వీరుడి మరణం

తెలంగాణ కోసం అహరహం తపించి, పోరాడిన రాజిడ్డి ఆంధ్ర సర్కారు బాష్పవాయు ప్రయోగానికి బలయిపోవడం తెలంగాణ ప్రజలను బాధలో ముంచెత్తుతున్నది. ఇప్పటి వరకు వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలకు పరోక్షంగా కారణమైన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా దాడి చేసి ఒక ఉద్యమ వీరుడి ప్రాణాలను మింగింది. కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలోని పెద్దంపేటలో జన్మించిన రాజిడ్డి పొట్ట చేత పట్టుకుని పట్నం చేరి నిలదొక్కుకునే క్రమంలో అనేక అనుభవాలతో తెలంగాణవాదిగా రాటుతేలాడు. రాజిడ్డి ఉపాధికి లోటులేదు. భార్యా పిల్లలున్నారు. అయినా తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఉద్యమంతో మమేకమై పోరాడాడు. ఆ పోరాటంలోనే ఆంధ్ర సర్కారు కురిపించిన ‘విష వాయువు’కు బలయ్యాడు.
బాష్పవాయువు ప్రయోగం వల్ల వ్యక్తి మరణించడం అనేది ఉండదు, ఉండకూడదు. బాష్పవాయువు ప్రయోగం ఉద్దేశమే ఆందోళనకారులకు హాని జరగకుండా గుంపులను చెదరగొట్టడం. కానీ అది ప్రాణాలను హరించడం అనుమానాలకు తావిస్తున్నది.

బాష్పవాయువు పీల్చుకున్న రాజిడ్డి రక్తం కక్కుకున్నాడు. అతడి ఊపిరి తిత్తులు దెబ్బతిన్నా యి. ఆ తరువాత ఒక్కో అవయవం దెబ్బతిన్నది. సాధారణ బాష్పవాయువే అయితే రాజిడ్డి ప్రాణాలు ఎందుకు పోయినట్టు? ఇది తెలంగాణవాదులే కాదు, ప్రభుత్వం కూడా ఆందోళన చెందవలసిన విషయం కాదా? తెలంగాణ మార్చ్‌లో గాయపడిన తరువాత రాజిడ్డిని బంధువులు ఆస్పవూతికి తరలించారు. అక్కడ పదిహేడవ తేదీ వరకు ఉన్నాడు. ఆ తరువాత పరిస్థితి విషమించి మరో పెద్ద ఆస్పవూతికి తరలించారు. అక్కడ 25వ తేదీ వరకు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు.

ఆయన బాగోగులను బంధువులు, తెలంగాణ వాదులు పట్టించుకున్నారే తప్ప ప్రభుత్వం ఆసక్తి చూపక పోవడం ఆశ్చర్యకరం. బాష్పవాయువు ప్రయోగంవల్ల ఉత్పన్నమైన సమస్య కనుక చికిత్స చేయించడం ప్రభుత్వ బాధ్యత. పైగా బాష్పవాయువు వికటించడానికి కారణం ఏమిటో తెలుసుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. తెలంగాణమార్చ్ రోజు ప్రయోగించింది మామూలు బాష్పవాయువు కాదని, కాలం చెల్లిన బాష్పవాయువు వల్ల రాజిడ్డి మరణించాడని డాక్టర్ గోపాల కృష్ణ ప్రకటించడం గమనార్హం.

ఉస్మానియా క్యాంపస్‌లో విద్యార్థులను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించినప్పుడు-విద్యార్థులు ఆ దాడిని విఫలం చేయడం పోలీసు వర్గాలను ఆశ్చర్యపరిచింది. గుంపు పరిమాణాన్ని బట్టి ఎన్ని బాష్పవాయు గొట్టాలు అవసరమవుతాయనేది అంచనా ఉంటుంది. అయితే ఎన్ని గొట్టాలు ప్రయోగించినా గుంపు చెదరక పోవడం ఉద్యమకారుల ఎత్తుగడలను సూచిస్తున్నది. బాష్పవాయువు గొట్టం తమను సమీపించిన వెంటనే విద్యార్థులు దానిని అందుకొని దూరంగా విసిరివేయడం, లేదా కింద పడిన వెంటనే మట్టితో కప్పడం వేగంగా సాగేది. ముఖాలకు దస్తీలు కట్టుకున్న విద్యార్థులు ముందుకురికి ఆ గొట్టాలను నిర్వీర్యం చేయడం ద్వారా మిగతా విద్యార్థులకు హాని జరగకుండా చూసుకున్నారు.

