సకల జనుల సమ్మె యోధుడు స్వామిగౌడ్

 శాసనమండలి చైర్మన్ స్థానానికి కే స్వామిగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే సభ హర్షధ్వానాలతో మార్మోగింది. చప్పట్లతో, బల్లలు చరిచి సభ్యుల తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. మండలి నవ్వులతో వెల్లివిరిసింది. మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్ ఎన్నిక కాగానే రెవెన్యూమంత్రి మహమూద్‌అలీ, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, శాసనసభా వ్యవహారాల మంత్రి టీ హరీశ్‌రావు, ఇతర టీఆర్‌ఎస్ మండలి సభ్యులు ఆయనను చైర్మన్‌స్థానం వరకు సగౌరవంగా తోడ్కొని వెళ్ళారు. చైర్మన్ స్థానంలోని విద్యాసాగర్ స్వామిగౌడ్‌ను చైర్మన్‌స్థానంలోకి సవినయంగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి తొలిచైర్మన్‌గా ఎన్నికైన కే స్వామిగౌడ్‌ను హరీశ్‌రావు ప్రశంసలతో ముంచెత్తారు. స్వామిగౌడ్‌కు అరుదైన, అద్భుతమైన, అసాధారణమైన అవకాశాలు లభించాయన్నారు. 

swamy1969 ఉద్యమం నుంచి పునర్నిర్మాణం వరకు ఉద్యమంలో ఉండటం స్వామిగౌడ్‌కు లభించిన అరుదైన గౌరవమని మంత్రి పేర్కొన్నారు. 1969లో వీరోచితంగా పోరాడటం, బుల్లెట్ భుజంలో దూసుకుపోయినా మొక్కవోని దీక్షతో తెలంగాణ మలిదశ ఉద్యమంలో టీఎన్జీవో నాయకుడుగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా కీలకభూమిక పోషించడం సకల జన సమ్మె యోధుడుగా తెలంగాణ ప్రజల ప్రశంసలందుకోవడం స్వామిగౌడ్‌కు లభించిన అరుదైన గౌరవమని అన్నారు. అదేవిధంగా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వామి కావడం ఆయన అదష్టమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితరులు స్వామిగౌడ్‌ను అభినందించారు. స్వామిగౌడ్ ఎన్నిక ఆవశ్యకతను వివరించారు.

సకల జనుల సమ్మెకాలంలో ఆర్‌టీఏ ఆఫీసులో కాంగ్రెస్ ప్రభుత్వం స్వామిగౌడ్‌పై హత్యాయత్నం చేసిందని, వారంపాటు ఆయన గాయాల నుంచి కోలుకోలేకపోయారని మంత్రి హరీశ్‌రావు ఉద్యమ ఘట్టాలను గుర్తుచేశారు. మొక్కవోని పట్టుదలకు, నిరంతర ఉద్యమచైతన్యానికి, ప్రజల అడుగులో అడుగువేసే ఉద్యమ లక్షణాలకు స్వామిగౌడ్ నిలువెత్తు నిదర్శనమని, ఆయన తెలంగాణ ప్రజలకు చేసిన సేవల కారణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి సముచిత స్థానం ఇచ్చారని చెప్పారు. భానుప్రసాద్, ఏ నర్సారెడ్డి, పూల రవీందర్, సుధాకర్‌రెడ్డి, నాగేశ్వర్, జాఫ్రీ, మహ్మద్ సలీమొద్దీన్, డాక్టర్ నాగేశ్వర్, బోడేపూడి వెంకటేశ్వరరావు, కాటేపల్లి జనార్దన్, జగదీశ్వర్‌రెడ్డి, రాజలింగం, రాములు నాయక్, భూపాలరెడ్డి తదితర సభ్యులు స్వామిగౌడ్‌ను అభినందించారు. మలిదశ ఉద్యమంలో 14ఎఫ్ రద్దు, కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష, సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, సకల జనభేరీ, సంసద్‌యాత్ర, సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష వంటి అనేక ఉద్యమాలలో వీరోచితంగా నిలిచి ప్రజలను కదిలించిన స్వామిగౌడ్‌కు సముచిత గౌరవం లభించిందని మాట్లాడిన సభ్యులందరూ అభినందించారు. కాగా సభ్యులందరూ మాట్లాడిన తర్వాత నూతనంగా ఎన్నికైన స్వామిగౌడ్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.