విలీనం లేదు-కేసీఆర్


kcr01హైదరాబాద్, మార్చి 3 :కాంగ్రెస్‌లో తమ పార్టీ విలీనమయ్యే ప్రసక్తిలేదని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు విస్పష్టంగా ప్రకటించారు. ఈ విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులపైనా ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ, ఎల్‌పీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం సోమవారం తెలంగాణభవన్‌లో ఆరుగంటలపాటు సుదీర్ఘంగా జరిగింది. కాంగ్రెస్‌తో భవిష్యత్ సంబంధాలపై విస్తతంగా చర్చించారు. అనంతరం సీనియర్ నేతలు కేశవరావు, మంద జగన్నాథం, నాయిని నర్సింహారెడ్డి, శ్రావణ్, ఈటెల రాజేందర్, వేణుగోపాలాచారి, మధుసూదనాచారితో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేయవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ప్రకటించారు. ఏ పార్టీ అయినా తమతో పొత్తుల ప్రతిపాదనతో వస్తే.. దానిని పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు నేతత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు.

ఈ కమిటీలో కేకేతోపాటు సీనియర్ నేతలు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, బీ వినోద్, కడియం శ్రీహరి సభ్యులుగా ఉంటారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో తమను ఏ సందర్భంలోనూ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన విమర్శించారు. తాము జీవోఎం ముందు అనేక డిమాండ్లు పెట్టామని, అందులో ఏ ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదని అన్నారు. పైగా బిల్లుపై రాష్ట్రపతి పెట్టిన సంతకం సిరా తడి ఆరకముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ తీసుకువచ్చారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో విలీనం చేసి ప్రజలకు ఏం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ ఇక పక్కా రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఏమన్నారంటే… ఈ రోజు సమావేశంలో 85 మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు.

కొందరు ఉత్తరాల ద్వారా అభిప్రాయాలు చెప్పారు. మరికొందరు సమావేశంలోనే రాతపూర్వకంగా అందజేశారు. అందరి అభిప్రాయం ఒక్కటే. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్ విలీనం కావొద్దనే. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయొద్దని ఏకగీవ్రంగా నిర్ణయించాం. పొత్తులపై పార్టీ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు చైర్మన్‌గా ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, వినోద్ సభ్యులుగా కమిటీ వేశాం. పొత్తులపై ఎవరెవరు ముందుకు వస్తారో చూస్తాం. ఒక్కసారి కోల్పోయిన తెలంగాణ అస్థిత్వం కోసం ఎన్నో బలిదానాలు, ఎన్నో ఏళ్ల పోరాటం జరిగింది. టీఆర్‌ఎస్ తమ గొంతుగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అనేక వినతిపత్రాలు, ఎస్‌ఎంఎస్‌లు, వివిధ మార్గాల ద్వారా ప్రజలంతా విలీనం కావొద్దని కోరారు.

అడ్వకేట్ జేఏసీ నేతలైతే పార్టీ కార్యాలయం ముందు విలీనం కావొద్దని ధర్నా చేశారు. సీడబ్ల్యుసీ తీర్మానం చేసిననాడుగానీ, బిల్లు తయారు చేసిననాడుగానీ టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదు. వారిష్టం వచ్చినట్లు బిల్లు తయారు చేశారు. జీవోఎంకు అనేక అంశాలు చెప్పాం. నివేదిక కూడా ఇచ్చాం. రాష్ట్రపతికి, సోనియాగాంధీ, ప్రధానమంత్రికి కూడా తెలంగాణకు ఏం కావాలో చెప్పాం. ఒక్కటంటే ఒక్కటి కూడా ఆమోదించలేదు. ఇది చాలా బాధాకరం. మేం ఇచ్చిన వాటిలో కొన్ని ధర్మమైనవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి స్పెషల్ కేటగిరీ ఇచ్చారు. తెలంగాణకు కూడా స్పెషల్ కేటగిరీ కావాలి. వాస్తవానికి ప్లానింగ్ కమిషన్ రంగారెడ్డి, హైదరాబాద్ మినహా మిగిలిన 8 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పింది. సీమాంధ్రకు స్పెషల్ కేటగిరీ ఇస్తే అభ్యంతరం లేదు. కానీ మాకు కూడా ఇవ్వాలనే అడుగుతున్నాం. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ తెలంగాణది. దాన్ని కేంద్రం తీసుకుని ఏపీభవన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. దాన్ని తెలంగాణకు ఇవ్వాలంటే పెడచెవిన పెట్టారు. ఎన్‌టీపీసీ నుంచి కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని అడిగితే పట్టించుకోలేదు. చేవెళ్లపాణహితకు జాతీయ హోదా అడిగాం. గవర్నర్‌కు శాంతిభద్రతలు ఇచ్చి రెండో అధికార కేంద్రం పెట్టొద్దని చెప్పాం. కానీ ఏదీ పట్టించుకోలేదు.

