సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్న సీమాంధ్రులు:కేటీఆర్

 సీమాంధ్రులు సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారని.. వారితో ఎలా కలిసుండాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల స్పష్టత లేకుండా సీమాంధ్రులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం, తిరుపతి వెళ్లిన తెలంగాణ భక్తులపై సీమాంధ్రులు దాడులు చేయడం దారుణమన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో నిండు గర్బిణీ పట్ల మానవత్వం లేకుండా వైద్యులు ప్రవర్తించడం బాధాకరమన్నారు. నిండు గర్భిణీకి వైద్యం అందించకుండా వెనక్కి పంపడం అమానుషమన్నారు.

సీమాంధ్రులకు స్పష్టత లేదు
సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న వారికి ఎందుకు ఆందోళలు చేస్తున్నారో స్పష్టత లేదు అని కేటీఆర్ తెలిపారు. విభజన కోసం పోరాడిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నారు… విభజనను అడ్డుకున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని కూలగొడుతున్నారని తెలిపారు. దీంతో వారి ఎందుకు ఉద్యమం చేస్తున్నారో తేలిపోయిందన్నారు. వారి ఉద్యమం వెనుక పెట్టుబడిదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రుల హక్కుల కోసమే పొట్టి శ్రీరాములు దీక్ష చేసిండు అని గుర్తు చేశారు.

సోనియా భిక్షతోనే కిరణ్ సీఎం అయిండు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భిక్షతోనే కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయిండు అని కేటీఆర్ తెలిపారు. ఒక్క ఎమ్మెల్యే మద్దతు లేకుండా ఆయన సీఎం అయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడేమో సోనియా నిర్ణయాన్ని సీఎం వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్ సీఎం తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను రెచ్చగొడితే ఊరుకోమని తేల్చిచెప్పారు.

సీమాంధ్ర ఉద్యోగుల వెనుక సీఎం
సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల వెనుక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం క్యాంపు కార్యాలయం కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం బూటకపు ఉద్యమమని చెప్పారు. సీమాంద్ర ఉద్యోగులను సీఎం ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సీఎం దొంగ లెక్కలపై చర్చకు సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరినా ఇంత వరకు స్పందన లేదు అని తెలిపారు. తప్పుడు లెక్కలపై సీఎం సమాధానం చెప్పకుండా ఎక్కడికి పోయిండు అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సీమాంధ్ర ఉద్యోగులపై ఎందుకు ఎస్మా ప్రయోగించవ్
తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించి అనేక బెదిరింపులకు పాల్పడిన సీఎం ఇప్పుడేం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తుంటే అభివృద్ధి కుంటు పడటం లేదా అని అడిగారు. సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉద్యోగులపై ఎందుకు ఎస్మా ప్రయోగించవ్ అని ప్రశ్నించారు. సీమాంధ్ర ఉ్యమంపై సీఎం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

మీడియా సంయమనం పాటించాలి
రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర మీడియా సంమయనం పాటించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థుల భవిష్యత్ పాడు అవుతుంది అని విషం చిమ్మిన సీమాంధ్ర మీడియా ఇప్పుడేమో రెచ్చగొట్టేలా కథనాలు ప్రసారం చేస్తుందని మండిపడ్డారు. పేరెంట్స్ కమిటీల పేరుతో ఆందోళనలు చేయించిన మీడియా ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. సమస్యకు పరిష్కారం వెతికే దిశగా మీడియా ముందుకెళ్లాలి కానీ.. ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరికాదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.