విభజన షురూ..

హైదరాబాద్, ఫిబ్రవరి 28: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీ ప్రకటన త్వరలోనే వెలువడనున్న నేపథ్యంలో పాలనా పరమైన విభజన ప్రక్రియలన్నీ వేగం పుంజుకున్నాయి. విభజన క్రమంలో రెండు రాష్ర్టాల్లో పరిపాలనా సౌలభ్యం కోసం అనుసరించాల్సిన విధానాలపై చీఫ్‌సెక్రెటరీ ప్రసన్న కుమార్ మహంతి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై మార్గదర్శకాలను జారీ చేశారు. ఆయా శాఖల స్పెషల్ చీఫ్‌సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలకు విధివిధానాలతో కూడిన నమూనా పత్రాలను అందచేశారు. ప్రస్తుత పరిస్థితితో పాటు ఆవిర్భావతేదీ నాటికి ఎప్పటికప్పుడు శాఖల వారీగా ప్రగతి సమాచారం అందించాలని, ప్రతి వారం చీఫ్‌సెక్రెటరీని కలిసి ఆ వారం తీసుకున్న చర్యల వివరాలను అందచేయాలని మహంతి నిర్దేశించారు. కేంద్రప్రభుత్వం సూచనల మేరకు శాఖల వారీ చర్యలుండాలని సూచించారు. కొత్తపథకాలు, ప్రాజెక్టుల నిధులపై మారటోరియం విధిస్తూ చీఫ్‌సెక్రెటరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సమగ్ర వివరాలతో కూడిన మినిట్స్‌ను ప్రభుత్వం అన్ని శాఖల ఉన్నతాధికారులకు పంపించింది.
tg&andra
పునర్విభజనపై అనుబంధ కమిటీ
రాష్ట్రపునర్విభజనను గడువు లోగా పూర్తి చేసేందుకు చీఫ్‌సెక్రెటరీ మహంతి అధ్యక్షతన ఓ అనుబంధకమిటీ ఏర్పాటైంది. కమిటీ కన్వీనర్‌గా ప్రణాళికసంఘం స్పెషల్‌చీఫ్ సెక్రెటరీ ఎస్‌పీ టక్కర్, సభ్యులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు నాగిరెడ్డి, ఎల్‌వీ సుబ్రహ్మణ్యం, శ్యాంబాబు, రేమన్ పీటర్, అజయ్‌మిశ్రా, సమీర్‌శర్మ, బీ వెంకటేశ్వరరావు తో పాటు కేంద్రప్రభుత్వంలో ఉన్న రాజీవ్‌శర్మను నియమించారు. వీరికి వివిధ శాఖల అధికారులతో పాటు సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారం అందించనుంది. శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించనున్నారు. జీఏడీ, ఫైనాన్స్ శాఖలు ఆర్థిక సహకారాన్నందించనున్నాయి.

ఫైళ్లు, వివరాలు, భద్రత
అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఉన్న విభాగాల ఫైళ్ల జాబితాను రూపొందించి భద్రపరుచుకోవాలని చీఫ్ సెక్రెటరీ సూచించారు. భూమి, స్థిరాస్తులు, అప్పులు, ఆర్థికపరమైన ఫైళ్లను ఫోటోకాపీలను తీసి భద్రపరచాలని, ఈ ఫైళ్లను మూడు కాపీలు చేసి ప్రభుత్వ భాండాగారం (ఆర్చివ్స్), సంబంధిత శాఖ కార్యదర్శికి, సెక్షన్ ఆఫీసర్‌కు పంపాలని సీఎస్ ఆదేశించారు. అనంతరం ఫైళ్లను తాము సూచించిన మేరకు నిర్దిష్ట నమూనాలో పొందుపరిచి కంప్యూటరీకరించాలని సూచించారు. తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ఫైళ్లను వేరువేరుగా రూపొందించాలని పేర్కొన్నారు. ఫైళ్ల తయారీ, భద్రపరిచే పూర్తి బాధ్యత ఎస్‌ఓలు, ఏఎస్‌ఓలపై ఉంచారు. డిప్యూటీ, జాయింట్, అడిషనల్ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత ఇచ్చారు. ప్రిన్సిపల్ సెక్రెటరీలు, సెక్రెటరీలకు రోజు వారీ సమీక్షలు నిర్దేశించారు. కంప్యూటరీకరించిన ఫైళ్ల జాబితాను అన్నిశాఖల అధికారులు సాధారణపరిపాలన శాఖకు మార్చి 15లోపు అందజేయాలని ఆదేశించారు. ఫైళ్లలో అవకతవకలకు చోటు లేకుండా చూసేందుకు విజిలెన్స్‌కమిటీని వేశారు.

