షోయబుల్లా ఖాన్

‘‘మరణం అనివార్యం. చావు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ మరణం ఒక లక్ష్యం కోసం సంభవిస్తే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు మీరు సంతోషించాలి’’ షోయబుల్లా ఖాన్ చివరి మాటలు.
షోయబుల్లా ఖాన్.. ధిక్కారస్వరం,‘ఇమ్రోజ్’ నిప్పు కణిక.
నిజామ్‌కు వ్యతిరేకంగా నిరసన, ప్రతిఘటన.. ఓ దీర్ఘకాలిక యుద్ధం.
వరంగల్‌జిల్లా మహబూబాబాద్‌లో రైల్వే పోలీసు హ బీబుల్లాఖాన్‌కు పుట్టిన తెలంగాణ ఆణిముత్యం. ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ కాలంలో గ్రాడ్యుయేషన్ చేస్తే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాళ్ల దగ్గరికి వచ్చేవి. కానీ షోయబుల్లాఖాన్ ఆ ఉద్యోగాల జోలికి పోలేదు. అది తెలంగాణ అగ్నిగోళంగా ఉన్న సమయం. ఆ సమయంలో మానుకోట వీరునికి అక్షరమే ఆయుధంగా కనిపించింది. అక్షరాన్ని మించిన ఆయుధం మరొక్కటి కనిపించలేదు. ఇది అక్షరాలా నిజం!
అందుకే షోయబుల్లాఖాన్ జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకున్నారు. నిజాం ప్రభుత్వ అరాచకాలపై పెన్ను ఎక్కుపెట్టారు. తే్ ఉర్దూ వారపత్రికలో ఉద్యోగం. నిత్యం రాజాకార్లూ, భూస్వాముల ఆగడాలపై వ్యాసాలు రాశారు. దీంతో తేజ్‌ను నిషేధించింది నిజాం ప్రభుత్వం. అనంతరం రయ్యత్ పత్రికలో చేరారు. అక్కడా తన ప్రతిఘటనను కొనసాగించారు. ప్రభుత్వం నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. అయినా వాటిని లెక్కచేయలేదు. చివరకు రయ్యత్‌ను నిషేధించారు. పెన్నులపై మన్నుగప్పితే గన్నులై మొలకెత్తుతై.
ఆ గన్నే ఇమ్రోజ్. తల్లి, భార్య ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బుతో ఇమ్రోజ్‌పత్రికను స్థాపించారు. 1947 నవంబర్ 17న ప్రథమ సంచిక విడుదలయ్యింది. 1947లో స్వాతంత్య్రం తరువాత దేశంలోని సంస్థానాలన్నీ ఇండియన్ యూనియన్‌లో కలుస్తున్నయి. ఒక్క హైదరాబాద్ స్టేట్ మాత్రమే నిజాం పాలనలో ఉంది. నిజామ్‌ను అడ్డం పెట్టుకున తాబేదార్లు చేస్తున్న ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. తెలంగాణ పల్లెలపై పడి అందినకాడికి దోచుకోవడం, ఎదురొచ్చిన మహిళలను చెరచడం. ఈ చర్యలతో రజాకార్లు, ఖాసీం రజ్వీ రాక్షసానందం పొందుతున్నారు. సాయుధ గెరిల్లాలు వీటికి అడ్డుకట్ట వేశాయి. అడవుల్లో ఉంటూ పథకం ప్రకారం రజాకార్లను మట్టుపెట్టాయి. దీంతో ఖాసీంరజ్వీ మరింత రగిలిపోయాడు. ఇప్పుడు వాడి కన్ను హైదరాబాద్ మీద పడింది. కలసిమెలసి సామరస్యంతో బతుకుతున్న హిందూ ముస్లిముల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించాడు. ( ఇది తెలంగాణ ప్రజలను విడదీసేందుకు, ఐక్యతను చెడగొట్టేందుకు పాలకులు నాటి నుంచి నేటివరకూ అవలంబిస్తున్న పద్ధతే ) ముస్లింల ముసుగులో హైదరాబాద్‌లోని హిందువులపై రజాకార్ల దాడులు మొదలయ్యాయి. ప్రజలంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోతున్నారు. యుద్ధం చేయడానికి గుండెలో ధైర్యం కావాలి. ఆ ధైర్యంతోనే షోయబుల్లాఖాన్ నిజాం నిరంకుశత్వంపై, ఆయన తాబేదార్లు చేస్తున్న మతోన్మాదాల మీద అక్షరాల కవాతు చేశారు. దీంతో నిజాం ప్రాణాలకే ప్రమాదమంటూ హెచ్చరిస్తూ ఓ లేఖరాశారు. ‘‘సత్యాన్వేషనలో వ్యక్తి మరణిస్తే గర్వించదగిన విషయం’’ ఇది నిజామ్‌కు షోయబుల్లాఖాన్‌ రాసిన ప్రత్యుత్తరం. బెదిరింపులకు లొంగని యోధుడిని నిజాం ప్రభ్వుం ప్రలోభపెట్టే ప్రయత్నం చేసింది. ఎన్నో ఆశలు చూపింది. ప్రాంతం మీద ప్రేమున్న కాడ… మరేదీ లెక్కకాదు.
1948 ఆగస్టు 21. అచ్చంగా ఇదే రోజు. అర్థ రాత్రి. కాచీగూడలోని ఇమ్రోజు కార్యాలయంలో పనిముగించుకుని ఇంటికి బయలుదేరారు. కొంతదూరం వెళ్లగానే చౌరస్తా దగ్గర విద్రోహపు వాసనేదో ఆయనను చుట్టుముట్టింది. ఖాసీం రజ్వీ అన్నంత పనీ చేశాడు.1948 ఆగస్టు 19న చేసిన ప్రసంగం ప్రకారం ఆయన అనుచరులు (రజాకార్లు ) ఆయనపై తుపాకులూ, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో షోయుబుల్లాఖాన్ ప్రాణాలు కోల్పోయారు. గోషామహల్ కుంట ఎదురుగా ఉన్న ఖబరస్థాన్‌లో ఖననం చేశారు. ఆయన సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్‌ఖాన్ ఎడమ చేయి తెగిపడింది.
దేహంతో మొదలైన ప్రస్థానం దేహంతోనే అంతమవుతుంది. కానీ ఓ వీరుని రక్తపు చుక్క వేల వీరులకు జన్మనిస్తుంది. ప్రాణాలను తీయొచ్చు… కానీ ఆశయాలను చంపలేరు. అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని సాగిన కలం వీరుడు షోయబుల్లా ఖాన్ స్ఫూర్తి నేటికీ మానుకోటలో ఉంది. అందుకే జగన్ మహబూబాబాద్ వచ్చినప్పుడు అది ప్రదర్శితమైంది.

పోరాడుతూ మరణిస్తే వీరులు. ఆత్మహత్య పిరికి చర్య

This entry was posted in TELANGANA MONAGALLU.

Comments are closed.