వెంకయ్య వ్యాఖ్యలపై బీజేపీలో అసంతృప్తి

తెలంగాణ అంశంపై బీజేపీ సీనియర్ నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వైఖరి కారణంగా తెలంగాణలో పార్టీకి నష్టం జరుగుతుందని భయపడుతున్నారు. ‘సీమాంధ్ర సమస్యలు పరిష్కరించిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలి.’

అంటూ ఆయన బుధవారం ఢిల్లీలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పత్రికల పతాక శీర్షికలో వచ్చిన ఈ వార్తతో బీజేపీ రాష్ట్ర శాఖలో కలకలం సృష్టించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభలో సమైక్యాంవూధపై మాట్లాడిన తెలుగుదేశం సభ్యుడు హరికృష్ణను వెనుకేసుకరావడంతో, దానిని ఎలా సమర్థించుకోవాలో అర్థంకాక పారీ ్ట నేతలు నానా ఇబ్బందులు పడ్డారు.

ఇప్పటివరకూ పార్టీ వైఖరిపై విభేదించని సీమాంధ్ర నేతలు, వెంకయ్య అండతోనే ఢిల్లీకి వెళ్లి అగ్రనాయకులను కలిసినట్లు తెలంగాణ నేతలు భావిస్తున్నారు. అగ్రనేతలతో సీమాంధ్ర సమస్యలను పరిష్కరిస్తేనే మద్దతు ఇవ్వాలని కోరడంతో తెలంగాణ నేతలు ఖంగుతిన్నారు. ఇప్పుడు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో మళ్లీ తలనొప్పి మొదలైంది. వ్యాఖ్యల విషయంలో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఫోన్లకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ పార్టీ ముఖ్యనేతలు తలలు పట్టుకున్నారు. ఇప్పటికే టీడీపీతో బీజేపీ పొత్తు పై వస్తున్న కథనాలతో పార్టీ కింది క్యాడర్ వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న నేత లు, వెంకయ్య చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళంలో పడ్డారు. వెంకయ్య వాఖ్యలపై ఒక బీజేపీ నేత మాట్లాడుతూ.. ‘ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలిగే అవకాశాలు కొట్టివేయలేం. తెలంగాణలో నిర్వహించిన సభల్లో పార్లమెంట్‌లో వెంటనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేసిన వెంకయ్య, నేడు సమస్యలు పరిష్కరించిన తరువాతే రాష్ట్రాన్ని విభజించాలనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.’అని అన్నారు.

ఈ నెల 16న పార్టీ తెలంగాణ పదాధికారుల సమావేశంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తామని సదరు నేత తెలిపారు. మరోనేత మాట్లాడుతూ టీడీపీతో పొత్తు కుదిరేలా వెంకయ్య ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇందుకు నిదర్శనం కర్ణాటకలో ఇటీవల కేజీపీ(యడ్యూరప్ప పార్టీ), ఆంధ్రవూపదేశ్‌లో టీడీపీతో చర్చలు సాగుతున్నాయి.’ అంటూ వ్యాఖ్యలు చేశారని, ఆ తరువాత ఖండించారని చెప్పారు. పొత్తు అంశంలో జాతీయ నేతలు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రాష్ట్ర శాఖ ఇష్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తున్న సమయంలోనే వెంకయ్య వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఈ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ప్రమేయం ఉండవచ్చని సదరు నేత అనుమానం వ్యక్తం చేశారు. ఎన్డీఏ హయాంలో తెలంగాణ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికే ఈ ప్రాంతంలో బీజేపీపై ఇంకా అనుమానపడుతున్నారని, ఇలాంటి సమయంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని చెప్పారు. వెంకయ్య వైఖరి తెలంగాణకు వ్యతిరేకంగానే కన్పిస్తోందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.