శేఖర్’.. ఓ పవర్.. ఓ పంచ్.. – టి. కొండబాబు

ఒక సామాన్యుడిగా మొదలై పాతికేళ్ళ ‘స్వయం కృషి’తో నేడు అసామాన్యుడిగా ఆవిష్కృతుడైన ఓ వ్యంగ్య చిత్రకారుడి పరిణామ చిత్రమిది. ‘అతడు వెనుకబడిన ప్రాంతంలో, వెనుకబడిన మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు. పత్రికలు, సాహి త్యం చదవడం, ఏవో వచ్చీరాని బొమ్మలు, కార్టూన్‌లనేబడే గీతలు గీయడం ఒక అలవాటుగా ఉన్నవాడు. అప్పుడప్పుడు తను గీసే కార్టూన్లు పత్రికల్లో చూసుకుని మురిసిపోయినవాడు. తన తల్లిదండ్రుల్లా పొద్దల్లా పడేకష్టం కాక మంచి గుమాస్తా జీవితం చాలనుకున్నవాడు. ఆ ఉద్యోగ ప్రయత్నంలోనే ‘లా’ చదివినా కూడా ఉపాధి దొరకనివాడు. ఈ దశలోనే పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, మానసిక క్లేశాలు, తను జాబ్‌చేస్తూ భార్యను పువ్వుల్లో పెట్టుకుని చూడాలనుకున్నవాడు. భార్య పొలం పనులకు వెళ్తుంటే, తను ఆ పనిచేయడం చేతకాక నిరుద్యోగిగా ఇంట్లోనే ఉండి వేదన అనుభవించినవాడు. అయినా తన ప్రవృత్తిని మాననివాడు. పైసలతో సంబంధం లేకుండా, కమ్యూనిస్టుపార్టీ వాళ్ళు రాయమన్న గోడ రాతలను చిత్తశుద్ధితో రాశాడు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు సామాన్యులను సైనికులుగా మారుస్తాయి. సమర్థులుగా మలుస్తాయి.

అనేక మంది సృజనకారులను సమరశీలురుగా తీర్చిదిద్దాయి. ఆ ఉద్యమ సృజనలో ఒకరు శేఖర్. తెలుగులో తొలి పెద్ద పత్రికల్లో ఒకటైన ఆంధ్రజ్యోతి అనే మంచె మీద కుంచె పట్టుకుని నిలబడ్డాడు. అతనే మన భారతీయ పొలిటికల్ కార్టూనిస్ట్ శేఖర్. అవును శేఖర్ కేవలం తెలుగు కార్టూనిస్ట్ మాత్రమే కాదు. కనీసం 10 భారతీయ భాషల పాఠకులకు తెలిసినవాడు. తను స్వయంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్టూన్లు గీశారు. బెంగాలి, మరాఠీ, గుజరాతి, పంజాబి, మణిపురి, ఉర్దూ వంటి దాదాపు పది భాషల్లోని దినపత్రికల్లో ఈయన కార్టూన్లు ఇంగ్లీష్ నుంచి ఆయా భాషల్లోకి అనువాదమై, ప్రచురితమయ్యాయి. కార్టూనింగ్ పరంగా శేఖర్ బహుముఖీయ కంట్రిబ్యూషన్‌కు మెచ్చి వందేళ్ళ జాతీయ పత్రిక హిందూపత్రిక ‘ఒన్ ఆఫ్ ది బెస్ట్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ ఇన్ ఇండియా’ అని ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్యానం చూసైనా అతను ‘భారతీయ కార్టూనిస్ట్’ అనే మాటకు అర్హుడని చెప్పక తప్పదు. శేఖర్ కార్టూనింగ్‌కి పాతికేళ్లు పూర్తయ్యాయి.

