సంజయ్‌దత్‌కు సుప్రీంలో చుక్కెదురు

-ముంబై పేలుళ్ల కేసులో రివ్యూ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ, మే 10: బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముంబై వరుస పేలుళ్ల కేసులో తనకు విధించిన శిక్షను పునసమీక్షించాలంటూ ఆయన దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తోసిపుచ్చింది. ఈ కేసులో సంజయ్‌దత్‌కు మార్చి 21న సుప్రీంకోర్టు ఐదేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడాదిన్నర శిక్ష అనుభవించిన ఆయన.. మరో మూడున్నరేళ్ల శిక్ష అనుభవించాల్సి ఉంది. నాలుగువారాల్లో లొంగిపోవాలని తీర్పు సందర్భంగా కోర్టు ఆదేశించగా… తాను ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్నానని, వాటిని పూర్తి చేశాక లొంగిపోతానంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ నేపథ్యంలో ఈనెల 16వరకు న్యాయస్థానం గడువు విధించింది.

లొంగిపోయేందుకు గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన తన శిక్షను పునసమీక్షించాలంటూ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని న్యాయస్థానం తోసిపుచ్చడంతో… సంజయ్ కోర్టులో లొంగిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. సంజయ్‌కు మరో ప్రత్యామ్నాయం లేదని, ఈనెల 16న కోర్టులో లొంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.