విషం చిమ్మిన సీమాంధ్ర పాత్రికేయం..

సీమాంధ్ర మీడియా తెలంగాణ వ్యతిరేకత విశ్వరూప ప్రదర్శన కొనసాగుతున్నది. ప్రింట్ మీడియా కనీస నీతినియమాలకు కూడా నీళ్లు వదిలి తెలంగాణ మీద కసిని కక్షను రంగురంగుల్లో వెళ్లగక్కుతున్నది. ఇక ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్లు యాంకరమ్మల ఆంగికాలు.. హావభావాలు.. వాచాలతలు చూస్తే..
వార్తలు చదువుతున్నారో.. దుర్భాషలాడుతున్నారో…శోకాలే పెడుతున్నారో తెలియని స్థితి ఏర్పడింది. తెలంగాణను అడ్డుకుంటున్నది సీమాంధ్ర నేతలా? మీడియానా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇవాళ్టికివాళ శాసనసభలో తెలంగాణ బిల్లు ప్రక్రియ పూర్తయి సాఫీగా కేంద్రానికి వెళుతున్న తరుణంలో తెలంగాణ బిల్లు ఓడిపోయిందని ప్రచారాలు చేస్తున్నతీరు శాసనసభ కార్యకలాపాల మీద వీరికి ఉన్న అవగాహనకు అద్దం పడుతున్నది. తెలంగాణ బిల్లుకు, సీఎం తీర్మానానికి తేడా తెలియని అజ్ఞాన మహాప్రదర్శన విస్మయానికి గురి చేస్తున్నది. తెలంగాణ బిల్లు కేంద్రానికి వెళ్లిపోయిందని,
సీఎం తీర్మానం కాపీ ఇంకా రాష్ట్రప్రభుత్వం దగ్గరికి చేరి కేబినెట్ ముందుకు రావాల్సిన
స్థాయిలోనే ఆగిందని ఈ మహామేధావులకు ఎవరు చెప్పాలి?

జనవరి 30 : తెలంగాణ మీద సీమాంధ్ర మీడియా పగబట్టిందా? ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ మాత్రం మినహాయింపు లేకుండా వేస్తున్న ప్రశ్న ఇది. తెలంగాణ అంశంలో గత అనేక ఏళ్లుగా మరీ ముఖ్యంగా గత జూలైలో సీడబ్ల్యూసీ తెలంగాణ అనుకూల తీర్మానం చేసిన తర్వాత మీడియా పాటించిన విధానం, చూపిన వైఖరి చేసిన ప్రచారాలు, చూసిన ఎవరైనా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తారు. మోకాలుకు బోడిగుండుకు ముడిపట్టే ప్రచారాలు..నెత్తి మీద రూపాయి పెడితే పావలా చేయని వాళ్లను పిలిచి చర్చలు.. సంపాదకీయాలు..విశ్లేషణలు. ఏ ఒక్క ఊహాగానం వాస్తవరూపం దాల్చకపోయినా అదే అదే దుష్ప్రచారాలు. ఒక విలువ లేదు. నైతికత లేదు. పరిజ్ఞానం అనేదే లేదు. తెలంగాణను దెబ్బ తీయడం ఏకైక లక్ష్యం. పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా ఇరుప్రాంతాల మధ్య గొంతులు కోసుకునే శత్రుత్వం రగులుతున్నా పట్టనితనం.

నిజానికి తెలంగాణను అడ్డుకునేందుకు ఆ ప్రాంత నేతలు చేసిన దానికన్నా మీడియా చేసిందే ఎక్కువ. సీమాంధ్ర నాయకుల కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తుల్లో మీడియా మనస్ఫూర్థిగా భాగస్వామి అయ్యింది. ఓ ఆంధ్ర నాయకుడు కోట్లు విరజిమ్మి తెలంగాణ ఎమ్మెల్యేలను తనవేపు తిప్పుకుంటే ఆ నాయకుడు తెలంగాణవాదాన్ని నిలువరించిన గొప్పనేత . రాత్రికి రాత్రి మాట మార్చిన నాయకులను కనీసం నిలదీయలేని పక్షపాతం. నిన్న ఎన్నికల్లో డిపాజిట్లు పోయిన పార్టీ ఇవాళ ఏదో ప్రకటన చేయగానే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషించే నేలబారుతనం. వీరి వ్యవహారం కారణంగా కొన్ని చానెళ్లను బహిష్కరించాలని తెలంగాణ వాదులు పిలుపే ఇచ్చారన్న మాట చాలు వీరి వ్యవహారతీరు వివరించడానికి.