ఉద్యోగంలేని దశలో తన ఇంటిపేరులో సగం ‘కంభా’ అని పెట్టుకుని సోషల్ కార్టూన్ గీయడం మొదలు పెట్టిన శేఖర్ విజయవాడ ప్రజాశక్తిలో ఉద్యోగం సాధించి కార్టూనిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాడు. అప్పటి వరకు సోషల్ కార్టూన్‌లకే పరిమితం అయిన శేఖర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌గా ఎదగడం వె నుక ఆనాటి ఎడిటర్ కీ.శే. మోటూరు హనుమంతరావు, అసోసియేట్ ఎడిటర్ తెలకపల్లి రవి సహాయ, సహకారాలు ఉన్నాయనేది నిజం. అప్పటికి దినపత్రికగా మారిన ప్రజాశక్తికి శేఖరే తొలి కార్టూనిస్ట్. ఆ తర్వాత కాలంలో శేఖర్‌కు రెండుసార్లు ప్రభుత్వోద్యోగం వచ్చినా వెళ్లలేదు. తెలకపల్లి రవి గైడెన్స్‌వల్లనే రాలేదని భావించి శేఖర్ వాళ్ల అన్నయ్య విజయవాడ వచ్చి రవి మీద ఆగ్రహిస్తే ‘ఉద్యోగాలు చేసేవాళ్లు చాలామంది ఉంటారు. మీ వాడి లాంటి కార్టూనిస్టులు అరుదుగా ఉంటారు’ అని రవి సూటిగా చెప్పడంతో ఆయన కన్విన్స్ అయ్యారు. సరిగ్గా బొమ్మ గీయడం కూడా రాని శేఖర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌గా ఎదగడానికి వారి తర్ఫీదుతో పాటు శేఖర్ స్వయంకృషి, వినయ విధేయతలే ముఖ్యకారణం.

శేఖర్ ఆర్‌కె లక్ష్మణ్‌కి ఏకలవ్య ‘శిష్యుడు’. ఆయన విజయవాడ వచ్చినప్పుడు కలిసిన సందర్భంలో తన ఆనందం చెప్పలేనిది. తొలిరోజుల్లో కార్టూనిస్ట్ సురేంద్ర, జయదేవ్ లాంటి వారు కూడా శేఖర్ కు చాలా సహకరించారు. దినపత్రికల్లో పాకెట్ కార్టూన్ అంటే బొమ్మలతో సమకాలీన చరిత్రను చెప్పడమే. అలా పాతికేళ్ళుగా చెప్తున్నవాడు శేఖర్. ఇప్పుడున్న పొలిటికల్ కార్టూనిస్టులలో ప్రజల కోణం నుంచి గీత గీస్తున్న ఒకరిద్దరిలో శేఖర్ ఒకరంటే అతిశయోక్తి కాదు. శేఖర్ పాతికేళ్ళ సృజన ఈ పాతికేళ్ళ సమకాలీన ప్రపంచ, భారత, తెలుగువారి రాజకీయార్థిక సామాజిక చరిత్రే’. కాకపోతే బొమ్మలతో చెప్పిన చరిత్ర. ఈ పాతికేళ్లలో తనుస్పృశించని, సృజించని వర్తమాన సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సైద్ధాంతికపరిణామాలు దాదాపు లేవనే చెప్పాలి. భూస్వామ్యం, భూస్వామ్య పెత్తందారీతనం, పెట్టుబడిదారి దోపిడీ, బూర్జువా వర్గ రాజకీయాలు, కమ్యూనిస్టు అతివాద మితవాదాలు, స్త్రీవాదం, దళిత బహుజన వాదం, మైనారిటీ వాదం, ప్రాంతీయ అస్తిత్వాలు… ఇలా ఒకటేమిటి తాను స్పర్శించని భావజాలం లేదు. ఇక ప్రభుత్వాలవిధానాలతో, సమస్యలతో యాతనపడే కార్మికులు, కర్షకులు, చిరుద్యోగులు, వేతన జీవులు వీధుల్లోకి వచ్చిన ప్రతిసారీ తన కుంచెను కరవాలంగా ఝళిపించాడు శేఖర్. సాధారణంగా పొలిటికల్ కార్టూన్ అనగానే రాజకీయ పార్టీలపైనో, నాయకులపైనో గీయడం సహజం. శేఖర్ వాటికిమించి ఆయాపార్టీల విధానాలను, ఆయా ప్రభుత్వాల పథకాలను, సామాన్యుడిపై వాటి దుష్ప్రభావాలను కార్టూన్‌లో చూపించాడు.

