శీతాకాల పార్లమెంటుసమావేశాలకు ముందే..తెలంగాణపై నివేదిక

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నెలకొల్పిన కేంద్ర మంత్రుల బృందం తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు కేంద్ర కేబినెట్‌కు సమర్పిస్తుందని బృందం సారథి, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే ప్రకటించారు. అయితే ఎప్పటిలోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు.
shindeకొత్త రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ఉంటుందని, పార్లమెంటు ఎప్పుడు బిల్లు ఆమోదిస్తే అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పాటు అవుతుందని బదులిచ్చారు. జీవోఎం తదుపరి సమావేశం నవంబర్ ఏడున జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రులు చర్చించేందుకు వీలుగా ఐదవ తేదీకి నివేదికలు సిద్ధం చేసి, జీవోఎంకు అందజేయాలని శుక్రవారం సాయంత్రం జరిగిన తొమ్మిది శాఖల కార్యదర్శుల సమావేశం నిర్ణయించింది. సోమవారం నుంచి ప్రతి రోజూ సమావేశమై నివేదికల విషయంలో పురోగతిని సమీక్షించాలని నిర్ణయించారని సమాచారం. ఉభయ ప్రాంతాలకు సంతృప్తి కలిగేలా తమ సిఫారసులు ఉంటాయని అధికారులు అంటున్నారు.

ఇప్పటికే రాష్ట్రం నుంచి ఈ విషయంలో పెద్ద ఎత్తున సమాచారాన్ని తెప్పిస్తున్న జీవోఎం నోడల్ శాఖలు వాటిని వర్గీకరించే పనిలో ఉన్నాయి. ఇదే క్రమంలో శుక్రవారం నాటి భేటీలో కార్యదర్శులు తదుపరి కార్యాచరణపై చర్చించారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి సలహాలు సూచనలు అందజేయడానికి నవంబర్ ఐదును జీవోఎం గడువుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే గడువులోపు రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో సమాచారం కేంద్రానికి చేరేలా చూడాలని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ విభాగాల కార్యదర్శులను కేంద్ర కార్యదర్శులు ఆదేశించినట్లు తెలిసింది. నీటి వనరులు, ఆస్తులు, అప్పులు వంటివాటి పంపకాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఏడవ తేదీన జరిగే సమావేశం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు.

ఈ సమావేశంలో దాదాపు తుది నిర్ణయాలకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోపు జీవోఎం తన నివేదికను సమర్పిస్తుందని షిండే చెప్పడాన్ని బట్టి చూస్తే.. ఆ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత నవంబర్ 20 నాటికి ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి పంపాలనే ఆలోచనలు ఉన్నా.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే పరిణామాలతో సంబంధం లేకుండానే తెలంగాణకు రాష్ట్ర ప్రతిపత్తి ఇచ్చే విషయంలో నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.