విభజన కమిటీల్లో కొరవడిన ప్రాతినిథ్యం

హైదరాబాద్: నిన్నటిదాకా సమైక్య ఉద్యమంలో వీరంగాలు వేసిన అధికారుల చేతుల్లో విభజన బాధ్యతలు ఉంచడంపై తెలంగాణవాదుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన నిలువరించాలని ఢిల్లీదాకా వెళ్లి ఆందోళనలు చేసిన ఉద్యోగులు ఇవాళ న్యాయబద్దంగా తెలంగాణ వాటాలు రానిస్తారా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉన్నతాధికారుల నేతత్వంలో ఏర్పాటైన కమిటీల కూర్పు తీరు చూస్తే తెలంగాణకు ప్రమాదం పొంచి ఉందనే అనిపిస్తోంది. ఈ కమిటీల్లో తెలంగాణవాదులకు ప్రాతినిథ్యం లేకపోవడం ఆందోళనను కలిగిస్తోంది.

విభజన కోసం 15 కమిటీలు ఏర్పాటు చేశారు. వాటికి ఆయా శాఖల ఉన్నతాధికారులు నాయకత్వం వహిస్తున్నారు. ఆ ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారం అందించేందుకు డిప్యూటీ, అసిస్టెంట్ సెక్రటరీలు, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ అధికారులున్నారు. అయితే వారంతా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉండటంతో నివేదికల విశ్లేషణపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. కింది స్థాయి అధికారులు రూపొందించే నివేదికలు పక్కాగా ఉన్నాయా? లేదా? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకు తెలంగాణ ప్రాంత అధికారులు, ఉద్యోగులకు అవకాశం ఇవ్వలేదు. దీనితో నివేదికలు ఏకపక్షమయ్యే ముప్పు లేకపోలేదన్న అనుమానాలు పెరుగుతున్నాయి. సచివాలయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారుల సంఖ్య మెజారిటీగా ఉండటమే అందుకు కారణంగా భావిస్తున్నారు.

సచివాలయంలో ఫేర్ షేర్ ఉండాలని తెలంగాణ ప్రాంత అధికారులు, ఉద్యోగ సంఘాలు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. ఇది విభజన వేళ శాపంగా మారనుంది. తెలంగాణ, సీమాంధ్ర రాష్ర్టాలు ఏర్పడిన సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల బదిలీలు, వివిధ శాఖల విధివిధానాలు వంటి అనేక అంశాలపై సమగ్రమైన నివేదికలు తయారు చేసేందుకు ఉన్నతాధికారులతో 15 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కమిటీలు రూపొందించిన నివేదికలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రసన్న కుమార్ మహంతి అధ్యక్షతన ఏర్పాటైన అపెక్స్ కమిటీ పరిశీలించి.. కేంద్రానికి నివేదించనుంది. అత్యంత కీలక ఘట్టంలో నివేదికల క్రాస్ చెకింగ్‌కు కమిటీల్లో తెలంగాణవాదులకు ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు సహా సచివాలయంలోని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, ఉద్యోగులు కుట్ర పూరితంగా వ్యవహరించారు. రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలని సచివాలయంలో సీమాంధ్ర సిబ్బంది పలు రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఇప్పుడు విభజనకు అవసరమైన అంశాలపై కమిటీల పని ప్రారంభమైంది. ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రస్తుత కాలంలో తెలంగాణవాదులు అప్రమత్తంగా లేకుండా పెద్ద ప్రమాదమే జరుగనుంది.

రాష్ర్టాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ డిమాండ్ ఫలించకపోయినా.. విభజన కమిటీల మాటున తెలంగాణను అన్యాయం చేసేందుకు ఆ ఉద్యోగులు కుట్ర పూరితంగా వ్యవహరించే ప్రమాదం లేకపోలేదన్న వాదన బలంగా ఉంది. సచివాలయంలో సీమాంధ్ర సిబ్బంది మెజారిటీగా ఉండటమే అందుకు కారణమని తెలంగాణవాదులు వాదిస్తున్నారు. నివేదికల క్రాస్ చెకింగ్‌కు తెలంగాణవాదులకు ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనన్న డిమాండ్ పెరుగుతోంది.

This entry was posted in ARTICLES.

Comments are closed.