విభజన కోసంమంత్రుల బృందం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో తదుపరి పరిపాలనా సంబంధ ప్రక్రియ వేగవంతమైంది. ఆంధ్రవూపదేశ్ విభజన కోసం సరిహద్దులు గుర్తించడం, నదీ జలాల పంపకంవంటి అంశాలపై దృష్టి సారించేందుకు మంత్రుల బృందాన్ని కేంద్ర నియమించింది. ఇందులో పదిమంది సభ్యులు ఉంటారు.
ఈ బృందం ఆరువారాల్లో తన నివేదికను ఇస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం విలేకరులకు చెప్పారు. ఆ నివేదిక అందిన తర్వాత రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. జీవోఎం విధి విధానాల ప్రకారం ఈ బృందంలో హోంశాఖ, ఆర్థిక శాఖ, న్యాయశాఖ, జల వనరుల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, రోడ్డు రవాణా-రహదారుల శాఖ, విద్యుత్ శాఖ, సిబ్బంది శాఖ మంత్రులతోపాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఉంటారు. నియోజకవర్గాలు, చట్టబద్ధమైన సంస్థలు, ఇతర పరిపాలనా శాఖల విభజన అంశాలను ఈ బృందం పరిశీలిస్తుంది. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగనున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల పరిపాలన నగరం నుంచి సాఫీగా సాగిపోయేందుకు అవసరమైన న్యాయ, పరిపాలనాపరమైన ఏర్పాట్లు చేస్తుంది. నదీజలాలు, నీటి వనరుల పంపకంతోపాటు బొగ్గు, చమురు, సహజవాయువు వంటి నిక్షేపాల వాటాలను ఖరారు చేస్తుంది. సీమాంధ్రలో నిర్మించే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించే అంశాన్ని కూడా మంత్రుల బృందం సిఫారసు చేస్తుందని సమాచారం.

రాజకీయ లబ్ధి కోసం కాదు : షిండే
తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎలాంటి రాజకీయ లబ్ధిని కాంగ్రెస్ కోరుకోవడం లేదని షిండే చెప్పారు. ‘ఇది కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం. దానిని మేం పరిపూర్తి చేశాం’ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుద్వారా కాంగ్రెస్‌కు రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు సహజమేనని షిండే వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం ఏర్పడే సమయంలో ఇటువంటి భావోద్వేగాలు కలుగుతూనే ఉంటాయని చెప్పారు. వారిని అనునయిస్తామని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా జరిపిన చర్చలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నా సహచర మంత్రులు ఆ ప్రాంత ప్రజల సమస్యలను, అభ్యంతరాలను వ్యక్తపరిచారు. వారు చెప్పిన విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విభజన సందర్భంగా ఇటువంటి భావోద్వేగాలు సహజం. వాటిని కొట్టిపారేయలేము. వారిని అనునయిస్తాం’ అని తెలిపారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం వస్తున్న డిమాండ్లను ప్రస్తావించగా.. వాటిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘మేం ప్రస్తుతం తెలంగాణ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. అంతకు మించి మరేమీ లేదు’ అన్నారు. తెలంగాణ ఏర్పాటైతే నక్సల్ సమస్య మళ్లీ ముందుకు వస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. ‘అక్కడ నక్సల్ సమస్య ఉంది. కానీ.. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం దానిని అణచివేయడంలో అమోఘమైన కృషి జరిపింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా నక్సలైట్ సమస్యను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది’ అని ఆయన చెప్పారు.

తగ్గేదే లేదు : దిగ్విజయ్‌సింగ్
ఇండోర్: తెలంగాణ ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశాలు లేనేలేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం తీసుకోవడంలో వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా భాగస్వాములేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నోట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయన తొలి సారిగా స్పందించారు. ప్రస్తుతం మధ్యవూపదేశ్‌లో ఉన్న దిగ్విజయ్.. ఇండోర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘చంవూదబాబు నాయుడుకు చెందిన టీడీపీ, జగన్మోహన్‌డ్డికి చెందిన వైఎస్సార్సీపీ సహా అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించిన తర్వాతే.. తెలంగాణ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది’ అని ఆయన పునరుద్ఘాటించారు. ఆ రెండు పార్టీలు ఇప్పుడు మనసు మార్చుకున్నంత మాత్రాన కాంగ్రెస్ వెనుకంజవేయదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ముందుకే వెళతామని తేల్చి చెప్పారు. ‘అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడమే మాపని. ఇతర పార్టీల వారు మాట మారవచ్చు గానీ మేం మాటమార్చం’ అని స్పష్టం చేశారు.

ఆరు వారాల్లో నివేదిక
రాష్ట్ర విభజనపై కసరత్తు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం ఆరు వారాల్లో కేంద్రానికి తన నివేదికను సమర్పించనుంది. ఈ మేరకు మంత్రుల బృందం ముసాయిదా విధివిధానాల్లో ఈ అంశం స్పష్టంగా ఉంది. కేంద్ర కేబినేట్ నిర్ణయం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంశాల పరిష్కారానికి, విభజన విషయాన్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం మంత్రుల బృందాన్ని నియమించింది.
మంత్రుల బృందంలో ఉండేదెవరు?
ఈ మంత్రుల బృందంలో కేంద్ర కేబినెట్ మంత్రులు/స్వతంత్ర హోదాతో ఉన్న సహాయ మంత్రులు ఉంటారు. ఇందులో హోం, ఆర్థిక, న్యాయ, మానవ వనరుల అభివృద్ధి, జల వనరులు, పట్టణాభివృద్ధి, రోడ్డు రవాణా-జాతీయ రహదారులు, విద్యుత్తు, సిబ్బంది వ్యవహారాల శాఖ మంత్రులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సభ్యులుగా ఉంటారు. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం మూలంగా తలెత్తే సమస్యలను ఈ మంత్రుల బృందం పరిష్కరిస్తుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.