వ్యవసాయం ఓ సంస్కృతి -కేసీఆర్

మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఏదో విలాసవంతమైన భవనం ఉందని.. అక్కడ ఆయన కాలక్షేపం చేస్తుంటాడని ఆక్రోశం వెళ్లగక్కుతుంటారు! కానీ.. అక్కడికి వెళ్లి చూస్తే ఆ విమర్శలన్నీ మబ్బుతెరల్లా కొట్టుకుపోతాయి! అనుమానాలు పటాపంచలవుతాయి! ఇంతకీ అక్కడేం జరుగుతున్నది? అక్కడ ఓ అద్భుతమైన శ్రమ.. రాజీలేని పట్టుదలతో సాగుతున్నది! అచ్చం తెలంగాణ సాధించేందుకు పూనిన సంకల్పంలాంటిదే! సంప్రదాయ పద్ధతులకు ఆధునికతను జోడించి.. ఒక ఆదర్శవంతమైన వ్యవసాయ క్షేత్రం అక్కడ ఎదుగుతున్నది! చుట్టూ విస్తారమైన పచ్చటి పొలం.. ఒకవైపు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గ్రీన్‌హౌస్.. కేసీఆర్‌కు వ్యవసాయంపై ఉన్న నిబద్ధతను చాటి చెబుతుంటాయి! ఈ గ్రీన్‌హౌస్‌లను తెలంగాణ రాష్ట్రంలో 200 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలన్నది ఆయన కల! తెలంగాణ ఉద్యమాన్ని ఒకవైపు స్ఫూర్తిమంతంగా నిర్వహిస్తూనే.. తన బంగారు తెలంగాణ కలను సాకారం చేయడానికి ఆయన అక్కడ నిరంతర అధ్యయనం కొనసాగిస్తున్నారు! అందుకే ఆయన అగ్రికల్చర్ అంటే కేవలం వ్యవసాయం మాత్రమే కాదని.. అదొక కల్చర్ (సంస్కృతి) అని చెబుతున్నారు! ఆచరించి చూపిస్తున్నారు! కేసీఆర్ కలల క్షేత్రం -తెలంగాణకు రైతులకు మార్గదర్శిగా నిలిచిన టీఆర్‌ఎస్ అధినేత -విమర్శలను ఖాతరు చేయకుండా నిర్మించుకున్న సేద్యసౌధం

డబ్బులుంటే అన్నీ కాళ్లదగ్గరికే నడిచుకుంటు వస్తాయనే నానుడి అన్నింటికీ పనిచేయదని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. కొన్ని నెలల నిరంతర శ్రమతోపాటు, సాధించాలనే పట్టుదల వల్లే ఇక్కడ ఆధునిక వ్యవసాయం సులువుగా మారిందని స్పష్టమవుతోంది. కేసీఆర్ తెలంగాణ అంశాన్ని పక్కనబెట్టి ఫాంహౌస్‌లో పండుకుంటున్నారనే విమర్శలను ఏమాత్రం ఖాతరు చేయకుండా ఒకవైపు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తూనే… మరోవైపు తనకున్న వ్యక్తిగత వాంఛను సంపూర్ణంగా నెరవేర్చుకుంటున్నారు గులాబీ దళపతి. ‘మా నాయినకు వ్యవసాయం అంటే ఖాయిష్ ఉండేది. అప్పుడు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు వచ్చేటోళ్లు, మా నాయిన దగ్గరికి అగ్రికల్చర్ ఆఫీసర్లు సమయానుకూలంగా వచ్చి పంటను చూసేవారు. అదే అలవాటు నాకు పడింది. అందుకే వ్యవసాయం చేస్తున్నా’ అని కేసీఆర్ తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. కేవలం భూమి ఉంటే చాలు వ్యవసాయం చేసుకోవచ్చు అన్నదానికి భిన్నంగా ఒక కొత్త తరహా వ్యవసాయ విధానాన్ని కరువుతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగానికి చేసి చూపిస్తున్నారు కేసీఆర్. కష్టం అనుకున్న దాన్ని ఇష్టంగా మార్చుకుని