శివనామస్మరణలతో మార్మోగుతున్న శివాలయాలు

హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాన శివాలయాలన్నీ శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచే శివాలయాలకు భక్తులు పోటేత్తారు. వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించి శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శ్రీశైలంలో భక్తులు కిక్కిరిసిపోయారు. ఆలయాలన్ని విద్యుద్దీపాలంకరణతో వెలుగొందుతున్నాయి.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మల్లన్న గజవాహనంపై దర్శనమిచ్చారు. ఆదివారం సాయంత్రం 7 గంటలకు నందిని వాహనంపై నీలకంఠుడు దర్శనమివ్వనున్నారు. శ్రీశైలానికి భక్తులు పోటేత్తడంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కరీంనగర్ జిల్లా వేములవాడలో, వరంగల్‌ జిల్లా వేయిస్తంభాలగుడిలో, రామప్పలో..మెదక్ జిల్లాలో ఏడుపాయలు, రంగారెడ్డి జిల్లాలో కీసర, మహబూబ్‌నగర్ జిల్లాలో అలంపూర్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మల్లన్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.