న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలపై నవంబర్ 5లోపు కేంద్రహోంశాఖకు నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ గోస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శులను ఆదేశించారు. రాష్ట్ర విభజనపై జరిగిన కీలక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి తొమ్మిది మంత్రిత్వ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితిపై హోంశాఖకు ఆయా శాఖల కార్యదర్శులు సంక్షిప్తంగా రూపొందించిన వివరాలు అందించారు. వచ్చే రెండ్రోజుల్లో పూర్తిస్థాయి సమాచారాన్ని ఇవ్వాలని ఆయా శాఖలను హోంశాఖ కోరింది. జలవనరుల పంపిణీపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. బిల్లులో ఎలాంటి విధానపరమైన అంశాలను ఉంచాలనే అంశంపై కేంద్రం దృష్టి సారించింది.
మంత్రుల బృందానిదే తుది నిర్ణయం: హోంశాఖ
రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందమే హైదరాబాద్‌పై తుది నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీని సిద్ధం చేయాలని హోంశాఖ ఆర్థిక శాఖకు సూచించింది. నవంబర్ 1 నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర మంత్రిత్వ శాఖలతో విడివిడిగా సంప్రదింపులు జరుపుతాయని పేర్కొన్నారు. నవంబర్ 15 లోపే మంతృల బృందం విభజనపై నివేదిక తయారుచేసి కేబినెట్‌కు పంపే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉందన్నారు.