ఆ తరువాత పోలీసులు ప్రయోగించిన ఒక ‘గొట్టం’ పేలి ఒక ముక్క ఒక వ్యక్తి కడుపులోకి దూసుకుపోయిన ఉదంతం ఆందోళన కలిగించింది. అది లోహపు ముక్క అని వైద్యులు నిర్ధారించారనే వార్తలు వ్యాపించాయి. పోలీసులు పెల్లెట్లు ప్రయోగిస్తున్నారనే ఆందోళన వ్యక్తమైంది. ఈ మొత్తం సంఘటనల నేపథ్యంలో తెలంగాణ మార్చ్ సందర్భంగా ప్రయోగించింది సాధారణ బాష్పవాయువేనా, ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రయోగం చేసిందా అనే అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. తెలంగాణ ఉద్య మం పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రత్యేకించి బాష్పవాయువు ఒకరి ఉసురు తీయడం మానవ హక్కుల ఉల్లంఘనే. దీనిపై దర్యాప్తు జరపడం అవసరం.

ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలు తమ ఆకాంక్షలు తీర్చుకోవడానికి ఉద్యమించడం సాధారణం. ప్రభుత్వం ప్రజల మనోభావాలు గ్రహించి పరిష్కారాలు అన్వేషించాలె. శాంతియుతంగా చర్చల ద్వారా రాజకీయ పరిష్కారం సాధించాలె. అంతే తప్ప దమననీతిని ప్రదర్శించకూడదు. తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైనది. 1969లో ఇదే విధంగా బుల్లెట్లు ప్రయోగించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజ లు శాంతియుతంగా ఉద్యమిస్తున్నారు. కానీ ప్రభుత్వమే ఉద్యమకారులను రెచ్చగొట్టి హింసాయుత వాతావరణం సృష్టించాలని చూస్తున్నది. ఉస్మానియా క్యాంపస్‌లో పోలీసులు అప్రజాస్వామికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన తీరు, మిలియన్ మార్చ్, తెలంగాణ మార్చ్ సందర్భంగా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ ఉద్యమకారులను రెచ్చగొట్టడం గమనిస్తే ప్రభుత్వ కసితో వ్యవహరిస్తున్నదనీ, పథకం ప్రకారం ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చడానికి కుట్ర పన్నుతున్నదని తెలుస్తుంది.

ఉద్యమం హింసాయుతంగా మారితే మరిన్ని బలగాలను మోహరించి క్రూరంగా అణచివేయవచ్చుననేది ఆంధ్ర పెట్టుబడిదారుల కుట్ర. నిష్పక్షపాతంగా ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ కుట్రలకు ఆచరణ రూపం ఇవ్వడం దిగజారుడు తనమే. తెలంగాణను పాలించే నైతిక అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని దీని వల్ల స్పష్టమవుతున్నది.

కేంద్రం నిర్ణయరాహిత్యం, తాత్సారం వల్ల తెలంగాణ ఉద్యమ స్వరూప స్వభావాలు క్రమంగా మారుతున్నవన్నది వాస్తవం. అయితే ఈ పరిణామం తమకు అనుకూలంగా మారుతుందని ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం అనుకుంటే అది వారి అజ్ఞానమే. తెలంగాణ ప్రజల ఆకాంక్ష బలమైంది. దీనికి తోడు ఆంధ్ర పెట్టుబడిదారుల తెలివి లేని, పనికిరాని ఎత్తుగడలు ఎట్లా ఉంటాయో తెలంగాణవాదులకు తెలుసు. అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. ఉద్యమం ఏ రూపం తీసుకున్నా, అది అంతిమంగా ఆంధ్ర పెట్టుబడిదారులకే నష్టదాయకం అవుతుందే తప్ప తెలంగాణ సమాజానికి కాదు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడం ఆంధ్ర పాలకవర్గానికి అసాధ్యం. శ్రీకృష్ణ కమిటీ కుట్రలను పక్కన పెట్టి సామరస్యంగా తెలంగాణ రాష్ట్రానికి అంగీకరించడమే ఆంధ్ర పెట్టుబడిదారీవర్గానికి ఏకైక మార్గం. ఈ సత్యాన్ని ఎంత తొందరగా గ్రహిస్తే వారికి అంత మంచిది.

-నమస్తే తెలంగాణ ఎడిటోరియల్

This entry was posted in ARTICLES.

Comments are closed.