రైతు మార్గదర్శిగా వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ సాధనకు ముందే కేసీఆర్ వ్యవసాయంపై అధ్యయనం చేస్తున్నారు. భూమిలో విత్తనం నాటిన నాటినుంచి దాన్ని మార్కెట్‌లో ఎలా అమ్మాలనే అంశం వరకు కూలంకషంగా సమాచారం సేకరిస్తున్నారు. కేసీఆర్ నిజంగా ఇప్పుడు చేస్తున్నది ట్రయలే అయినా … రేపటి తెలంగాణ సమాజం ఆచరించడానికి ఒక మెట్టు అని ఆ వ్యవసాయం చూసిన వారు చెప్పక తప్పదు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలోని వాస్తవ చిత్రణ ఇది. 45 ఎకరాల్లో ఆలూ..: మొత్తం 60 ఎకరాల భూమిలో సాగులో ఉన్నది 55 ఎకరాలు. ఇందులో 40-45 ఎకరాల్లో ఆలూను సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించిన విత్తనాలను బెంగుళూరుకు చెందిన నామ్‌దారి కంపెనీ నుంచి తెప్పించారు. సంక్రాతి తరువాత ఆలూ పంట చేతి కందుతుంది. ఎకరాకు నాలుగు లక్షల ఆదాయం ఉంటుందని కేసీఆర్ చెప్తున్నారు. పూర్తి పంటకు డ్రిప్ ద్వారానే నీళ్లు అందుతాయి. క్యాప్సికమ్ ఎల్లో… అండ్ రెడ్..: 10 ఎకరాల్లో ఉన్న గ్రీన్‌హౌస్‌లో కలర్ క్యాప్సికమ్ వేశారు. ఎల్లో అండ్ రెడ్ కలర్‌లో ఈ పంట పండుతోంది. దీనికి ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. పెద్దపెద్ద కార్పొరేట్ వ్యాపార సంస్థలు కొనుగోలుకు ఆసక్తిని చూపుతున్నాయి. రూ.75-350 వరకు కిలో కలర్ క్యాప్సికమ్ గత మార్కెట్‌లో అమ్ముడయ్యాయి. ఇప్పుడు కనీసం రూ.100 అమ్మినా 10 ఎకరాల్లో 10 కోట్లు వస్తుంది. kcr0130 గుంటల్లో బావి.. : పంటలు పండించేందుకు ఎన్ని ఉన్నా సాగునీరు లేకుంటే వ్యవసాయం చాలా కష్టమవుతుంది. కానీ కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గకుండా అపరభగీరథుడిలా మారి తనకున్న భూమిలోనే 30 గుంటల్లో 60 అడుగుల లోతులో బావిని తవ్వించారు. ప్రస్తుతం క్యాప్సికమ్, ఆలూ పంటలకు ఈ బావి నుంచే నీళ్లు వెళ్తున్నాయి. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పడ్డ ప్రతి వాన చినుకును సద్వినియోగం చేసుకునేలా ప్లాన్‌ను రూపొందించారు. ప్రతి గట్టు పక్కన కాలువ తవ్వించి పడ్డ నీరంతా బావిలోకి వెళ్లేలా పైపులు ఏర్పాటు చేయించారు. కేసీఆర్ పొలానికి ఆనుకునే ఉన్న పానాదిలోని నీళ్లు కూడా బావిలోకి వెళ్తాయి. ఇవి మూడు పైపుల ద్వారా వెళ్తాయి. ప్రస్తుతం 40 అడుగుల లోతు వరకు నీళ్లు ఉన్నాయి. ఈ బావిని తవ్వించడం వల్ల కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న ఎంతోమంది రైతులకు సహాయం చేసినట్లైంది. పక్కనున్న రైతులు పత్తి, మొక్కజొన్న వేసుకోవడం మాని బోర్లు వేసుకుని వరినే సాగుచేస్తున్నారు. బావి తవ్వించడం వల్లే భూగర్భ జలాలు పెరిగాయని వారు చెప్తున్నారు. గతంలో ఇక్కడ 200 అడుగులకుపైగా