ఉద్యోగుల వివరాలు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులతో పాటు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, హోంగార్డులు, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను హెచ్‌ఆర్‌ఎంస్ విధానంలో సేకరించనున్నారు. వాటిని విభాగాల వారీగా విభజించి ఉద్యోగుల సంఖ్యను తేల్చనున్నారు. ఉద్యోగులు వారి వ్యక్తిగత వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ విభాగాలకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ ఆస్తులు మదింపు వేయాలని ఇందుకు రోడ్లుభవనాల శాఖ పూర్తి బాధ్యత తీసుకోవాలని, పూర్తి వివరాలను మార్చి 15లోగా అందించాలని ఆదేశించారు. ఇక జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థానిక ఉద్యోగుల కేటాయింపు, విభజన కోసం సర్వీసెస్ విభాగం ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఆర్ధిక, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులు, దేవాదాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి నియామకాలు, సీనియారిటీ, డిపార్ట్‌మెంటల్ ప్రమోషనల్ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను జీఏడీ సర్వీసుల విభాగం వెంటనే రూపొందించాలని ఆదేశించారు. మొత్తం వ్యవహారాన్ని సాధారణ పరిపాలన శాఖ పర్యవేక్షించాలని సూచించారు. కోర్టు కేసులు, చట్టపరమైన విషయాల గురించి న్యాయశాఖ కార్యదర్శి నివేదికను సిద్దం చేయాలని సూచించారు.
డిపార్ట్‌మెంటుల

పునర్నిర్మాణం..
అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు, సొసైటీలు, ఏజెన్సీల పునర్నిర్మాణంకోసం ప్రణాళికా సంఘం ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ సూచనలు చేస్తుంది. సంస్థాపరమైన నిర్మాణాలను, సంస్కరణలను, సిబ్బంది తదితర అంశాలను అధ్యయనం చేసి ఇరు ప్రాంతాలకు సూచనలు చేస్తుంది. ఇక ఇంధన శాఖలో రెండు ప్రాంతాలకు చెందిన వివరాలను రూపొందించేందుకు ఇంధన శాఖ స్పెషల్ సీఎస్‌తోపాటు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీలు సభ్యులుగా కమిటీ వేశారు. ఈ కమిటీ రెండు రాష్ర్టాలకు పైప్‌లైన్లద్వారా గ్యాస్ సరఫరా, విద్యుత్ పంపిణీ అంశాలను పర్యవేక్షిస్తుంది.

ఆస్తులు-అప్పులు
రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు, అప్పులు, ఇతర ఆర్ధిక వ్యవహారాల పరిశీలన, విభజనకు సెక్టోరియల్ కమిటీని నియమించారు. ఇందులో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్‌పర్సన్‌గా ఆర్థిక శాఖ, నీటిపారుదల శాఖ, న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఖజానాలో బ్యాంకు డిపాజిట్లతోపాటు షెడ్యూల్ 7లోని నిధులను, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ తదితర అంశాలను పర్యవేక్షిస్తుంది. వాటి విభజన అంశాలను పర్యవేక్షణ చేయనుంది. అలాగే రాష్ట్రంలోని 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లకు సంబంధించి అప్పులు, ఆస్తులు, హక్కులకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించి ఉద్యోగులను విభజించే పనిని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ చూసుకుంటుంది.
ఈ కమిటీలో ఆర్థిక శాఖ, ఆర్ అండ్ ఎస్ ముఖ్య కార్యదర్శులు, సింగరేణి కాలరీస్ సీఎండీ, న్యాయశాఖ కార్యదర్శి, ఏపీఐఐసీ ఎండీలు సభ్యులుగా ఉంటారు. ఇక రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు వంటి కీలక ఆదాయ వనరుల సమీకరణపై వ్యవహారాలను చూసేందుకు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీని నియమించారు. ఈ కమిటీలో రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల ముఖ్య కార్యదర్శులు సమన్వయం అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేస్తారు. బడ్జెట్ కేటాయింపులు, రెండు ప్రాంతాలనుంచి వస్తున్న ఆదాయ వనరులపై ప్రత్యేకంగా విభజించి ఆయా ప్రాంతాల లెక్కలను రూపొందిస్తారు.