కాంగ్రెస్ తీరు బాధపెట్టింది
ఇటీవలికాలంలో కాంగ్రెస్ తీరుతెన్నులు మాకు బాధ కలిగించాయి. అయినా ఓపికపట్టాం. బిల్లును ఆమోదించుకోవాలని చూశాం. ఉద్యోగులు ఆంధ్రవారు అక్కడికే తెలంగాణ వారు ఇక్కడికే అని మేమంటే స్థానిక కాంగ్రెస్ నేతలు నేను తెలంగాణకు అడ్డుపడుతున్నా అని అన్నరు. నేను ఏమన్న అంటే బిల్లుకు ఆటంకం అయితదని ఏమీ అనలేదు. ఓపికతో ఆగినం. విలీనం అడిగేవారు ఎంత సభ్యతతో, మర్యాదగా ఉండాలి? మా ఎమ్మెల్యేలను, మేం సస్పెండ్ చేసిన ఎంపీని కాంగ్రెస్‌లో కలుపుకున్నరు. నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుగా జైరాంరమేశ్ చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయి. టీఆర్‌ఎస్ వస్తే దొరల రాజ్యం వస్తుందని, మరో ఆమ్‌ఆద్మీపార్టీ అవుతుందని, టీజేఏసీ వారిని పిలిచి కాంగెస్‌లోకి రండి.. టికెట్లు ఇస్తాం అని మమ్మల్ని రెచ్చగొట్టారు. నిన్న మరీ అప్రజాస్వామికంగా రాష్ట్రపతి బిల్లుపై పెట్టిన సంతకం సిరా తడి ఆరకముందే ఏడు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ఉదయం గెజిట్ వస్తే సాయంత్రం కేబినెట్‌లో ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలను కలిపారు. ఇలాకలిపే అధికారం కేంద్రానికి లేదు. కేవలం పార్లమెంట్‌కు మాత్రమే ఉంది. దీన్ని తప్పనిసరిగా అడ్డుకుంటాం. సుప్రీం కోర్టుకు వెళ్లి.. ఆర్డినెన్స్ రద్దు చేయిస్తాం. ఇన్ని చూసిన తరువాత మాకు విలీనంపై మరో ఆలోచనే లేదు. ప్రజల కోసం టీఆర్‌ఎస్ ఉంటుంది.