లోతులోనే బోర్లలో నీళ్లు పడేవి. కానీ ఇప్పుడు 150 అడుగుల్లోనే బోర్లలో నీళ్లు వస్తున్నాయి. kcr02కార్మికులకు దేవుడు.. : పనిచేసిన వారికి ఆపన్నహస్తం అందించే దేవుడిగా కేసీఆర్‌ను వ్యవసాయ కార్మికులు కీర్తించబడతారు. మొత్తంగా 60 మంది వ్యవసాయ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిందరికీ కేసీఆర్ క్వార్టర్స్ కట్టించారు. తన పొలంలోనే కేసీఆర్ ఐదెకరాల్లో వరి పండించి బియ్యం కార్మికులకు ఉచితంగా అందజేస్తారు. పాడి పశువుల ద్వారా వచ్చేపాలను రోజు అరలీటర్ ఉచితంగా అందిస్తారు. ప్రతి క్వార్టర్‌కు గ్యాస్ కనెక్షన్, స్టౌవ్‌ను ఇప్పించారు. కేసీఆర్ క్షేత్రంలో మొత్తం నాలుగు ట్రాక్టర్లు, 10కిపైగా ఇనుప నాగళ్లు ఉన్నాయి. తన వ్యవసాయ పొలాన్ని మొత్తం తిరగడానికి కేసీఆర్‌కు క్షేత్రంలో ఉపయోగించే మోటారు సైకిల్ కూడా ఉంది. ఈ క్షేత్రంలోనే వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ కేంద్రం కూడా ఉంది. పంటలకు అవసరమైన సహజ ఎరువులను ఇక్కడే తయారుచేస్తారు. అతి సాధారణ భవనం: కేసీఆర్ నివాసం ఉండటానికి ఒక ఎకరంలో విస్తీరంలో ప్రహారీ నిర్మించారు. ఇందులో కేసీఆర్ ఇల్లుతోపాటే అక్కడ పనిచేస్తున్న వారు ఉండటానికి నిర్మించిన క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఈ రెండు ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. తరతమ భేదాలేవీ లేకుండా కేసీఆర్ వారితో కలిసిపోతారనడానికి ఇదే నిదర్శనంగా నిలుస్తోంది. కేసీఆర్ తన చేతిలోకి పసుపు, ఎరుపు రంగు క్యాప్సికమ్‌ను తీసుకొని పరిశీలించినప్పుడు.. తన పిల్లలను చూసుకున్న ఆనందం ఆయన కళ్లలో కనిపించింది. కష్టపడి పండించిన పంటను చూసుకొని, దాని దిగుబడిని తనివితీరా తాకి రైతు ఎలాంటి సంతృప్తి పొందుతారో.. కేసీఆర్ కూడా అదే స్థితిని అనుభవిస్తున్నారు. యావత్తు పొలం చుట్టూ తాను ఇన్నాళ్లు కష్టపడి నిర్మించుకున్న కలలధామం అనుభూతులను వెంట వచ్చిన మీడియా ప్రతినిధులకు చెప్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. విపరీతమైన చలి ప్రదేశాల్లో ఉంటూ ఆరోగ్యం గురించి బెంగపడకుండా ఏదైనా సాధించగలమని నిరూపించి చూపించారు కేసీఆర్. mattiపొలానికి సంజీవిని ‘నెటాజెట్ ’ మొత్తం క్షేత్రానికి నీళ్లు అందించే సంజీవిని నెటాజెట్. దాదాపు రూ.15 లక్షల విలువ కలిగిన ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నెటాజెట్ ద్వారానే పంటలకు నీళ్లు అందుతాయి. బావిలోకి వచ్చిన నీళ్లు వర్షాధారం కనుక అందులోని కొన్ని లవణాలు ఉండవు. అందుకని క్షేత్రం మధ్యలో ఒక ట్యాంక్‌ను నిర్మించారు. బావిలోని నీరు ఇందులోకి వచ్చాక క్షేత్రంలోని నాలుగు బోర్లలోని నీటిని ఇందులోకి తీసుకొస్తారు. దీంతో లవణాల సమానంగా