సకల జనభేరికి కదిలిరండి

సకల జనభేరి సభకు అన్ని వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. కీలక సమయం కాబట్టి లక్షల సంఖ్యలో హాజరవ్వాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 29న టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజన భేరిపై పొలిట్‌బ్యూరో సభ్యులు, శాసనసభాపక్ష నేతలు, పార్టీ సీనియర్ నేతలతో చర్చించానని చెప్పారు. ఈ సభకు టీఆర్‌ఎస్ శ్రేణులే లక్షకు పైగా తరలివస్తారని తెలిపారు. జిల్లాకో ఇన్‌ఛార్జ్జిని వేశామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కీలక తరుణంలో ఉన్న సందర్భంగా జరుగుతున్న సభ కనుక అందరూ కదిలిరావాలని నిర్దేశించినట్టు చెప్పారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈ సభకు హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. సకల జనభేరి 2-5గంటల మధ్యే జరుగుతుంది కనుక టీఆర్‌ఎస్ శ్రేణులు మధ్యాహ్నం ఒంటిగంటకే సభకు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు.

kcrsalakaతెలంగాణ ఉద్యమించినపుడు ఏ టర్న్?
‘ఢిల్లీకి పోయిన బాబు మెదడు బ్యాలెన్స్ తప్పినట్లు మాట్లాడుతున్నాడు. నాది ఏ టర్న్ కాదు. ప్రజాటర్న్, ‘పీ’టర్న్ అంటున్నాడు. 2009 నుంచి ఎన్ని టర్న్‌లు తీసుకున్నవ్ బాబూ? డిసెంబర్ 8న ఒకటర్న్, 9న ఇంకో టర్న్, 10న మరో టర్న్. ఇవాళ ఇంకో టర్న్. అసలు ఇన్ని టర్న్‌లు ఎందుకు నీకు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా అని చెప్పు’ అని చంద్ర బాబుపై కేసీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు తీరు చూస్తుంటే నోటికాడ ముద్ద లాక్కున్నట్లుగా ఉందన్నారు. తెలంగాణలో వెయ్యిమంది అమరులైనప్పుడు, ప్రజలు రోడ్లమీదికి వచ్చినప్పుడు ఎందుకు ‘పి’టర్న్ తీసుకోలేదు అని కేసీఆర్ ప్రశ్నించారు. ‘పి’టర్న్ అని అనకుండా ఆంధ్రటర్న్ తీసుకున్నా అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ‘తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావ్. రాష్ట్ర విభజన ఇలా చేయండి అని చెప్పొచ్చు. ఆంధ్రకు ప్యాకేజీ కావాలంటావు. ఇన్నాళ్లు ఆంధ్రతో కలిసుండి కష్టనష్టాలు భరించిన తెలంగాణకే వాస్తవానికి ప్యాకేజీ ఇవ్వాలి. తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇంకా దేబిరి మోహాలేసుకుని చంద్రబాబు వెంట తిరిగే బదులు బయటకు వచ్చి పాపాలు కడుక్కోవాలని సూచించారు.

ఐటీఐఆర్ ఎవరి పైరవీల వల్లా రాలేదు
హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాద్‌కున్న అనుకూలతలు, చారిత్రక కారణాల వల్లనే వచ్చిందని కేసీఆర్ వెల్లడించారు. నాలుగైదు సంవత్సరాల నుండి అనేక రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు కోసం పైరవీలు చేస్తున్నా, కేంద్రం హైదరాబాద్‌కే ఎవరూ పైరవీలు చేయకపోయినా కేటాయించిందని చెప్పారు. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ వందమంది లాబియిస్టులతో అంతర్జాతీయంగా ఒత్తిళ్లతో ఐటీ దిగ్గజాలను ప్రభావితం చేసినా వారు హైదరాబాద్‌కే పోతామని తేల్చారని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్‌కే ఈ భారీ ప్రాజెక్టు రావడానికి మూడు ప్రధాన కారణాలు.. భూముల లభ్యత, అద్భుతమైన వాతావరణం, దక్కన్ పీఠభూమిలో భూకంపాలు వచ్చే అవకాశం లేకపోవడం పనిచేశాయన్నారు. ఇండియాలో హైదరాబాద్, బెంగుళూర్, పూణేలో కూడా ఐటీ పరిక్షిశమ ఉంది.