రాబోయే ఎన్నికల్లో పొత్తులపై కమిటీ చూసుకుంటుంది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందినందుకు సోనియాగాంధీకి కతజ్ఞతలు చెప్పినం. కొన్ని వినతులతో ఒక నివేదిక ఇచ్చాం. అయితే ఆమెకు కతజ్ఞతలు చెప్పడానికి చాలా మార్గాలున్నాయి. మేం ఎక్కువ ఎంపీలం గెలుస్తాం. ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి కూడా కతజ్ఞతలు చెబుతాం. అయితే సోనియాగాంధీని కొందరు మిస్‌గైడ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తాం. మా దగ్గరికి ఎవరు వస్తే వారితో పొత్తు పెట్టుకుంటాం. విలీనంపై గతంలో చేసిన వ్యాఖ్యలు అప్పటి పరిస్థితులను బట్టి ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో వాయిలార్ రవి తెలంగాణపై నిర్ణయం తీసుకోబోతున్నాం. మీరు రండి.. కలిసి మాట్లాడుదాం అని అంటే ఢిల్లీకి వెళ్లిన. చర్చల సందర్భంగా ఆంక్షలు లేని తెలంగాణ ఇస్తే విలీనం చేస్తానన్న. అది కూడా సెప్టెంబర్ 30కల్లా నిర్ణయం తీసుకోవాలని అన్నా. వారు నిర్ణయం తీసుకోలేదు. ఆ తరువాత మేం కరీంనగర్‌లో మేధోమథనం సదస్సు పెట్టుకుని 100 ఎమ్మెల్యే 15 ఎంపీ స్థానాలు గెలిస్తే తెలంగాణ దానంతట అదే వస్తుందని అన్నా. అప్పుడు నేను ఢిల్లీ నుండి వచ్చేటప్పుడే రాంరాం చెప్పి వచ్చేసిన. కరీంనగర్ సభలనే మనం ఒంటరిగా పోదాం అని నిర్ణయం తీసుకున్నాం. అయితే 2014 ఎన్నికల తరువాత పొత్తు, మద్దతు అనేది రాముడెవరో… రాకాసేవరో చూద్దాం. టీఆర్‌ఎస్‌ను విలీనం చేయాలని సోనియా నన్ను అడగలేదు. ఇక పొత్తుపై నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను. కేసీఆర్ పదవుల కోసమే విలీనం చేయడంలేదు అని కాంగ్రెస్‌వాళ్లు అంటున్నారు. కానీ నిజమేంటో ప్రజలకు తెలుసు. ఎన్నిసార్లు నేను ఎంపీ రాజీనామా చేయలేదు? కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదా? దళితుడికే సీఎం అన్న విషయంలో ఎన్నికలు పూర్తయిన తరువాత మాట్లాడుతా.

రాబోయే రోజుల్లో తెలంగాణలో నాది ప్రముఖ పాత్రే ఉంటుంది. విలీనంపై నిమిషానికొకటి చెప్పలేం. మేం ఇవాల్టి నుంచి రాజకీయ పార్టీగా మారినం. రాబోయే రోజుల్లో రాజకీయ భాషే వాడుతాం. చంద్రబాబు పక్కరాష్ట్రం మనిషి కనుక మాకు సంబంధం లేదు. ఇప్పటికే అవశేష టీడీపీ నుంచి ఎంతోమంది టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. జిల్లాల్లో అయితే వేల సంఖ్యలో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నరు. చంద్రబాబు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో కూర్చొని చివరి నిమిషం వరకూ తెలంగాణను అడ్డుకున్నారు. బీజేపీకి 30 సీట్లు ఇస్తామని ఆఫర్ కూడా ఇచ్చారు. బీజేపీ తమను ముంచిందని చంద్రబాబే స్వయంగా చెప్పారు. నిన్నటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్నాం. తెలంగాణ సాధించినం. ఇక టీఆర్‌ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. టీఆర్‌ఎస్ ఎక్కువ ఎంపీలు దక్కించుకుంటే తెలంగాణకు కూడా స్పెషల్ కేటగిరీ సాధించుకోవచ్చు. బిల్లు సమయంలో పెద్ద పార్టీల ఆఫీసుల చుట్టు ఎన్నిసార్లు ఎక్కినం! 15 ఎంపీలు గనుక టీఆర్‌ఎస్ గెలిస్తే తెలంగాణకు కేంద్రం నుంచి అన్నీ తెచ్చుకోవచ్చు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు రాజకీయ శక్తిగా మార్చాలి. ఫేస్‌బుక్‌లోని మిత్రులు కూడా టీఆర్‌ఎస్ విలీనం కావొద్దని చెబుతున్నారు. ఆంధ్రలో రెండు ప్రాంతీయ పార్టీలున్నాయి. తెలంగాణలో ఒక్క పార్టీ ఉండొద్దా? రాబోయే రోజుల్లో కూడా విలీనం అవకాశాలు ఉండవు. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మంలోని ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపొద్దని అన్నం. దీని వల్ల రెండు నష్టాలు. ప్రజలకు ఇబ్బంది, అదే సమయంలో విద్యుత్‌ను పెంచుకునే అవకాశాన్ని తెలంగాణ కోల్పోతుంది. ఇన్ని నష్టాల మధ్య కాంగ్రెస్‌లో ఎలా విలీనం చేస్తారని ప్రజలు నన్ను అడుగుతున్నారు. ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఆంధ్రకు కలుపుతున్నారని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, డీఎస్‌కు, జానారెడ్డికి చెప్పిన. కానీ వారేం పట్టించుకోలేదు. అదే కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు.. జైరాంరమేశ్ చెవిలో ఇల్లు కట్టుకుని ఆర్డినెన్స్ తెప్పించుకున్నడు.