కలుస్తాయి. ఇక్కడి నుంచి నీరు నెటాజెట్ మిషన్ వద్దకు వెళ్తుంది. ఈ మిషన్ మొక్క ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఎంత నీరు ఇవ్వాలనేది నిర్ధారించి.. అంతేస్థాయిలో నీరు ఇస్తుంది. మొక్క పెరిగినా కొద్ది నీరు శాతాన్ని పెంచుతారు. దాని ఆధారంగానే నీరు వెళ్తుంది. నీటిలోనే ఎరువులను మిక్స్ చేస్తారు కనుక ప్రత్యేకంగా మొక్కలకు ఎరువులు వేయాల్సిన అవసరం ఉండదు. ఆకుపచ్చ అందం: ఒకవైపు గ్రీన్‌హౌస్, మరోవైపు ఆలూ. మరోవైపు చల్లని వేపచెట్ల మధ్య దాదాపు 950 కొబ్బరిచెట్లు కూడా ఉన్నాయి. అగ్రికల్చర్ అంటే.. ఒక కల్చర్ -చిన్నప్పటినుంచి వ్యవసాయమంటే ఆసక్తి -తెలంగాణలో గ్రీన్‌హౌస్ పైలెట్ ప్రాజెక్టు -ప్రతి ఎకరాకు భూసార పరీక్షలు -దాని ఆధారంగానే జిల్లాల వారీ పంటల ప్రణాళిక -ఫాంహౌస్‌లో విలేకరులతో కేసీఆర్ హైదరాబాద్, జనవరి 2 (టీ మీడియా): తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి పైలెట్ ప్రాజెక్టుగా ప్రతి జిల్లాల్లోని 20 గ్రామాల్లో గ్రీన్‌హౌస్‌లను ఏర్పాటు చేయిస్తామని, ఇవి సక్సెస్ అయిన తరువాత ప్రభుత్వమే భారీగా సబ్సిడీలు ఇచ్చి గ్రీన్‌హౌస్‌లను ఏర్పాటు చేయించేందుకు ప్రయత్నిస్తుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి దళితుడికీ మూడు ఎకరాల భూమితోపాటు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవకాశాలు అందిస్తామని తెలిపారు. దేశం ఆహార స్వావలంబన సాధించాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆహారం విషయంలో తెలంగాణ స్వావలంబన సాధిస్తే దేశానికి మార్గదర్శకం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాలు కూడా ఆహార స్వావలంబన సాధించాలనుకుంటాయని, దిగుమతి చేసుకోవాలనుకోవని పేర్కొన్నారు. తన తండ్రికి వ్యవసాయం అంటే చాలా ఇష్టమని ఆయన ఆరోజుల్లోనే ఆదర్శ రైతుగా ఉన్నారని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తన దృష్టిలో అగ్రికల్చర్ అంటే వ్యవసాయం కాదని, అదొక కల్చర్ (సంప్రదాయం) అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం తనకు చిన్ననాటి నుంచే ఆసక్తి ఉండేదని, ఆరోజుల్లోనే అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ అధికారులు ఉండేవారని తెలిపారు. వారిప్పుడు ఎక్కడా కనిపించడం లేదన్నారు. తెలంగాణలో ఉన్న అగ్రికల్చరల్ యూనివర్సిటీల్లో రీసెర్చ్‌కు ఎక్కవ అవకాశం కల్పిస్తామని వివరించారు. గురువారం మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి హైదరాబాద్‌లోని జర్నలిస్టులను కేసీఆర్ ఆహ్వానించారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పంటలు, వినియోగిస్తున్న పద్ధతులను ఆయన స్వయంగా వివరించారు. బీహార్‌లో ఒక రైతు ఎకరంలో 