ఒక్క హైదరాబాద్ నుండే ప్రతియేటా రూ.65వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు అవుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును పెడితే విదేశీ మారకవూదవ్యం పెరుగుతుందని భావించే పైరవీలు చేయకున్నా ఈ ప్రాజెక్టు ఇచ్చింది. కానీ రిటైర్డ్ ఐఎఎస్, లోక్‌సత్తా పార్టీనేత జేపీ హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును ఎందుకు పెడుతున్నారంటాడు. ఇంత సంకుచితమా..? వైజాగ్‌లో ఎందుకు పెట్టరు అంటారు. వైజాగ్‌లో కాళ్లు పట్టుకున్నా పెట్టరు. అక్కడున్న వేడి వాతావరణం ఐటీకి సరిపోదు. 2.19లక్షల కోట్లతో ప్రాజెక్టు వస్తోంది. ఈ ప్రాజెక్టులో సాఫ్ట్‌వేరే కాకుండా హార్డ్‌వేర్ సంస్థలు కూడా రానున్నాయి. చైనాలోని షాంజన్‌లో పెద్ద హార్డ్‌వేర్‌యూనిట్ ఉంది. అమెరికాలోని సిలికాన్‌వ్యాలీలో సాఫ్ట్‌వేర్ పరిశ్రమ ఉంది. ఈ రెండూ కలిసి హైదరాబాద్‌కు రానున్నాయి. రాబోయే 25సంవత్సరాల్లో 60-65లక్షల ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాజెక్టుతో రానున్నాయి.’ అని కేసీఆర్ విశ్లేషించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, వచ్చే ప్రభుత్వం ధృడనిశ్చయంతో ఉన్నప్పుడే అది సాకారమవుతుందని అన్నారు. గతంలో వచ్చిన ఐటీ పరిశ్రమను ఫ్యాబ్‌సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో అనుమతుల కోసం ఒక సింగిల్ విండోను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

శీతాకాల పార్లమెంటులో బిల్లు..
‘శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుంది. కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకు పోతోంది. ప్రతి అడుగు మనకు చెప్పి వేయరు. వారనుకున్న దాని ప్రకారమే ముందుకు సాగుతున్నారని’ కేసీఆర్ చెప్పారు. తెలంగాణపై ఎపీఎన్జీవో నాయకుడు అడ్డుకుంటామని మాట్లాడుతున్నాడని విలేకరులు అన్నప్పుడు ఇంతకూ ఆయనెవరు..? ఆయన ఎన్నికే కాలేదు కదా..? అని కేసీఆర్ బదులిచ్చారు. కేంద్రంతో తాను టచ్‌లోనే ఉన్నానని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎవరికీ అనుమానం వద్దని కేసీఆర్ సూచించారు. టీడీపీ బీజేపీతో పొత్తుపెట్టుకోబోతోందనే వార్తలొస్తున్నాయదానిపై ఇతర పార్టీల గురించి పట్టించుకోబోమన్నారు. హైదరాబాద్‌పై ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలను ఒప్పుకోబోమని అన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తరువాత అక్కడి ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి తమకు అభ్యంతరం లేదని వారివల్ల తెలంగాణ రాష్ట్రానికి సేల్స్ టాక్స్ రూపంలో వందల కోట్ల ఆదాయం వచ్చిపడుతుందని అన్నారు. విలేకరుల సమావేశంలోఎంపీలు మందా జగన్నాథం, వివేక్, పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహ్మరెడ్డి, దాసోజు శ్రావణ్, రామ్మోహన్ పాల్గొన్నారు. పొలిట్‌బ్యూరో సమావేశంలో ‘కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ’ అనే పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.