సబ్సిడీ గ్యాస్‌తో బిజినెస్!l

gmr  కేంద్రం మార్గదర్శకాలను
ధిక్కరించిన ల్యాంకో, జీఎమ్మార్
రూ.148 కోట్ల రికవరీకి ట్రాన్స్‌కో నోటీసులు
రాష్ట్ర ప్రభుత్వ సిఫారసులతో కేంద్రం నుంచి సబ్సిడీ గ్యాస్ పొంది రాష్ట్రానికి అధిక ధరకు విద్యుత్ విక్రయాలు జరిపిన ల్యాంకో, జీఎంఆర్ పవర్ ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చుకునేందుకు విద్యుత్ సంస్థలు సిద్ధమయ్యాయి. గత కొన్నేళ్ళుగా ఈ రెండు ప్రైవేటు ప్రాజెక్టులు అటు ప్రభుత్వం, ఇటు విద్యుత్ సంస్థల టాన్స్‌కో, డిస్కమ్‌లు) పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తూ ఆర్ధిక పరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులను కలిగిస్తున్నాయనే నిర్ధారణకు వచ్చాయి. సబ్సిడీ గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసి ఎక్కువ ధరకు విక్రయించినట్లుగా నిర్ధారించుకున్న తదుపరి ల్యాంకో, జీఎంఆర్ పవర్ ప్రాజెక్టుల యాజమాన్యాల నుంచి సుమారు రూ.148కోట్లు రికవరీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో ల్యాంకో పవర్ ప్రాజెక్టు-1 ద్వారా రూ.118 కోట్లు, జీఎంఆర్(వేమగిరి) ద్వారా రూ.30 కోట్ల రికవరీ కోసం ట్రాన్స్‌కో నోటీసులు జారీచేసింది.

ట్రాన్స్‌కో నుంచి నోటీసులు అందుకున్న వెంటనే ల్యాంకో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఈ విధంగా ఉన్నాయి. కృష్ణాగోదావరి బేసిన్‌లోని డి-6 క్షేత్రం నుంచి ల్యాంకో ఒకటో యూనిట్‌కు, జీఎమ్మార్(వేమగిరి) యూనిట్‌కు గ్యాస్ కేటాయింపులున్నాయి. అయితే వీటి విద్యుత్ ఉత్పత్తిని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) నిర్ణయించిన ధరకు కాకుండా ఎక్కువ ధరకు విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తున్నాయి. ఇందులో ల్యాంకో రూ.5.70, జీఎమ్మార్ రూ.5.60 చొప్పున విద్యుత్ సంస్థలకు(డిస్కమ్‌లకు) విక్రయిస్తున్నాయి. ఈ అంశంపై గత కొంత కాలంగా వివాదం కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో, కేంద్రంలో తమకున్న పలుకుబడిని వినియోగిస్తూ ముందుకు సాగుతున్నాయి. కేంద్ర పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ సైతం ల్యాంకో, జీఎమ్మార్ వ్యవహారశైలిపై ఘాటుగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు కూడా నిర్వహించింది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కేంద్ర పెట్రోలియం శాఖ గ్యాస్ బదలాయింపుపై మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే కేంద్ర మార్గదర్శకాలు తమకు వర్తించబోవని, కచ్చితంగా వాటిని పాటించాలన్న నిబంధన లేదన లేదంటూ ట్రాన్స్‌కోకు స్పష్టం చేశాయి. దాంతో నిబంధనల మేరకు గతంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ)కు లోబడి ఈ ఏడాది మే నెలాఖరు వరకు యూనిట్ ధర రూ.3.10కి మించి ఎక్కువ ఇవ్వరాదని విద్యుత్ సంస్థలు ఏకాభివూపాయానికి వచ్చాయి. ఇందులో భాగంగా 2012 జూన్ ఒకటోతేదీ నుంచి ల్యాంకో, జీఎమ్మార్ ప్రాజెక్టులకు జరిపిన చెల్లింపులను క్రోడీకరించి నిర్ధేశిత ధర ప్రామాణికంగా తీసుకుని అదనంగా రూ.148కోట్లు చెల్లించినట్లు డిస్కమ్‌ల తరపున ట్రాన్స్‌కో లెక్కలు తేల్చింది. వాటిని తిరిగి రాబట్టుకునే లక్ష్యంతో ల్యాంకో, జీఎమ్మార్ ప్రాజెక్టు యాజమాన్యాలకు నోటీసులు జారీచేసింది. ఇదిలాఉండగా, సబ్సిడీ గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ల్యాంకో, జీఎమ్మార్‌ల రేటును విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) ఖరారు చేయడంలో చేసిన నిర్లక్ష్యం విద్యుత్ సంస్థలకు శాపంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఈఆర్సీ మాత్రం మీకు మీరు(విద్యుత్‌సంస్థలు, ల్యాంకో జీఎమ్మార్) తేల్చుకోండంటూ ఉచిత సలహాలు ఇవ్వడం గమనార్హం.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.