44.4 టన్నుల ఆలుగడ్డను పండించినట్లుగా ఇంటర్నెట్్లో చూశానని, పంటలు పండించేటప్పుడు నీటి నిర్వహణ, పంట నిర్వహణ చాలా అవసరమని తెలిపారు. పంటలను డ్రిప్ ద్వారా పండిస్తే అధిక మోతాదులో దిగుబడి వస్తుందని తెలిపారు. ప్రస్తుత వ్యవసాయ క్షేత్రంలో తనకు 30 ఎకరాలకు, తన కొడుక్కి 30 ఎకరాలు మొత్తం 60 ఎకరాలు ఉన్నాయని, ఇందులో రోడ్లు, భవనాలు, క్వార్టర్స్ పోను 55 ఎకరాల్లో సాగు అవుతోందని అన్నారు. ప్రస్తుతం 45 ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతోందని తెలిపారు. గ్రీన్‌హౌస్ ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ. 2.7కోట్లు రుణం తెచ్చానని తెలిపారు. ఇజ్రాయెల్ నుండి నెటాజెట్ అనే సాంకేతిక పరికరంతో డ్రిప్ ద్వారా నీళ్లు, ఎరువు ఇస్తున్నామని, గ్రీన్‌హౌస్‌ను పరిశీలించేందుకు అగ్రోనామిస్ట్ ఉన్నారని తెలిపారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు రూ. 90 లక్షల సబ్సిడీ ఇస్తోందని, ఇంకా రాలేదని అన్నారు. కలర్ క్యాప్సికమ్ 10 ఎకరాల్లో సాగులో ఉందని, కిలో రూ.75-350 వరకు ఉంటుందని, మొత్తం 10 ఎకరాల్లో రూ 8-10 కోట్లు వచ్చే అవకాశముందని అన్నారు. ఆలుగడ్డ కిలో రూ.20కి అమ్మితే ఎకరాకు నాలుగు లక్షల ఆదాయం వస్తుందని, 45 ఎకరాల్లో ఆలు పంట పండుతోందని తెలిపారు. తెలంగాణలో సమశీతోష్ణస్థితి వాతావరణం ఉంటుందని, తెలంగాణలోని నాలుగు రకాల నేలల గ్రీన్‌హౌస్‌కు ఉపయోగమని చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న 60 మంది కార్మికులకు క్వార్టర్స్, గ్యాస్ కనెక్షన్ ఇచ్చామని అన్నారు. కాకరకాయ, అనిగపుకాయ లాభాలు అందించిందని, క్యాప్సికమ్ లాభాలు ఇస్తే బ్యాంక్ రుణాలన్నింటినీ ఒకేసారి తీరస్తానని అన్నారు. గ్రీన్‌హౌస్‌కు రాష్ట్రంలో సబ్సిడీలు అర ఎకరాకే ఇస్తున్నారని అన్నారు. బీహార్, హర్యానా 75శాతం, మహారాష్ట్రలో 60శాతం సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిన తరువాత ఈ విషయమై తన వద్ద ప్రణాళిక పత్రం (బ్లూవూపింట్) ఉందని, ఎలా పంటలు పండించాలో ప్రజలకు చెప్తామని, ప్రతి రెండు జిల్లాలకు ఒకపంటను పండించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణలోని ప్రతి ఎకరంపై భూసార పరీక్షలు చేసి దాని ఆధారంగా పంటలు వేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన వ్యవసాయాన్ని చూసిన పక్క రైతులు కూడా ప్రభావితం అవుతున్నారని, వాణిజ్య పంటలు పండించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ విలేకరుల కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు జగదీష్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ కార్యాలయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.