శ్రీ రామ జనన నక్షత్రంలో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం శుభనక్షత్రంలో, శుభలగ్నంలో, శుభముహూర్తంలో ఆవిర్బవిస్తున్నదని పంచాంగకర్తలు, జ్యోతిష్యవాస్తుపండితులు, అర్చకులు, వేదవిద్వాంసులు చెప్పారు. జూన్ 2వ తేదీ, జయనామ సంవత్సరం మొత్తానికి అత్యధిక శుభఫలితాలను ఇచ్చే తిథి,వార, నక్షత్ర,యోగకరణాలతో నిండి ఉన్నదని వారన్నారు.

telanmap చంద్రుడి శుభదృష్టి తెలంగాణ ప్రజలను చల్లగా చూస్తున్నదని, వచ్చే జయ నామ సంవత్సరంలో కూడా తెలంగాణ ప్రజలు బంగారు పంటలతో వర్ధిల్లుతారని జ్యోతిష్యపండితులు చెప్పారు. జూన్ 2 వ తేదీ ఇంగ్లీషు తేదీ ప్రకారం జూన్ 1 అర్థరాత్రి తర్వాత ప్రారంభమవుతుందని, ఆ సమయంలో పునర్వసు నక్షత్రం, అంటే శ్రీరాముడి జన్మనక్షత్రం ఉన్నదని, తెలంగాణ ప్రజలకు ఇంతకన్నా మహోన్నత కానుక మరొకటి లేదని జ్యోతిష్య, వాస్తు విద్వాంసులు బ్రహ్మశ్రీ వావిలాల దామోదరశర్మ పేర్కొన్నారు. పంచాంగకర్తల నిర్ణయం ప్రకారం జయ నామసంవత్సరం జ్యేష్ట శు. చవితి సోమవారం పునర్వసు నక్షత్రంలో శుభలగ్నంలో తెలంగాణ ఆవిర్భావ తిథి వస్తున్నదని, భారత వాస్తు జ్యోతిష్య చరిత్రలోనే విలక్షణమైన తిథిగా ఆ రోజు నిలిచి పోతుందని ఆయన వివరించారు. తెలంగాణకు కావాల్సినన్ని శుభఫలితాలు వచ్చేందుకు జూన్ 2 వ తేదీలోగా మరోసారి 108 మంది రుత్విక్కులతో సహస్రచండీహోమాన్ని చేయాల్సిన అవసరం ఉన్నదని వావిలాల చెప్పారు.

గ్రహదోషం కారణంగా డిసెంబర్ 9 విఫలం…: డిసెంబర్ 9, 2009 ప్రకటన తర్వాత కొన్ని గ్రహదోషాలు ఏర్పడ్డాయని, కర్కాటక రాశి వారిపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అప్పట్లోనే గ్రహించామని వావిలాల చెప్పారు. అందుకే కేసీఆర్ సారథ్యంలో ఏప్రిల్14, 2011 నుండి ఏప్రిల్ 16 వరకు మూడు రోజులు నూటా ఎనిమిది మంది రుత్విక్కులతో పంచకుండాత్మక చండీహోమం నిర్వహించామని గుర్తు చేశారు. ఆ హోమంతోనే చాలా దోషాలు నివారణ అయ్యాయని అభిప్రాయపడ్డారు.

తెలంగాణకు కలిసి వచ్చిన గ్రహస్థితులు..
జూలై 30, 2013 సీడబ్ల్యూసీ ప్రకటన విజయ నామ సంవత్సరం ఆషాఢ బహుళ అష్టమి, భరణి నక్షత్రంలో వృశ్చికరాశిలో, మంగళవారం వచ్చినప్పటికీ లగ్నానికి ఆరవ స్థానంలోని చంద్రుడు అమూల్యమైన ఫలితాలను ఇచ్చాడని టీటీడీ బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు తిరువాయిమొరి కష్ణమాచార్యులు విశ్లేషించారు. అదేవిధంగా విజయ నామ సంవత్సరం భాద్రపద చతుర్ధశి గురువారం మకరలగ్నంలో అక్టోబర్ 3, 2013న కేంద్ర కేబినెట్ జూలై 30 సీడబ్ల్యుసీ ప్రకటనను యథాతథంగా ఆమోదించిందని, ఆ రోజున మకరలగ్నం తెలంగాణ ప్రజలకు మేలు చేసిందని తెలంగాణ అర్చక సమాఖ్య నాయకులు గంగు ఉపేంద్రశర్మ, వఝల రామనరసింహాచార్య, భాగ్యనగర అర్చకపరిషత్తు కన్వీనర్ భాస్కరభట్ల రామశర్మ పేర్కొన్నారు.

లోకసభ తెలంగాణ బిల్లును ఆమోదించిన ఫిబ్రవరి 18న కూడా విజయ నామసంవత్సరం మాఘబహుళ చవితి హస్తానక్షత్రంతో కర్కాటక లగ్నం ఉన్నదని, లగ్నాధిపతి చంద్రుడు ఉన్నాడని, ఈ విధంగా చంద్రుడు తెలంగాణ ప్రజలకు గ్రహానుగమన రీతిలో శుభదృష్టిని కరుణిస్తూ వస్తున్నాడని తెలంగాణ మతైక ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గంగు భానుమూర్తి అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఆమోదించిన రోజు ఫిబ్రవరి 20 న కూడా స్వాతినక్షత్రం, చతుర్థస్థానంలోని శుక్రుడు గొప్ప ఫలితాలను ఇవ్వనున్నాడని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు. సంఖ్యాశాస్త్రరీత్యా కూడా 2 వ సంఖ్య చంద్రుడిని సూచిస్తున్నందున, చంద్రుడి శుభదృష్టి, చల్లని దృష్టి, జయనామసంవత్సర ప్రభావం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం పైన ఉంటుందని తెలంగాణ జ్యోతిష్య వాస్తు విద్వాంసులు, వేదమూర్తులు విశదీకరిస్తున్నారు. ఈ శుభాశుభ ఫలితాలన్నీ సహజంగానే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపైన ప్రభావం చూపాయని, తెలంగాణ ప్రజకు ఆయనను నాయకుడిగా నిలిపాయని వేదపండితులు అభిప్రాయపడుతున్నారు.

This entry was posted in ARTICLES.

Comments are closed.