శీతాకాల సమావేశాల్లో బిల్లు వచ్చేనా?

 గత నెల రోజులుగా హస్తినలో అనూహ్యమైన వేగంతో సాగిన తెలంగాణ ప్రక్రియకు.. అకస్మాత్తుగా బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నది. మొన్నటిదాకా దూసుకుపోయిన ప్రక్రియ.. కొద్ది రోజులుగా మందగమనంతో సాగుతున్నది. ఇదిగో జీవోఎం సమావేశం.. అదిగో తయారైన నివేదిక.. అంటూ ప్రచారార్భాటం సాగినా.. ఆచరణలో మాత్రం నిర్ణయాత్మక అడుగులు లేకపోవడం తెలంగాణవాదుల్లో ఆందోళన కలిగిస్తున్నది. దీనికితోడు రాయల తెలంగాణ అంటూ తెరపైకి వచ్చిన కొత్త ప్రతిపాదనలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొన్నటి కాంగ్రెస్ కోర్ కమిటీలో జీవోఎం నివేదిక ఆమోదం పొందుతుందని భావించినా.. అలాంటిదేమీ జరుగలేదు. సోమవారం జీవోఎం భేటీ అవుతుందనుకున్నా.. అదీ కాలేదు. దానిని మంగళవారం సాయంత్రానికి మార్చారు. మంగళవారం జరుగుతుందని ప్రకటించిన కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం కూడా జాడలేకుండా పోయింది. గురువారం సాధారణంగా జరగాల్సిన కేబినెట్ సమావేశం 5న ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఐదు నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు అజెండాలో లేదు.

jpdelhiపార్లమెంటు పనిదినాలు తక్కువగా ఉన్న కారణంగా సమావేశాలను పొడిగిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం రావడం లేదు. తెలంగాణ విషయంలో ఇంకా పూర్తికావాల్సిన ప్రక్రియ చాలా ఉందని, అదంతా పూర్తయితే వెంటనే బిల్లు పెడతామని చెప్పడం మినహా నిర్దిష్ట హామీ మాత్రం లభించడం లేదు. ఇదే విషయంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రశ్నించగా.. అజెండాలో లేనప్పటికీ ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తీసుకువస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ జవాబిచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టడం వీలుకాకపోతే పార్టీలు కోరిన మీదట ప్రత్యేకంగా ఇందుకోసమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పారని సమాచారం. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని సుష్మ డిమాండ్ చేయగా.. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే తెలంగాణ బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని, రాష్ట్రపతి నుంచి అసెంబ్లీకి వెళ్లి వచ్చిన వెంటనే బిల్లు ప్రవేశపెడతామని హోం మంత్రి షిండే చెప్పారని తెలిసింది.

సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియను పూర్తి చేసే పనిలో ఉన్నామని ఆయన అఖిలపక్షానికి తెలిపారు. అఖిలపక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన సుష్మాస్వరాజ్.. ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు రావడం లేదని షిండే చెప్పారని పేర్కొనడం విశేషం. కేబినెట్ ఆమోదం తర్వాత బిల్లును రాష్ట్రపతికి పంపుతామని, ఈ కార్యక్రమం పూర్తయ్యే సరికి సమయం పడుతుందని, అందువల్ల ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టడం సాధ్యం కాదని షిండే తెలిపారని ఆమె వెల్లడించారు. అయితే.. వీలైనంత త్వరగా బిల్లు పెట్టాలని కోరినట్లు సుష్మ చెప్పారు. ఇదే విషయంలో విలేకరులతో మాట్లాడిన కమల్‌నాథ్.. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని పార్టీలూ ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు రావాలని కోరుకుంటున్నాయని చెప్పారు.

అయితే.. రాష్ట్రపతి ఆమోదం.. న్యాయశాఖ పరిశీలన వంటివి ఉన్నాయని, పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ఇవన్నీ పూర్తయితే ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెడతామని తెలిపారు. సమావేశాలను పొడిగించే అవకాశాలపై ఆయన స్పష్టం చేయలేదు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బిల్లు అని నామకరణం చేయనున్నట్లు తెలుస్తున్నది. దీని ద్వారా రాజ్యాంగ సవరణ లేకుండానే రెండు రాష్ట్రాలు ప్రత్యేక ప్రతిపత్తి పొందేందుకు అవకాశం ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. రాజ్యాంగంలోని 371 డీ అధికరణం కింద తెలంగాణ, విభజన అనంతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అంశాన్ని, దీనితోపాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపే అంశాన్ని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిసింది. ఈ రెండు అంశాలపై మంగళవారం సాయంత్రం జరిగే మంత్రుల బృందం చివరి భేటీ, గురువారం జరిగే కేంద్ర కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తున్నది.

