వైషమ్యాలు పెంచుతున్నది పాలకులే

సీమాంధ్ర పాలకులు, పోలీస్ అధికారులు వివక్షతను ప్రదర్శిస్తూ, ఇరుప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలను మరింతగా పెంచుతున్నారే తప్ప, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించకపోవడం దారుణమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జేఏసీ కార్యాలయంలో జేఏసీ ప్రతినిధులు మీడియా సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చించేందుకు ఇచ్చిన 42 రోజుల గడువును వృథా చేసి, ఇప్పుడు అదనపు సమయం కావాలంటూ తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రపతి అదనపు సమయానికి అనుమతి ఇవ్వకూడదని అన్నారు. అసెంబ్లీలో అసలు విషయం చర్చించకుండా ఇంతకాలం తెలంగాణ ప్రజలను మోసం చేసిన సీమాంధ్ర పాలకులు ప్రస్తుతం సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

kodarammతెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ప్రజలు సమావేశం నిర్వహించుకోవడానికి అనుమతివ్వని పోలీస్ అధికారులు ఏపీఏన్జీవోల సంఘం నిర్వహించనున్న సభకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ఇది సీమాంధ్ర అధికారుల వివక్షతకు నిదర్శనమన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న ఏపీఏన్జీవోల సంఘం నిర్వహించే సభకు ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికే అదనపు సమయం పేరుతో కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉన్న సమయాన్ని వృథా చేస్తున్నారని, మంగళవారం సభలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి సాయంత్రం మూడుగంటలకే ఉదయం నుంచి సభలో ఉన్నాం, రేపటికి వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరడమే నిదర్శనమన్నారు. సభలో ఉదయం వైఎస్సార్సీపీ సభా సమయాన్ని వథా చేస్తోందని, ఆ తర్వాత శైలజానాథ్, టీడీపీ నాయకులు కాలయాపన చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు.

ఆంధ్రా ప్రజలకు కావలసిందేమిటో చర్చించకుండా వారికి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఏపీఏన్జీవోల సభకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలా అనుమతి నిస్తారని ప్రశ్నించారు. సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు గోవర్ధన్ మాట్లాడుతూ ఏపీఏన్జీవోల సభకు వస్తున్నవారిని పోలీసులే అతిథి మర్యాదలతో తీసుకువస్తున్నారంటే, వారి వివక్షతకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలన్నారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.