

ముసాయిదా బిల్లులో ప్రధానంగా 7వ షెడ్యూల్‌లో పేర్కొన్క 41సంస్థలనే కాక మరో 160 సంస్థలను చేర్చాల్సి ఉందని ఆర్ధిక శాఖ తేల్చింది. అదేవిధంగా విశ్వవిద్యాలయ నిధులను వాటికే పంపిణీ చేయాలి తప్ప జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం కుదరదని తేల్చింది. జనాభా ప్రాతిపదికన ఈ నిధులను పంపిణీ చేయాల్సి వస్తే ఉద్యోగుల పీఎఫ్, పించన్, బీమా వంటి అంశాల్లో అది అసాధ్యమని తేల్చింది. ఇక 10వ షెడ్యూల్‌లో విస్మరించిన తెలుగు, హిందీ, సాంస్కృతిక అకాడమీలను, ఆంధ్రవూపదేశ్ పురావస్తు పరిశోధనా కేంద్రాన్ని చేర్చాలని సూచించారు. గిరిజన, తెలంగాణ యూనివర్సిటీలను రెండు రాష్ట్రాల్లో కొత్తగా విస్తరించాలని, తెలంగాణలో ఉద్యానవన యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం చెప్పినా వాటి నిధులపై ప్రస్తావించలేదు. ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, కేంద్రీయ, వ్యవసాయ వర్సిటీ, ట్రిపుల్ ఐటీలను ఆంధ్రవూపదేశ్‌లో 12, 13వ పంచవర్ష ప్రణాళికల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా శాసనమండలి, శాసనసభ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రభుత్వానికి నివేదించారు. కర్నూలు, అనంతపురం జిల్లాలను స్థానిక సంస్థల నియోజకవర్గాల జాబితాలో చేర్చలేదని ఆయన నివేదికలో వెల్లడించారు. ముసాయిదాలోని తొమ్మిదో షెడ్యూల్‌లో 63 సంస్థలను చేర్చాలని తాజాగా కోరనున్నారు. కులాల తప్పుల సవరణను ఇదే నివేదికలో ప్రస్తావించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.