వ్యతిరేకులకే అంకితమైన గొట్టాలు..
2004 సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకుని ఎలక్షన్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత కాంగ్రెస్ మాట మార్చగా దానినే సీమాంధ్ర మీడియా కూడా అందిపుచ్చుకుంది. ఈ ఒప్పందం రెండో ఎస్సార్సీ కోసం మాత్రమేనని, రాష్ట్ర విభజన కోసం కాదని కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు చేసిన ప్రకటనలను తన గొంతుతో సీమాంధ్ర మీడియా ప్రచారాన్ని కొనసాగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ ముఖర్జీ నేతత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తే వాదనలు వినిపించిన పార్టీల్లో వ్యతిరేకుల అభిప్రాయాలకే పెద్ద పీట వేసింది. మద్దతు ఇచ్చిన పార్టీల బలాలు పరిశోధించి మరీ లెక్కలు ప్రకటించింది. అధిష్ఠానం ఆదేశం మేరకు అసెంబ్లీలో తెలంగాణ అనుకూల తీర్మానాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపాదించి సమస్యల పరిశీలనకు రోశయ్య కమిటీని నియమించినా తెలంగాణ సాధనలో అది మైలురాయిగా మీడియాకు కనిపించలేదు.

వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు..
వైఎస్ మరణానంతరం ముఖ్యమంత్రిగా రోశయ్య పదవీ బాధ్యతలు చేపట్టాక కొన్ని రోజులకే సుప్రీంకోర్టు తీర్పుతో ఫ్రీ జోన్‌పై తెలంగాణ ఉద్యోగుల ఉద్యమం ఊపందుకుంది. దీంతో సిద్దిపేటలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగ గర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేసినా సీమాంధ్ర మీడియా ఆశించిన ప్రాచూర్యం కల్పించలేదు. పోటీగా విజయవాడ లగడపాటి రాజగోపాల్ చేసిన దీక్షా ప్రహసనానికి విపరీత ప్రచారం కల్పించింది. ఇక కేసీఆర్ దీక్ష ఫ్రీ జోన్ రద్దు కోసమేనని మరో కొత్త వాదన ఎత్తుకుంది. వాస్తవానికి సీమాంధ్ర మీడియా కక్షబట్టి కేసీఆర్ వెంట పడింది. ఆయన ఫాంహౌస్ మీద విపరీత వ్యాఖ్యానాలు. చివరకు ఆయన మూలాల మీద దారినపోయే దానయ్య ఏదో వాగితే అదే మహాభాగ్యమన్నట్టు దుష్ప్రచారాలు.

2009, డిసెంబర్ 9న హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని విస్పష్టంగా చెప్పినా దానిపైనా రంధ్రాన్వేషణ చేసింది. ఆ తరువాత శ్రీకష్ణ కమిటీ..అదో పెద్ద ప్రచారకాండ. ఆయన నివేదిక కేంద్రానికి ఇచ్చాక రోజుకో వార్త.. హైదరాబాద్ కేంద్ర పాలితమని, మణిపూర్ తరహా రాష్ట్రమని, ఢిల్లీ తరహా రాష్ట్రమని, తెలంగాణ సంఘమని, రాజ్యాంగ రక్షణలని ..ఒక రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయంగా ప్రపంచంలో ఎన్ని రకాల వ్యవస్థలున్నాయో అన్నీ రాబోతున్నాయని వచ్చేశాయని నోటికొచ్చినవి రాసేసింది. తరువాత జరిగిన అఖిలపక్ష సమావేశాల సందర్భంగా అదే తీరు. అంతా తలూపినా వ్యతిరేకించనట్టు ప్రచారాలు. ఇక 371డీ.. ఈ దెబ్బతో సీమాంధ్ర మీడియా రాజ్యాంగ నిష్ణాతుల అవతారమెత్తేసింది. ఆర్టికల్ అనే పదానికి కనీసార్థం కూడా తెలియని విజ్ఞాన విశేషాలన్నీ ప్రదర్శించింది. దాన్ని సవరించకుండా తెలంగాణ ఇవ్వటం సాధ్యం కాదని, సవరించాలంటే లోక్‌సభ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని రాజ్యాంగనిపుణులే మూర్ఛపోయే విశ్లేషణలు చేసింది.

