సంతకమైంది..

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి గురువారం సాక్షిగా నిలువనుంది. తన పరిశీలనకు వచ్చిన ఆంధ్రవూపదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దానిని గురువారం రాష్ట్ర రాజధానికి పంపించనున్నారు. దీనికి ముందు ఆయన పలువురు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. పునర్విభజన బిల్లు ఎలాంటి చిక్కులు లేకుండా ఉండాలని రాష్ట్రపతి భావిస్తున్నారని, ఆ కోణంలోనే ఒకటికి రెండు సార్లు బిల్లుపై నిపుణుల అభివూపాయం సేకరించారని సమాచారం. వారు ఆమోదం తెలియజేయడంతో దానిపై సంతకం చేసినట్లు విశ్వసనీయవర్గాలు చెప్పాయి. బుధవారం రాష్ట్రపతి పుట్టినరోజు. ఆ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చే బృహత్ కార్యం మీ చేతుల్లో ఉందని తెలంగాణ ఎంపీలు చేసిన వినతిని రాష్ట్రపతి ప్రత్యేకంగా గమనించారని సమాచారం.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర విభజన బిల్లుపై ఆయన సంతకం చేసి, తదుపరి చర్యకు రాష్ట్రపతి భవన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తున్నది. దీంతో ముసాయిదా బిల్లు గురువారం రాష్ట్రానికి చేరనున్నది. బుధవారమే ఈ బిల్లును హోంమంవూతిత్వ శాఖకు అధికారులు పంపినట్లు సమాచారం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బిల్లు చేరిందని, చర్చకు ఆరువారాలు గడువు ఇచ్చారని మీడియాలో విస్తృతంగా ప్రచారమైనప్పటికీ రాత్రి 10.30 వరకు కూడా సచివాలయానికి బిల్లు రాకపోవడం గమనార్హం. ఆ సమయం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు విమాన సౌకర్యం కూడా లేక పోవడంతో బుధవారం రాత్రికి బిల్లు ముసాయిదా ప్రతి అందే అవకాశం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి టీ మీడియాకు అదే సమయంలో వివరించారు. ఢిల్లీలోని ఆంధ్రవూపదేశ్ భవన్‌కు కూడా బిల్లు ప్రతి రాత్రి 10.30 వరకు అందలేదని ఆయన వెల్లడించారు. కాగా బిల్లు నేరుగా తనకు వస్తుందా? లేక అసెంబ్లీకి పంపుతారా? అనే విషయంలో తన వద్ద సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు.

బిల్లు ఎవరి వద్దకు?
ప్రత్యేక దూత ద్వారా వచ్చే ఈ బిల్లు నేరుగా ఎవరి వద్దకు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి కార్యాలయం ఈ బిల్లును హోం శాఖకు పంపిస్తే, ఆ శాఖ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతుందని, అది ముఖ్యమంత్రి ద్వారా రాజ్‌భవన్‌కు వెళుతుందని చెబుతున్నారు. అక్కడ గవర్నర్ నరసింహన్ దీన్ని పరిశీలించిన మీదట అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పంపిస్తారని భావిస్తున్నారు. తనకు విభజన ముసాయిదా బిల్లు అందగానే స్పీకర్ ఆ విషయాన్ని సభ్యులకు వివరించి, వెంటనే శాసనసభ వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేస్తారని అంటున్నారు. ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లును చర్చకు చేపట్టే అవకాశాలు ఉంటాయని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ముసాయిదా బిల్లును నేరుగా రాజ్‌భవన్‌కు లేదా, అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి పంపిస్తారని అసెంబ్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో జరిగిన ఉదంతాలను పరిశీలిస్తే అసెంబ్లీ కార్యాలయానికి పంపేందుకే రాష్ట్రపతి భవన్ చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.

మధ్యవూపదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇదే వైఖరి అవలంబించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వివరిస్తున్నాయి. మధ్యవూపదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఏర్పాటుకు వచ్చిన బిల్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రావడంతో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారని, దీంతో సదరు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరిగి రాష్ట్రపతి కార్యాలయానికి తిరిగి పంపించారని ఈ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత ఆ బిల్లును తిరిగి రాష్ట్రపతి అసెంబ్లీకే నేరుగా పంపించినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో పునర్విభజన ముసాయిదా బిల్లు కూడా స్పీకర్ కార్యాలయానికే వస్తుందని భావిస్తున్నారు. మరింత జాప్యం జరిగేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంవూతికి, గవర్నర్‌కు, స్పీకర్ కార్యాలయానికి చేరవేసే విధానాన్ని రాష్ట్రపతి అంగీకరించక పోవచ్చని అంటున్నారు. వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు బిల్లును త్వరగా పంపాలని కేంద్ర హోం మంత్రి షిండే ఇటీవలనే రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళి ప్రణబ్‌ను కలిసిన విషయం కూడా తెలిసిందే. దీంతో తక్కువ సమయం కేటాయించి రాష్ట్రపతి నేరుగా రాజ్‌భవన్ లేదా, స్పీకర్ కార్యాలయానికే విభజన ముసాయిదా బిల్లు పంపే అవకాశం ఉంటుందని పరిశీలకులు ఆంచనా వేస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.