విభజన బిల్లు అమరుల త్యాగఫలం -బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి

ఆరు దశాబ్దాల తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరుల త్యాగఫలమే రాష్ట్ర విభజన బిల్లు అని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల్లో దోపిడికి గురైన తెలంగాణ విముక్తిని ఇంకా అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వినిపిస్తున్న సమైక్యవాదం ఓ ఉన్మాదమని ఆయన అభివర్ణించారు. బుధవారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చలో నాగం మాట్లాడుతూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం, ప్రస్తుతం అనుసరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు జరిగినా పట్టించుకోని సభానాయకుడు సమైక్యవాదం వినిపించడం విచారకరమన్నారు.

nagamtdpమీ తెలుగు జాతిలో వారు (తెలంగాణ అమరవీరులు) భాగస్వాములు కారా? అని నాగం ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో 360 మంది, గత నాలుగేళ్ళలో 1,200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోతే ప్రతిపక్ష నాయకుడు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. సభలో కనీసం బలిదానాలపై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. మీది ఆంధ్రజాతి కాబట్టే అమరుల పట్ల వివక్షత చూపారని నాగం ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు పట్ల తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, ఒక్క తెలంగాణ విషయంలోనే ఆయనతో తాను విభేదించానని తెలిపారు. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని, హైదరాబాద్‌పై హక్కులు కావాలని సీమాంధ్ర సభ్యులు ఇంకా మాట్లాడుతుండడం విచారం కలిగిస్తోందన్నారు. మినీ ఇండియాగా విలసిల్లి అందరికీ ఆశ్రయం ఇచ్చిన హైదరాబాద్ నగరం తెలంగాణలో అంతర్భాగమని స్పష్టం చేశారు.

పెద్దమనుషుల ఒప్పందాన్ని అమలు చేయాలని నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి వినతిపత్రం ఇచ్చినా ఆయన పట్టించుకోలేదని, 1969 జనవరి 8న ఖమ్మంకు చెందిన రవీంద్రనాథ్ ఆమరణ దీక్షకు పూనుకున్న ఘటన తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందని వివరించారు. ఉద్యమంలో పాల్గొని 1969 డిసెంబర్ 3న తాను అరెస్టు అయ్యానని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక విషాదగాథ, సుదీర్ఘ సంఘర్షణగా అభివర్ణించిన నాగం, నాటి సంఘటనలు తలుచుకుంటే బాధ కలుగుతోందంటూ కొన్ని ఘటనలను సభకు వివరించారు. కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో పోలీస్ కమిషనర్ కళ్యాణరావు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి మృత దేహాలను తన చేతులపై మోసుకెళ్లానని చెప్పారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణకు అన్నీ కష్టాలు, నష్టాలేనన్నారు. ఇప్పటికీ ఇక్కడ (అసెంబ్లీ) ప్రజాస్వామ్యం ఉందా? దేశ సరహద్దుల్లో వేసే ముళ్ళ కంచె జాతిపిత మహాత్మగాంధీ, అంబేద్కర్ విగ్రహాల చుట్టూ వేశారు, ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పాయింట్‌ను దూరంగా నెట్టేశారు, సభలో ప్రజాస్వామ్యం ఏ విధంగా పరిఢవిల్లుతుందో చెప్పేందుకు ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని నాగం ప్రశ్నించారు.

సమైక్య రాష్ట్రంలో సాగునీటి దోపిడి
ముక్కారు పంటలతో అలరారాల్సిన తెలంగాణను సమైక్యరాష్ట్రంలో కరువు పీడిత ప్రాంతంగా మార్చారని నాగం మండిపడ్డారు. హైదరాబాద్ సంస్థానం రాష్ట్రంగా కొనసాగితే, అప్పర్ కృష్ణా, గుల్బర్గా జిల్లాలో బీమా ప్రాజెక్టుల నిర్మాణంతో పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయ్యేదన్నారు. బచావత్ ట్రిబ్యునల్‌లో మహబూబ్‌నగర్ జిల్లాకు నీటి కేటాయింపులు చేయలేదని, అందరికి కేటాయించగా మిగిలిన 17.84 టీఎంసీలు జూరాల ప్రాజెక్టుకు ఇచ్చారని, పాలమూరు జిల్లా ఏం పాపం చేసిందని నాగం ఆవేదనగా ప్రశ్నించారు.

