సబ్‌ప్లాన్ కోసం మొదట డిమాండ్ చేసింది టీఆర్‌ఎస్సే

అవినీతి మంత్రులకు సీఎం అండ kcr

– మా పార్టీ వ్యతిరేకించిందంటూ.. సీఎం తప్పుడు ప్రచారం
– మతిమరుపు ఉంటే అసెంబ్లీ రికార్డులు చూసుకోవాలి
– అమ్మహస్తం, అయ్యహస్తం కాదు.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి
– ఎన్నోసార్లు పాలమూరు వచ్చిన కిరణ్ కొత్తగా ఏం పొడిచారో?
– ఏప్రిల్ చివరి వరకు జూరాలకు నీరు విడుదల చేయాలి
– తక్షణమే కర్నాటక సర్కారుతో సీఎం మాట్లాడాలి.. కేసీఆర్ డిమాండ్
– పాలమూరు కలెక్టర్‌తో తాగునీరు, కరువుపై సమీక్ష..
రూ.1.75 కోట్లు కేటాయింపు
‘అవినీతికి పాల్పడిన మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైల్లో ఉండటం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. అవినీతికి పాల్పడిన వారికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అండగా ఉండటం సిగ్గుచేటు’అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. తాగునీరు, కరువుపై శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌తో సమీక్షించిన తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేందర్‌రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మంత్రివర్గంలో చాలా మంది అవినీతిలో కూరుకుపోయినా, వారిని తొలగించకపోవడం సిగ్గుచేటు. ఆదర్శపాలన అందివ్వాల్సిన మంత్రులు అవినీతికి పాల్పడి దోషులుగా నిలబడ్డారు. ఇది ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. సీబీఐ విచారణలో దోషులుగా తేలిన మంత్రులను సీఎం వెనకేసుకొస్తూ వారినే సమర్థించడం రాష్ట్రం చేసుకున్న ఖర్మ. ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది మంత్రులు, ఐఏఎస్‌లు జైళ్లలో మగ్గుతున్న దాఖలాలు లేవు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనుకేసుకొస్తూ సీఎం అవినీతిని ప్రోత్సహిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను టీఆర్‌ఎస్ అడ్డుకున్నదని సీఎం పచ్చి అబద్ధాల కోరులా మాట్లాడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకోవాలి. మతిమరుపు ఉంటే అసెంబ్లీ రికార్డులను పరిశీలించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను బయటికి తీసుకొచ్చిందే టీఆర్‌ఎస్. ఎస్సీ, ఎస్టీల నిధులు పక్కదారి పట్టకుండా కఠినమైన చట్టం తీసుకురావాలని చాలాసార్లు డిమాండ్ చేశాం. అలాంటి టీఆర్‌ఎస్సే సబ్‌ప్లాన్ అడ్డుకోవడానికి ప్రయత్నించిందని సీఎం చెప్పడం దారుణం. టీఆర్‌ఎస్‌పై అబాంఢాలు వేస్తే ఊరుకోం. టీఆర్‌ఎస్‌ను ప్రజల్లో చెడుగా చూపించేందుకు ఇంత నీచానికి దిగజారుతారని ఊహించలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జడ్చర్లకు రామన్‌పాడ్ నీరొచ్చేదెప్పుడు?
పాలమూరు జిల్లాలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను కూడా పెండింగ్‌లో ఉంచారని, అత్యవసరంగా నిధులు కేటాయించి పూర్తి చేయకపోవడం చూస్తే ప్రభుత్వానికి ఎంత ప్రేముందో తెలుస్తోందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ‘జిల్లాకు ఎన్నోసార్లు వచ్చిన సీఎం ఏం ఉద్ధరించారో చెప్పాలి. కేసీఆర్ జిల్లాకే రాలేదని సీఎం చెప్పడం హాస్యాస్పదం. ఎన్నోసార్లు వచ్చిన కిరణ్ జిల్లాకు కొత్తగా ఏం పొడిచారో చూపించాలి. పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తిచేసి సాగునీరు అందించడం మానేసి, అమ్మహస్తం.. అయ్యహస్తం.. అన్నహస్తం పథకాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. జూరాల కింద 60 వేల ఎకరాల ఆయకట్టుకు సరిపడా నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులున్నాయి. సీఎం స్పందించి వెంటనే కర్ణాటకతో మాట్లాడి నారాయణపూర్ నుంచి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలి. జిల్లాలో పరిపాలన పరిస్థితులు బాగాలేవు. అన్ని పథకాల్లో అవినీతి పేరుకుపోయింది. జడ్చర్లకు రామన్‌పాడ్ నీటిని అం దించేందుకు గతంలో కాంట్రాక్ట్ పొందిన వారు కిలోమీటర్ల మేర పైపులు వేయకుండానే బిల్లులు తీసుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టింకోవడం లేదు. ఐదేళ్లు కావస్తున్నా జడ్చర్లకు నీరు అందకుండా పోయింది’అని అసహనం వ్యక్తం చేశారు.

తాగునీటి ఎద్దడి నివారణ కోసం రూ.1.75 కోట్లు
పాలమూరు జిల్లాలో తీవ్ర తాగునీటి ఎద్దడి, కరువుపై కలెక్టర్ గిరిజాశంకర్‌తో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, చర్యలు తీసుకోవాలని సూచించారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.1.75 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జూరాల కింద పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో చదువుకున్న యువత కు నైపుణ్యాల అభివృద్ధికి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు శిక్షణ తదితర ప్రోత్సాహకాలకు తన నిధుల నుంచి రూ.50 లక్షలు కలెక్టర్ నిధుల కింద నిల్వ ఉంచేందుకు కేసీఆర్ అంగీకరించారు. అసవరమున్నప్పుడు ఉపయోగించి యువతను ప్రోత్సహించాలని సూచించారు. తాగునీటి ఎద్దడి నివారణకు వంద ట్యాంకర్లు ఏర్పాటు చేశామని, అవరమైతే పెంచుతామని కలెక్టర్ తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.