శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు

డిసెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించారు. తెలంగాణ ప్రక్రియ వేగంగా జరుగుతున్నప్పటికీ.. బిల్లును రానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారా? లేదా? అన్న సస్పెన్స్ ఇప్పటివరకూ కొనసాగుతూ వచ్చింది. షిండే అధికారిక ప్రకటనతో ఆ విషయంలో ఊహాగానాలకు తెరదిగినట్లే. 11న జరిగిన కార్యదర్శుల భేటీకి కొనసాగింపుగా గురువారం కేంద్ర న్యాయశాఖ, ఆర్థిక శాఖ, రైల్వే, సిబ్బంది శాఖల కార్యదర్శులతో జీవోఎం సమావేశమైంది.
సమావేశం అనంతరం షిండే విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బిల్లు తయారీకి సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తయిన షిండేతో పాటు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి జైరాంరమేశ్ కూడా తెలిపారు. న్యాయపరమైన, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి ఇంకా ఏవైనా చిన్న చిన్న అంశాలుంటే ఈ నెల 20 వరకు ఆయా శాఖల కార్యదర్శులతో చర్చించి, ముగించేస్తామని స్పష్టం చేశారు.

ఈ నెల 20న జరిగే జీవోఎం తదుపరి సమావేశంలో ముసాయిదా బిల్లును ఖరారు చేయనున్నట్లు జైరాంరమేశ్ వెల్లడించారు. 21న జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోదించి, బిల్లును రాష్ట్రపతికి పంపుతామని తెలిపారు. 18న జరిగే సమావేశం షెడ్యూల్‌ను కూడా జైరాం వెల్లడించారు. ఉదయం పదిన్నరకు తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులతో, పదకొండున్నరకు సీమాంధ్ర కేంద్ర మంత్రులతో జీవోఎం భేటీ జరుపుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సమావేశమవుతామని జైరాంరమేశ్ తెలిపారు. ఈ సమావేశాలు అఖిలపక్షం తరహాలోనే విడివిడిగా జరుగనున్నాయి. సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా పడటానికి బాలల చలన చిత్రోత్సవంలో ఆయన పాల్గొనాల్సి రావడమే కారణమని షిండే స్పష్టం చేశారు. అంతకు మించి వేరే కారణం లేదన్నారు. గురువారం కేంద్ర హోం మంత్రి షిండే ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో సమావేశంలో రాష్ట్ర పునర్విభజన బిల్లు ముసాయిదాపై తుది చర్చలు జరిగాయని సమాచారం.

సాయంత్రం 4.15 గంటలకు మొదలైన చర్చలు.. రాత్రి ఎనిమిదిన్నరకు ముగిశాయి. ఈ సమావేశంలో జీవోఎం సభ్యులు షిండే, జైరాంరమేష్, వీరప్ప మొయిలీ, నారాయణ స్వామి పాల్గొన్నారు. న్యాయశాఖ, ఆర్థిక శాఖ, సిబ్బంది వ్యవహారాల శాఖ, రైల్వే శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు చర్చల్లో పాల్గొన్నారు. బిల్లు తయారీలో తీసుకోవాల్సిన న్యాయపరమైన జాగ్రత్తలపై న్యాయశాఖ లీగల్ వ్యవహారాల కార్యదర్శితో కూలంకషంగా చర్చించినట్లు సమాచారం. అటార్నీ జనరల్ వాహనవతి కూడా సమావేశానికి రావాల్సి ఉన్నా.. ఆయన పాల్గొనలేదు. చర్చల్లో ఎక్కువ సమయాన్ని న్యాయ, ఆర్థిక శాఖల కార్యదర్శులకు కేటాయించిన సభ్యులు.. బిల్లు రూపకల్పనలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిసింది. బిల్లు తయారీ క్రమంలో న్యాయ శాఖ పాత్ర కీలకంగా ఉండనుంది. హోం శాఖ తనకేం కావాలో వివరాలు అందిస్తే.. ఆ మేరకు బిల్లును తయారు చేసే బాధ్యత న్యాయశాఖదే.

ఈ విషయంలో హోం శాఖ, న్యాయ శాఖ సమన్వయంతో నడవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని న్యాయ శాఖ జాయింట్ సెక్రటరీ విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ చెప్పారు. ‘బిల్లు ఏ విధంగా రూపొందించాలి? అందులో ఏయే అంశాలు చేర్చాలి? అనే వివరాలను మాకు అందిస్తే వాటన్నిటినీ క్రోడీకరించుకుంటూ, న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లును రూపొందించడం మా బాధ్యత’ అని ఆమె అన్నారు. ఇప్పటికే ప్రాధమికంగా న్యాయశాఖ బిల్లును తయారు చేసినట్లు సమాచారం. కీలకంగా భావిస్తున్న పలు అంశాలను ఇంకా ఆ బిల్లులో చేర్చలేదని తెలుస్తున్నది. బిల్లు తుది రూపం సంతరించుకోవడానికి మరికొన్ని సమావేశాలు అవసరమవుతాయని ఆమె విలేకరులతో అన్నారు. బిల్లు తయారీ అనంతరం రాష్ట్రపతికి, అటు నుంచి శాసనసభ అభివూపాయానికి బిల్లు రానుంది. ఈ అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు లెజిస్లేచర్ అఫైర్స్ శాఖ కార్యదర్శితోనూ జీవోఎం సభ్యులు చర్చించినట్లు తెలుస్తున్నది.

371 డీ ఆర్టికల్‌ను సవరించడమా? లేక కొనసాగించడమా? అనే అంశంపైనా చర్చలు జరిగినట్లు తెలిసింది. వీటితోపాటు మరికొన్ని న్యాయపరమైన అంశాలపై శుక్ర, శనివారాల్లో చర్చించి.. తుది ముసాయిదా బిల్లును ఖరారు చేయనున్నారు. గురువారం కీలకంగా చర్చించిన వాటిలో ఆర్థిక వ్యవహారాలు కూడా ఉన్నాయి. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు పంచాల్సిన ఆస్తులు, అప్పులు, రెవిన్యూ పంపకం తదితర అంశాలను చర్చించారు. మరికొన్ని అంశాలను ఆర్థిక శాఖ కార్యదర్శితో శుక్ర, శనివారాల్లో చర్చించనున్నారని సమాచారం. రైల్వే శాఖ కార్యదర్శితో చర్చించిన జీవోఎం సభ్యులు ఇరు రాష్ట్రాలలో రైల్వే శాఖల విభాగాలను ఏర్పాటు చేయడంతోపాటు.. ఉభయ రాష్ట్రాల్లో రైల్వేల అభివృద్ధికి తీసుకోవాల్సి అంశాలపై వివరాలు తీసుకున్నారని తెలిసింది. విమానయాన శాఖ, నౌకాయాన శాఖ, భూ ఉపరితల రవాణా, రోడ్లు రహదారుల శాఖ కార్యదర్శులతో చర్చించి.. వివరాలు తెలుసుకున్నారు. వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.