నీటి పారుదల ప్రాజెక్టులకు..
నీటి పారుదల ప్రాజెక్టులు, కృష్ణా, గోదావరి నదులపై మేనేజ్‌మెంట్ బోర్డులకు సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడానికి అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో ఓ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటయింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ ముఖ్య కార్యదర్శి, వర్క్స్, ప్రాజెక్టుల సెక్రటరీ ఇందులో సభ్యులు. ఈ కమిటీ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో సమన్వయం చేసుకొని తగిన ప్రణాళిక రూపొందిస్తుంది. ఉద్యోగుల విభజన, బడ్జెట్ కేటాయింపులు, కార్యాలయాల ఎంపికల వ్యవహారాలను సిద్ధం చేస్తుంది. కాగా నీటిపారుదల శాఖలో ఇరు ప్రాంతాల్లో ప్రగతిలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణపు కాంట్రాక్ట్‌ల విభజనపై ప్రభుత్వం కమిటీ వేసింది. దీనికి ఆర్ అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సారథ్యం వహిస్తారు. ఏ రాష్ట్రం ప్రాజెక్టును ఆ రాష్ట్రానికి విభజిస్తారు. దీంతో ప్రాజెక్టుల లెక్కలు, వాటికి కేటాయింపులు, ఇంకా కేటాయించాల్సిన నిధులను లెక్కిస్తారు.

కొత్త రాజధాని కోసం…
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని గుర్తించేందుకు 6 నెలల్లోపు సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఎంఏయూడీ ఆధ్వర్యంలో నియమించారు. అటవీ భూములు డీనోటిఫై చేయడం, ప్రత్యామ్నాయాలు, నష్టపరిహారాలు తదితర అంశాలతోపాటు భూ సేకరణను ఈ కమిటీ పరిశీలిస్తుంది. అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోని ఈ కమిటీలో పురపాలక పరిపాలన ముఖ్య కార్యదర్శి, ఆర్ అండ్‌బీ, ఫైనాన్స్ ముఖ్య కార్యదర్శులు ఉంటారు. హెచ్‌ఎండీఏ అధికారులు వీరికి సహకారం అందిస్తారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, రాయితీల వ్యవహారాల అమలుపై ప్రతిపాదనలు సిద్ధం చేసే పనులు ప్లానింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని కమిటీ చూస్తుంది.

రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ అమలు ఎలా జరగాలనే విషయాన్ని కేంద్రం పర్యవేక్షిస్తుంది. అలాగే అదనపు బలగాలు, గ్రేహౌండ్ శిక్షణా కేంద్రానికి మూడేళ్ల పాటు కేంద్రం సహకారం అందిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మార్చి 15లోపు కేంద్రప్రభుత్వానికి అందించాలని, అందులోనే బలగాలు ఎంత కావాలనే అంశాన్ని వివరించాలని సూచించారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బందిని వారి ఆప్షన్ల ప్రకారం రెండు రాష్ర్టాలకు విభజిస్తారు. వారు సంబంధిత డీజీపీల పరిధిలో పనిచేస్తారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపి, జీఏడీ సెక్రటరీ ఈ వ్యవహారాల కమిటీలో సభ్యులుగా ఉంటారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.