హైదరాబాద్ రాష్ట్రం అలాగే ఉంటే తెలంగాణ సశ్యశామలం అయ్యేదని బచావత్ ట్రిబ్యునలే చెప్పిందని గుర్తు చేశారు. గ్రావిటీ ద్వారా రావాల్సిన నీటిని జిల్లాకు రాకుండా చేసి కాంగ్రెస్ పార్టీ, నీలం సంజీవరెడ్డి భాషోన్మాదంతో జిల్లాను నాశనం చేశారని మండిపడ్డారు. 1952లోనే హైదరాబాద్ ప్రభుత్వం అప్పర్ కృష్ణ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును సెకండ్ ప్లాన్‌లో తీసుకుందామనుకున్నారని, అందుకు కేంద్రం కూడా అంగీకరించిందన్నారు. రాష్ట్ర విలీనం జరిగినప్పుడు హైదరాబాద్ ప్రభుత్వనిర్ణయాలన్నీ గౌరవిస్తామని చెప్పిన నేతలు, సమైక్య రాష్ట్రంలో ఆ నిర్ణయాలకు కనీసగౌరవం ఇవ్వలేదన్నారు. అప్పర్ కృష్ణా ద్వారా 75 టీఎంసీలు, గుల్బర్గా జిల్లాలో సంగిడి వద్ద బీమా ప్రాజెక్టు ద్వారా 100 టీఎంసీల నీరు మహబూబ్‌నగర్ జిల్లాకు గ్రావిటీ ద్వారా వచ్చేదన్నారు. 1956 తరువాత ఆర్డీఎస్ నిర్మాణం పూర్తి చేయకుండా వదిలేసి, కింద కేసీ కెనాల్‌ను అభివృద్ధి చేసుకున్నారని విమర్శించారు.

పరివాహక జిల్లా అయిన పాలమూరులో లక్ష ఎకరాలకు సాగు నీరందించాల్సిన ఆర్డీస్ ద్వారా, కేవలం 45 వేల ఎకరాలకే సాగునీరందుతోంది. కేసీ కెనాల్ ద్వారా, పరివాహక ప్రాంతం కాని సీమ ప్రాంతానికి 4 లక్షల ఎకరాలకు నీటిని తీసుకువెళుతున్నారని నాగం మండిపడ్డారు. మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 11 వేల క్యూసెక్కులనూ ఇలాగే అక్రమంగా తరలిస్తున్నారని, ఇది చాలదన్నట్టు ఏకంగా నదిని మళ్లించి, 44 వేల క్యూసెక్కుల నీటిని తరలించే విధంగా గేట్లు పెట్టారని ఆరోపించారు. పరివాహక ప్రాంతంలో లేని తెలుగుగంగ, సోమశిల, కండలేరుల ద్వారా 250 టీఎంసీల నీటిని తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నది పరివాహక ప్రాంతంలోని దుర్బిక్ష ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులకు నీళ్లు అవసరం ఉంటే అడగమని చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదన్నారు.

వాస్తవంగా మన రాష్ట్రంలో పరివాహక ప్రాంతంలో ఉన్న దుర్భిక్ష ప్రాంతాలలో కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయన్నారు. కానీ వీటికి కాకుండా, తెలుగుగంగకు 25 టీఎంసీలు, పెన్నాఅహోబిలంకు 10 టీఎంసీలు, ఆర్డీఎస్ కుడికాలువకు 7 టీఎంసీలు కేటాయించాలని ప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరిందని వివరించారు. ఈ విషయమై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డిని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎలా వాదించమంటే, అలా వాదించానని చెప్పారని నాగం వెల్లడించారు. సమన్యాయం, సమైక్యవాదం అనేది ఇందుకేనా? అని ప్రశ్నించారు. శ్రీరాంసాగర్ రెండోదశ ఇప్పటికీ పూర్తి చేయలేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని, ఆ ప్రాజెక్టు ఎత్తిపోతలకు అవసరమైన విద్యుదుత్పత్తి ఖర్చును కేంద్రమే భరించాలని ఆయన కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.