విషపురిత హస్తమది!

నవంబర్ 24: కాంగ్రెస్ కన్నా విషపూరితమైన పార్టీ దేశంలో మరొకటి లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారంనాడు రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన బాన్స్‌వారాలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ వారు విషతుల్యులంటూ సోనియాగాంధీ చేసిన విమర్శలపై ఆయన విరుచుకుపడ్డారు. తన తల్లి అధికారాన్ని విషంగా భావిస్తారని రాహుల్‌గాంధీ ఇదే జైపూర్ సభలో గతంలో చెప్పాడని గుర్తు చేశారు. ఆ కుటుంబం 50 ఏళ్లుగా అదే విషం రుచిమరిగి అధికారంలో ఉంటున్నందున వారికన్నా విషతుల్యులు మరొకరు ఎవరుంటారని ప్రశ్నించారు. ఏడాదికి నాలుగుసార్లు పేదరికం గురించి మీడియా ముందు పెద్దపెద్ద మాటలు మాట్లాడే రాహుల్ ఢిల్లీలో ఆయన ఇంటికి సమీపంలోనే ఉండే పేదలకు కూడా చేసిందేమీ లేదన్నారు.

ఆయన బంగ్లాకు సమీపంలోనే 800 మంది నివసించే పేదల బస్తీ ఉందని, అందులో అందరికీ కలిపి రెండే టాయిపూట్లు ఉన్నాయని చెప్పారు. అయితే ఇవేవీ కాంగ్రెస్ పార్టీకి కనిపించవన్నారు. 2009 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ వాగ్దానం నిలబెట్టుకోలేక పోయిందన్నారు. ధరలు ఆకాశాన్నంటుతుంటే ఆ పార్టీ సీనియర్ నేత కేంద్రమంత్రి కపిల్‌సిబల్ మాత్రం పేదలు రెండేసి కూరలు కొనుగోలు చేసే స్థితికి ఎదగడం వల్లనే ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనులు అనేక త్యాగాలు చేసినా కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదన్నారు. పైగా ఒక కుటుంబం వారే జైళ్లకు వెళ్లారని, త్యాగాలు చేశారని ప్రచారం చేస్తున్నారన్నారు. వాస్తవానికి వారు జైళ్లకన్నా రాజభవనాల్లోనే ఎక్కువకాలం గడిపారన్నారు. గిరిజనులను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆయన దుయ్యబట్టారు.

అంతా కాంగ్రెస్ డ్రామా: జైట్లీ
మహిళపై అక్రమ నిఘా వివాదానికి సంబంధించి మోడీపై గుజరాత్ ఐపీఎస్ అధికారి ప్రదీప్‌శర్మ చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. అసంతృప్త అధికారులను ముందు పెట్టి నీచఆరోపణలు చేయించే పాత క్రీడను కాంగ్రెస్ మరోసారి ముందుకు తెచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఢిల్లీలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ మిత్రపక్షాల్లో పలువురు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ చెప్పారు. ఢిల్లీలో పీటీఐ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మాజిక్ ఫిగర్ 175 దాటితే దూరమైన ఎన్డీఏ పక్షాలతో పాటు కొందరు కాంగ్రెస్ మిత్రులు కూడా తమ కూటమిలోకి తిరిగి వస్తారన్నారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.