సంబురాలకు ముస్తాబైన పరేడ్

సికింద్రాబాద్:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబవుతోంది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం పరేడ్‌గ్రౌండ్‌ను నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మ సందర్శించి భద్రతా చర్యలను పరిశీలించారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ ఉప కమిషనర్ ఈడీ విజయ్‌రాజ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం పరేడ్‌గ్రౌండ్‌లో ఉదయం 10.45 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం పోలీసు వందనం స్వీకరించనున్నారు.
గణతంత్ర, స్వాతంత్య్ర వేడుకల తరహాలో…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాల మాదిరిగానే ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు. పోలీస్ యంత్రాంగం భారీ స్థాయిలో ముఖ్యమంత్రికి పోలీస్ కవాతుతో గౌరవ వందనం సమర్పించాలని చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ కవాతుకు సంబంధించిన రిహార్సల్స్ జరిగాయి. అదే విధంగా గ్రౌండ్స్‌లో సాంస్కతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి భద్రత, అతిథులు, అహుతులు, ప్రజల సందర్శనలపై పోలీసులు ప్రత్యేక దష్టి సారించారు.

లష్కర్‌కు కొత్త శోభ.. .
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని లష్కర్ కొత్త శోభను సంతరించుకోనుంది. బల్దియా అధికారులు బేగంపేట నుంచి సికింద్రాబాద్ స్టేషన్ వరకు దారి పొడవునా విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దారికి ఇరువైపులా సుందరీకరణ పనులు చేపట్టారు. పూల మొక్కలు ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా క్లాక్ టవర్‌కు మెరుగులు దిద్దనున్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేక సుందరీకరణ చర్యలు చేపట్టనున్నట్లు ఉప కమిషనర్ ఈడీ.విజయ్‌రాజ్ పేర్కొన్నారు.

భారీ బందోబస్తు…
టీఆర్‌ఎస్ అధినేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పాల్గొనే మొదటి అధికారిక కార్యక్రమం కావడంతో పోలీస్ యంత్రాంగం భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. కేంద్ర బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పీ బెటాలియన్, స్థానిక పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేస్తున్నా రు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలను, సికింద్రాబాద్ నుంచి బేగంపేట వైపు వచ్చే వాహనాలను ైప్లె ఓవర్లపై అనుమతించరు. కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించి, ప్ర సంగం పూర్తి అయ్యేంత వరకు పరేడ్ గ్రౌండ్స్ వైపు భారీ వాహనాలు, కార్లు ఇతర వాహనాలను అనుమతించరు. జూన్ 1 ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకూ పరేడ్ మైదానం పూర్తిగా పోలీసుల అధీనంలోకి వెళ్లనుంది.

వీఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కార్యక్రమానికి హజరయ్యే అతిథులు, ప్రజలకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది. మూడు వేల నుంచి ఐదు వేల మంది వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వీఐపీలు, మంత్రులు, అధికారులకు కుడి వైపు షామియనాలు ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, పత్రిక ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, ప్రజలకు ఎడమవైపు షామియానాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. అతిథులందరికీ కవాతు కనిపించేలా కొన్ని చోట్ల ఎల్‌సీడీ టీవీలను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.