సడక్‌బంద్‌లో సత్తా చాటిన ఓరుగల్లు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలంగాణ ఆకాంక్షను చాటేందుకు బెంగుళూరు-కర్నూల్ హైవేపై తలపెట్టిన సడక్‌బంద్‌కు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు, టీఆర్‌ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మోసం చేసిన కేంద్రానికి కనువిప్పు కలిగించే విధంగా సడక్ బంద్ ద్వారా నిరసన తెలియజేశారు. జిల్లానుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో బోత్‌పూర్ పాయింట్ వద్ద, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బక్షపతి ఆధ్వర్యంలో ఆలంపూర్ వద్ద తెలంగాణ వాదులు హైవేపై బైఠాయించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, పొలిటిబ్యూరో సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ సుధాకర్‌రావు, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శులు బక్క నాగరాజు, శంకర్‌నాయక్, కిషన్‌నాయక్ ఆధ్వర్యంలో సుమారు 500మంది శంషాబాద్ పాయింట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

సడక్‌బంద్ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు వేల సంఖ్యలో మోహరించిన పోలీస్ బలగాలు రోడ్లపై బైఠాయించిన నాయకులను అరెస్టు చేసి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు విద్యార్థి నాయకులు వాసుదేవరెడ్డి,జోరిక రమేష్, శరత్‌చంద్ర, రాజ్‌గోపాల్, సూర్యకిరణ్, రాకేష్, వెంకటేష్, మనోజ్ తదితర విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.
అరెస్టులు నిరసిస్తూ జిల్లాలో నిరసనలు…
సడక్‌బంద్‌లో పాల్గొన్న టీఆర్‌ఎస్ నేతలు, జేఏసీ నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. జనగామ, మహబూబాబాద్, పరకాల తదితర ప్రాతాలలో రాస్తారోకోలు నిర్వహించారు. అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.