వెనిజులా అధ్యక్షుడిగా మదురో ఎన్నిక

 

Maduro-అతిస్వల్ప మెజారిటీతో విజయం
-ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి
-రీకౌంటింగ్ జరపాలి: ప్రత్యర్థి క్యాప్రిల్ డిమాండ్

వెనిజులా ప్రజానేత, లాటిన్ అమెరికా వేగుచుక్క హ్యుగో చావెజ్ రాజకీయ వారసుడికే ఆ దేశ ప్రజలు పట్టం కట్టారు. నికోలస్ మదురోను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఊహించనివిధంగా అత్యంత హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో మదురో స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. వెనిజులా అధ్యక్షుడు చావెజ్ క్యాన్సర్‌తో మృతిచెందిన నేపథ్యంలో గత నెలలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సోషలిస్టు పార్టీ ఆఫ్ వెనిజులా నేత మదురో.. ప్రతిపక్ష పార్టీల సంయుక్త అభ్యర్థి హెన్‌రిక్యు క్యాప్రిల్ ర్యాండోస్కిని దాదాపు 3 లక్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. మదురోకు 50.66శాతం ఓట్లు రాగా, క్యాప్రిల్ 49.07 శాతం ఓట్లు సాధించారు. ఈ గెలుపుతో ఆరేళ్లు మదురో వెనిజులా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.

మదురో మెజార్టీ రెండుశాతం కన్నా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను తాను అంగీకరించడంలేదని ప్రతిపక్ష అభ్యర్థి క్యాప్రిల్ పేర్కొన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని, రీకౌంటింగ్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఏమాత్రం మారబోవని జాతీయ ఎన్నికల సంఘం అధ్యక్షుడు టిబిసే లుసెనా స్పష్టంచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయం సాధించినట్టు తెలియగానే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. వెనిజులా రాజధాని కారకస్‌లో గుమిగూడిన లక్షలాదిమంది మద్దతుదారులను ఉద్దేశించి మదురో మాట్లాడుతూ.. చావెజ్ అనుసరించిన ప్రజానుకూల విధానాలు కొనసాగిస్తానని ప్రకటించారు. ప్రతిపక్ష అభ్యర్థి క్యాప్రిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడం ఏడాదికాలంలో ఇది రెండోసారి. 2012 అక్టోబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చావెజ్ చేతిలో ఆయన దారుణ పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో పదిశాతం ఓట్ల తేడాతో చావెజ్ విజయం సాధించారు.

అమెరికా మద్దతుదారుడిగా బరిలోకి దిగిన క్యాప్రిల్‌ను కార్మిక, పేద వర్గాలు అత్యధికంగా ఉన్న వెనిజులా ప్రజలు మరోసారి ఓడించారు. చమురు సంపన్న దేశమైన వెనిజులా చావెజ్ పాలనకు ముందు అమెరికా ఆధిపత్యంలో నలిగిపోయింది. మరోసారి అమెరికా ఆధిపత్యాన్ని వెనిజూలా ప్రజలు కోరుకోవడం లేదని తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టమయిందని పరిశీలకులు అభివూపాయపడుతున్నారు. మదురో కూడా అమెరికా వ్యతిరేక వైఖరిని కొనసాగించనున్నట్టు గట్టి సంకేతాలే ఇచ్చారు. అగ్రరాజ్యం తరచూ తమ దేశంలో జోక్యం చేసుకుంటుందన్న విషయంలో మరిన్ని ప్రత్యక్ష ఆధారాలు ప్రపంచం ముందు పెడతానని, అమెరికా ఎప్పుడూ వెనిజులాకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. వెనిజులా అధ్యక్షుడిగా ఎన్నికైన మదురోకు క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అభినందనలు తెలిపారు. చావెజ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ వెనిజులాను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకు సూచించారు.

బస్సు డ్రైవర్ నుంచి అధ్యక్షుడి వరకు!
నికోలస్ మదురో.. బస్సు డ్రైవర్ నుంచి వెనిజులా అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ప్రజానేత హ్యుగో చావెజ్ కుడిభుజంగా ఆయన వెన్నంటి రెండు దశాబ్దాలపాటు సాగారు. 1988లో తొలిసారి ఎన్నికల్లో గెలిచిన మదురో తర్వాత చావెజ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. మదురోను చావెజ్ తన కొడుకుగా, శిష్యుడిగా అభివర్ణించేవారు. తన మరణానికి ముందు తన రాజకీయ వారసుడిగా ఆయనను ప్రకటించారు. చావెజ్ ఆశయాలను కొనసాగిస్తానంటూ మదురో వెనిజూలా పగ్గాలను చేపట్టారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.