శేఖర్ కార్టూన్‌లు ఎప్పుడూ హాస్యాన్ని, ఆలోచననూ సమపాళ్ళలో రంగరించి ఉంటాయి. పాతికేళ్ళ నాడు అంతే.. నేడూ అంతే.. హాస్యానికంటే ఆలోచనపాలే ఒకింత ఎక్కువేమో కూడా!… ‘కార్టూన్ అనగానే హాస్యస్ఫోరకంగానే ఉండాలి. పొలిటికల్ కార్టూన్ అంటే ఆలోచన కూడా రేకెత్తించాలి’ అనేది శేఖర్ దృక్పథం. ఎప్పుడో పదేళ్ళ నాడు ఓ ఇంటర్వ్యూ కోసం కొన్ని ప్రశ్నలు పంపిస్తే హాస్యానందం వారు కూడా అవే ప్రశ్నలకు తమకు ఇంటర్వ్యూ ఇమ్మని అడిగారు. రోటీన్‌కి భిన్నమైన శేఖర్ నోటితోకాకుండా కుంచెతో వాటికి సమాధానం చెప్పాడు. అందులో ఒక ప్రశ్న పొలిటికల్ కార్టూన్‌కు ప్రయోజనం ఎలా తెప్పించాలి అనేది. నవ్వుతున్న వ్యక్తి “కండరాలు సాగి, మెదడు నరాలను ‘కదిలి’ంచినట్లు” శేఖర్ గీసిన బొమ్మ ఇప్పటికీ మనోఫలకంపై అలాగే ఉంది. ఆలోచనతో, బొమ్మతో పంచ్‌ని, ఫన్‌ని కలిపి తెలుగువారికి ప్రతినిత్యం పంచుతున్న పొలిటికల్ కార్టూనిస్ట్ శేఖర్. తన గీతలో కంటే ఐడియాలోనే పవరు, పంచ్ ఎక్కువ.

ప్రధాన స్రవంతి పత్రికల్లో కచ్చితంగా శేఖర్‌ది భిన్నమైన కుంచె.తను పనిచేసే పత్రికల్లో ఏ రాజకీయాలకు పక్షం వహిస్తున్నప్పటికీ, ఏ రాజకీయపక్షాల భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ తనదైన ప్రజాపక్షపాతానికి ఆయా అంశాలపై జడ్జిమెంట్‌ను చొప్పి ంచి ఎడిటర్‌ని, యాజమాన్యాన్ని ఒప్పించే నేర్పరి. శేఖర్ ఎన్ని సం స్థలు మారినా ఇప్పుడూ అప్పుడూ ప్రగతిశీల భావనలనే కనబర్చాడు. కనబరుస్తున్నాడు. నేటికీ శేఖర్‌లో తొలినాటి ఉద్వేగం, ప్రజాపక్షపాతం, సైద్ధాంతిక నిబద్ధత అలాగే ఉన్నాయి. నిత్య విద్యార్థిగా సమకాలీన అంశాలను అధ్యయనంచేయడం ఆయన బలం. రష్యన్, అమెరికన్, చైనీస్ కార్టూన్‌లను స్టడీ చేశారు. అమెరికన్ కాన్సులేట్ కొంతమంది కార్టూనిస్ట్‌లను ఎంపిక చేసి తమ దేశానికి స్టడీ టూరు కింద ఆహ్వానిస్తే ఎంపికై వెళ్ళి వచ్చిన ఏకైక తెలుగువాడు శేఖర్.
స్వయం కృషితో ఎదిగి, దాదాపు 50వేల కార్టూన్‌లకు దగ్గరైన శేఖర్‌కు స్నేహితుడిగా హగ్స్, జర్నలిస్ట్‌గా అభినందనలు.. అభివందనాలు. తను మరో 50వేల కార్టూన్‌లతో నూరు వసంతాలు పూయించాలని ఆశ పడుతున్నారు.
 టి. కొండబాబు
(శేఖర్ కార్టూన్లకు రజతోత్సవం జరుగుతున్న సందర్భంగా)

This entry was posted in ARTICLES.

Comments are closed.