షర్మిలకు తెలంగాణ దెబ్బ రుచిచూపించిన విద్యార్థులు

(పోరుతెలంగాణ శ్రీనివాస్):

మహబూబ్‌నగర్‌లో షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు షర్మిలపై కోడిగుడ్లు, టమాటాలతో దాడిచేశారు. స్టూడెంట్స్‌ దెబ్బకు షర్మిళ తన మరో ప్రస్థానాన్ని వాయిదా వేసుకుంది. పాదయాత్రను నిలిపివేసి కారులో పారిపోయింది. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు పౌరుషాన్ని చాటారు. వలసనేతలపై పటపటపట పండ్లు కొరికారు. తెలంగాణపై స్పష్టత ఇవ్వకుండా జిల్లాలో తిరుగుతున్న షర్మిలకు గుణపాఠం నేర్పారు. భారీ భద్రత, పర్సనల్‌ సెక్యూరిటీతో వచ్చిన షర్మిలకు తెలంగాణ తడాఖా చూపించారు. తెలంగాణవాదం ముందు ఏ శక్తీ నిలవదని చాటిచెప్పారు. షర్మిలపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. సమైక్యవాదుల్లారా గోబ్యాక్‌ అంటూ నినదించారు.  మహబూబ్‌నగర్‌ పట్టణంలో మానుకోట స్ఫూర్తిని రగిలించారు. దీంతో షర్మిల తీవ్ర షాక్‌కు గురయ్యింది. మహాప్రస్థానాన్ని మధ్యలోనే నిలిపివేసింది. కారులో బండమీదపల్లికి పారిపోయింది.  దాదాపు 6గంటల పాటు పాదయాత్రకు బ్రేక్‌ పడింది.

షర్మిల పాదయాత్రకు అంతరాయం కలగడంతో వైఎస్సార్‌సీపీ గూండాలు రెచ్చిపోయారు. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడిచేశారు. యూనివర్సిటీ హాస్టళ్లపై రాళ్లు రువ్వారు. పోలీసులు కూడా వైఎస్సార్‌ సీపీకే వంతపాడారు. హాస్టళ్లలోకి చొరబడి విద్యార్థులపై లాఠీలు ఝులిపించారు. వైఎస్సార్‌ సీపీ గూండాలు, పోలీసులు కలిసి విద్యార్థులపై విరుచుకుపడటంతో పలువురికి గాయాలయ్యాయి. షర్మిలను నిలదీయాలన్న ధృడసంకల్పంలో విద్యార్థులు గాయాలను లెక్కచేయలేదు. సమైక్యవాదులకు ఇకముందు కూడా అడ్డుకుంటామని.. దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చిరించిన్రు.
విద్యార్థుల దాడితో షాక్‌కు గురైన షర్మిల బండిమీదపల్లిలో ఆరుగంటల పాటు రెస్ట్ తీసుకున్నది. అనంతరం క్లాక్‌ టవర్‌ దగ్గర  సభ నిర్వహించింది. ఈ సభలోనూ షర్మిలకు తెలంగాణ సెగ తగిలింది. స్థానికులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. షర్మిల డౌన్‌ డౌన్‌ అంటూ నినదించారు.  మహబూబ్‌నగర్‌ పట్టణంలో షర్మిల పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయినయి. పాలమూరు ఉద్యమస్ఫూర్తికి షర్మిల గజగజ వణికిపోయింది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.