ఇక, కేంద్రంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు అంగీకరించి ఆ తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక మీడియా దాదాపు యుద్ధమే ప్రకటించింది. కేంద్రమంత్రుల మీదికి ప్రజలను రెచ్చగొట్టింది. నిందలు వేసింది. టీవీల ముందు సమైక్యాంధ్ర అనే క్యాట్‌వాక్ ఉద్యమాన్ని సంపూర్ణంగా సమర్పించి దర్శకత్వం వహించి నిర్మించి టీవీలు పత్రికల్లో విడుదల కూడాచేసింది. బిల్లు ఆగినట్టే… అంటూ స్కోలింగ్‌లు రాని రోజు లేదు. పవార్ వ్యతిరేకించాడని ఓ రోజు ఇంకెవడో అడ్డం పడ్డాడని మరోరోజు..రాష్ట్రపతిని సైతం వదలకుండా వివాదాల్లోకి ఈడ్చింది.

రాయల తెలంగాణ నుంచి హైదరాబాద్ లేని తెలంగాణా దాకా కూయని కూత లేదు. రాష్ట్రపతి దగ్గర ఒక్కరోజు ఆగినా చివరికి సీఎస్ దగ్గర గంటపాటు ఆగినా తెలంగాణ ఆగిపోయిదనే కలలు కంది. ఈ బిల్లును రాష్ట్రపతి అసలు పంపించరనే పంపించరని ఆయనకు అనేక అనుమానాలు ఉన్నాయని ప్రచారం చేసింది. బిల్లు ప్రత్యేక విమానంలో పంపడం మీద కూడా విపరీత వ్యాఖ్యానాలు చేసింది. బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరువాత చర్చ జరగకుండా సీమాంధ్ర నేతలు అడ్డుకునేలా సీమాంధ్ర మీడియా ప్రోత్సహించింది. ఆఖరుకు విభజన జరిగితే తెలంగాణకే నష్టమని తెలంగాణ ప్రజలే ఔనా…ఇది నిజమా? అని భ్రాంతిపడే స్థాయిలో జోకులేసింది. బీజేపీ తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వదని చిలక పలుకులు పలికింది.

ఆఖరి వక్రీకరణ..
వీటన్నింటికీ పరాకాష్ట గురువారంనాడు అసెంబ్లీలో జరిగిన కార్యకలాపాల మీద జరిగిన వక్రీకరణ. రాష్ట్రపతి పంపించిన బిల్లుపై చర్చ ముగిసిందని స్పీకర్ చెప్పారు. 86మంది సభ్యులు మాట్లాడారని..9వేలకు పైగా సవరణలు వచ్చాయని కూడా చెప్పారు. దాదాపు సభ్యులంతా తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇచ్చారని స్పీకర్ చెప్పారు., దానిని రాష్ట్రపతికి అసెంబ్లీ అభిప్రాయంతో పంపిస్తున్నామని కూడా ఆయన వివరించారు. ఆ అంశం పూర్తయిన తర్వాత శాసనసభ నియమావళి 77 కింద ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును తీసుకుని మూజువాణి ఓటుతో తీర్మానించినట్టు ప్రకటించారు. విషయం ఇదికాగా తెలంగాణ బిల్లును శాసనసభ తిరస్కరించిందని సీమాంధ్ర మీడియా ప్రచారాలు గుప్పించి గంతులేసింది. ఈ ప్రచార హోరు ఎంతదాకా వెళ్లిందంటే ఈ భ్రమలో పడి జాతీయ మీడియా కూడా తెలంగాణ బిల్లు తిరస్కరణకు గురైందని చెప్పడంతో పాటు యూపీఏ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన స్థితి ఏర్పడిందని ప్రచారం చేసింది.

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.