ఈ మేరకు పునర్విభజన బిల్లు కూడా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. జీవోఎం అందించిన నివేదిక ఆధారంగా 69 పేజీలతో కూడిన ముసాయిదా బిల్లును న్యాయశాఖ తయారు చేసిందని, దీనికి జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ తుది మెరుగులు దిద్దారని సమాచారం. మంగళవారం జరిగే జీవోఎం సమావేశంలో సభ్యులకు అందించేందుకు ముసాయిదా బిల్లు కాపీలు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. దీనిపై జీవోఎం చర్చించి.. తుది నిర్ణయానికి రానుంది. రాయల తెలంగాణ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకున్నారా? లేదా? అన్నదాంట్లో స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారని పీటీఐ తెలిపింది. ఈ ప్రతిపాదనను జీవోఎం, కేబినెట్ ఆమోదించినట్లయితే.. ఉభయ రాష్ట్రాలకు 147 అసెంబ్లీ స్థానాలు, 45 మండలి స్థానాలు, 21 ఎంపీ స్థానాలు ఉంటాయి. అయితే ఈ ప్రతిపాదనకు కర్నూలుకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు, ఎంఐఎం తప్ప మరెవరూ అనుకూలంగా లేరు. పైగా టీ కాంగ్రెస్ సహా టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ వంటి కీలక పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఆకు అందకుండా.. పోకకు పొందకుండా అన్న చందాన మాట్లాడారు. జీవోఎం నివేదికలో ఏమున్నదో తనకు తెలియదన్న దిగ్విజయ్‌సింగ్.. ‘తెలంగాణ తెలంగాణగానే ఉంటుంది. రెండు జిల్లాలను కలిపినప్పటికీ అది తెలంగాణగానే ఉంటుంది’ అన్నారు. జీవోఎం నివేదిక బయటికి వస్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. అప్పటిదాకా ఎదురుచూడాలని అన్నారు.

సమావేశాల షెడ్యూల్‌లో మార్పులు
రాష్ట్ర విభజనపై కసరత్తులు పూర్తి చేసిన కేంద్ర మంత్రుల ఉప సంఘం (జీవోఎం), కేంద్ర కేబినెట్ భేటీలు వాయిదా పడ్డాయి. ముందుగా సోమవారం జీవోఎం సమావేశం, మంగళవారం కేంద్ర కేబినెట్ ప్రత్యేక భేటీ జరుగుతాయని భావించినా.. తాజా షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం జీవోఎం సమావేశం జరగనున్నది. గురువారం మంత్రివర్గం భేటీ కానుంది. మంగళవారం జరిగే భేటీలో రాష్ట్ర విభజనకు సంబంధించి తుది నివేదికను జీవోఎం సభ్యులు ఖరారు చేస్తారని, ఆ తరువాత ఆ నివేదికను కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తారని సమాచారం. ఆ సమావేశంలో ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందని తెలుస్తున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం పొందాలని కాంగ్రెస్ పార్టీ, కేంద్రం పట్టుదలతో ఉన్నందున ఇప్పుడు జరగబోయే కేబినెట్ సమావేశంలో జీవోఎం నివేదికపై చర్చించి, తెలంగాణ ముసాయిదా బిల్లుకు తుది రూపం ఇచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు.

డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. సోమవారం ఢిల్లీకి రావాలని ఆయనకు పార్టీ పెద్దల నుంచి పిలుపు వచ్చినట్లు చెబుతున్నారు. జీవోఎం బృందం చివరి భేటీ సోమవారం సాయంత్రం జరగాల్సి ఉన్న తరుణంలో డిప్యూటీ సీఎం హస్తినకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. కానీ జీవోఎం భేటీ వాయిదాపడటంతో డిప్యూటీ కూడా తన షెడ్యూలును మార్చుకున్నట్లు భావిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పర్యటన వాయిదా పడటానికి కారణాలు అధికారికంగా తెలియరాలేదు. నాలుగు రోజుల క్రితమే హస్తిన వెళ్ళిన డిప్యూటీ సీఎం అక్కడ పార్టీ పెద్దలు, జీవోఎం సభ్యులను కలిసి, ఆదివారమే నగరానికి తిరిగి వచ్చారు. అయితే ఆయన సోమవారం మరోసారి హస్తిన బాట పట్టేందుకు సిద్ధమైనప్పటికీ చివరి క్షణాల్లో ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తీసుకురావాలి. ప్రభుత్వం రాత్రీ పగలు చర్చిస్తున్నా ఆ బిల్లు పార్లమెంటు సమావేశాల అజెండాలో లేకపోవడం అశ్చర్యకరం.

సుష్మాస్వరాజ్, బీజేపీ నాయకురాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు 12 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నాం. అందువల్ల తెలంగాణ బిల్లు పెట్టడం వీలుకాకపోతే పార్టీలు కోరిన మీదట ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం..

కమల్‌నాథ్, కేంద్ర మంత్రి

తెలంగాణ బిల్లును కేబినెట్ ఆమోదించిన వెంటనే రాష్ట్రపతికి పంపిస్తాం.. అసెంబ్లీకి వెళ్లివచ్చిన తర్వాత పార్లమెంటులో ప్రవేశ పెడతాం.. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ ప్రక్రియను పూర్తిచేస్తాం..

సుశీల్‌కుమార్ షిండే, కేంద్ర హోంమం

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.