కాంగ్రెస్ నుంచి ఒక బ్యాచ్ అక్కడే ఉండి ముంపు గ్రామాలు పోకుండా చూడాలని కోరిన. వాస్తవానికి కేంద్రం రాయల తెలంగాణ ఫైనల్ చేస్తే లక్షలాది మందిని రోడ్లమీదికి తెచ్చి, 10 జిల్లాల తెలంగాణను ఫైనల్ చేసిన. మేం ఫైట్ చేస్తే వారు మాట్లాడుతరు. పైగా మాపై నిందలు వేస్తారు. ఇంకా కేంద్రంతో కొన్ని అంశాలున్నాయి. వాటిని గట్టిగా కొట్లాడి సాధిస్తాం. ప్రజలు రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌నే ఎన్నుకుంటారు. ఎందుకంటే స్వాతంత్య్ర పోరాటంలో పోరాటం చేసిన నెహ్రు, గాంధీలకు దండలేశారుగానీ, ఎలిజబెత్ రాణికి, చర్చిల్‌కు దండలేయలేదు. సన్మానం చేయలేదు. రాబోయే రోజుల్లోకూడా టీ జేఏసీతో సత్సంబంధాలే కొనసాగుతాయి. ఎన్నికల అభ్యర్థులకు సంబంధించి జాబితా ఏమీ సిద్ధంకాలేదు. జేఏసీ నుంచి ఎవరెవరు వస్తారో చూస్తాం. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు 14 ఎంపీ స్థానాలు వస్తాయని హెడ్‌లైన్స్ సర్వేలో వెల్లడైంది. ఇట్ల ఎన్నో సర్వేలు చెప్పినయి. విజయోత్సవ సభకు సంబంధించి తరువాత ప్లాన్ చేస్తాం.

కేసీఆర్ చెప్పిన కారణాలు ఇవీ..
-తెలంగాణ విషయంలో టీఆర్‌ఎస్‌ను ఏ సందర్భంలోనూ పరిగణనలోకి తీసుకోలేదు
-గవర్నర్ చేతికి శాంతి భద్రతలు ఇవ్వొద్దని కోరాం.. పట్టించుకోలేదు
-ఢిల్లీలోని ఏపీ భవన్‌ను తెలంగాణకు ఇవ్వాలంటే పెడచెవిన పెట్టారు
-ఎన్‌టీపీసీ నుంచి కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని అడిగితే పట్టించుకోలేదు
-చేవెళ్లపాణహితకు జాతీయ హోదా అడిగాం. ఇవ్వలేదు
-రాష్ట్రపతి పెట్టిన సంతకం తడి ఆరకముందే పోలవరం ప్రాజెక్టు కింద ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపారు
-మా ఎమ్మెల్యేలను, మేం సస్పెండ్‌చేసిన ఎంపీని కాంగ్రెస్‌లో ఎలా కలుపుకొంటారు?
-టీఆర్‌ఎస్ వస్తే దొరల రాజ్యం వస్తుందని, మరో ఆమ్‌ఆద్మీ పార్టీ అవుతుందని రెచ్చగొట్టారు
-ఇన్ని సమస్యలుంటే ఏం ముఖం పెట్టుకుని విలీనం చేస్తాం?

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.