విభజనకు మద్దతుగాబహుజనుల ర్యాలీ

-పోలీసుల దౌర్జన్యం.. బహుజన ఆంధ్రా జేఏసీ కన్వీనర్ శ్రీరాములు అరెస్ట్
-వంద మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నిర్బంధం
సీమాంవూధలో సమైక్యవాదుల ఉద్యమాలకు ఎర్ర తివాచీలు పరిచి, వారు చేస్తున్న ఉద్యమాలను స్వాగతిస్తున్న ప్రభుత్వం.. అదే సీమాంవూధలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును, రాష్ట్ర విభజనను స్వాగతిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా జరుపుతున్న ప్రదర్శనను కూడా సహించలేకపోయింది.
gunter
సమైక్యవాదులు ఎంత అల్లరి చేసినా.. విగ్రహాలు కూలగొట్టి విధ్వంసాలు సృష్టించినా, చిన్నపిల్లలతో ర్యాలీలు తీయించినా నిమ్మకు నీరెత్తినట్టున్న రాష్ట్ర సర్కారు శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్న సీమాంవూధులను అడ్డుకొని అరెస్టులు చేస్తోంది. దళిత బహుజన నేత పల్నాటి శ్రీరాములుపై పోలీసులు దౌర్జన్యం చేసి అక్రమంగా పోలీసుస్టేషన్‌లో ఆరు గంటలపాటు నిర్బంధించారు. ఆయనతోపాటు వంద మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

బుధవారం గుంటూరు పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, బహుజన ఆంధ్రా జేఏసీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘ఆక్షిగకుల పెట్టుబడిదారుల సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తిప్పికొట్టాలి, బహుజన ఆంధ్రా కోసం నడుంకట్టాలి’ అనే నినాదంతో శాంతియుతంగా ర్యాలీని నిర్వహిస్తుండగా అరండల్‌పేట పోలీసులు వందలాది మంది ఉద్యోగులను, బహుజన నేతలు ర్యాలీ నిర్వహించకుండా అడ్డుకొని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలదండ కూడా వేయనీయలేదు. ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు వారిని స్టేషన్‌లో నిర్బంధించారు. గుంటూరులో బాబా సాహేబ్ అంబేద్కర్ కోరుకున్న చిన్న రాష్ట్రాల సాధన కోసం, బహుజనులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తుంటే పోలీసులు దళిత ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తించి, ఆగ్రకుల సమైక్యవాదుల తొత్తులుగా వ్యవహరించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన ఆంధ్రా జేఏసీ కన్వీనర్ పల్నాటి శ్రీరాములు డిమాండ్ చేశారు. ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ మోహన్‌కుమార్ ధర్మ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చేస్తున్న ఉద్యమాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని, బహుజనులు కన్నెర్ర చేస్తే ఆగ్రకుల రాజకీయ అధిపత్య పీఠాలు కూలిపోతాయని హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి మండే నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, డీఎస్సీల నుంచి అనుమతి తీసుకొని ప్రజాస్వామికంగా, శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న బహుజన ఉద్యోగులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటని, ఆగ్రకుల నాయకత్వంలో ఏపీఎన్జీవో సమ్మెలో బహుజన ఉద్యోగులు ఎవరూ పాల్గొనడం లేదని, ఆ కక్షతోనే తమపై నిర్బంధకాండను అమలు చేస్తున్నారని అరోపించారు. కాగా, అక్రమంగా అరెస్టు చేసిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత, బహుజనులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి పోలీసు స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు పల్నాటి శ్రీరాములుపై దౌర్జన్యం చేశారు. పోలీసు జులుం నశించాలని, పెత్తందార్ల సమైక్య కుట్రను తిప్పికొట్టాలని, సమైక్యంధ్ర కాదురా.. బహుజన ఆంధ్రా నాదిరా.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అరెస్టయినవారిలో వివిధ సంఘాలకు చెందిన డాక్టర్ మద్దు అంజయ్య, ఎస్‌ఎం ప్రకాశ్, ఎన్‌జే విద్యాసాగర్, జయబాబు, జయరావు, పరిశపోగు శ్రీనివాసరావు, డాక్టర్ కాకాని సుధాకర్, పలుపూరి ప్రసాదరావు, డాక్టర్ పీ నాగభూషణం, సుకుమార్, మేళం భాగ్యారావు, రమణయ్య, భగత్‌సింగ్, జీ శ్రీనివాస్‌తోపాటు మరో వంద మంది ఉన్నారు.

కండకావరమెక్కి అరెస్టు చేశారు: ఎంపీ రాజయ్య
పరకాల: అంబేద్కర్ స్ఫూర్తితోనే గుంటూరులో అక్కడి ఎస్సీ,ఎస్టీ, బీసీలు, విద్యార్థులు జై ఆంధ్రా ర్యాలీ నిర్వహిస్తే కండకావరమెక్కిన అధికారులు పైశాచికంగా అరెస్టు చేశారని వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మండిపడ్డారు. సమైక్యాంధ్ర వద్దంటూ గుంటూరులో చేపట్టిన జై ఆంధ్రా ఉద్యమం న్యాయబద్ధమైనదేనని పేర్కొన్నారు. బుధవారం వరంగల్ జిల్లా పరకాలలో ఆయన మాట్లాడారు. చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి, బడుగులకు రాజ్యధికారం సాధ్యమవుతుందని అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. పేద వర్గాలకు చెందిన వారు ఉద్యమంలో భాగస్వాములవుతుంటే నిర్బంధించడం తగదన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కాజేయాలనే దురాలోచనతోనే కొందరు సమైక్యవాదులు తెలంగాణకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాటి శ్రీరాములు అరెస్టు అన్యాయం: ఖండించిన టీజేఏసీ
సామాజికాంధ్ర సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యమనేత పల్నాటి శ్రీరాములును అరెస్టు చేయడం, ఆయనపైన పోలీసులు దౌర్జన్యం చేయడం అన్యాయం, అక్రమమని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం ఖండించారు. అంబేద్కర్ ఆలోచనాధారను ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను గౌరవించి గుంటూరులో ప్రదర్శన నిర్వహించినందుకు ఆయనపై దౌర్జన్యం చేయడం ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు ప్రతీక అని వ్యాఖ్యానించారు. పల్నాటి శ్రీరాములు అరెస్టును ఖండించిన తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీవూపసాద్.. తెలంగాణ ఉద్యమాన్ని ఏ ప్రజాస్వామికశక్తులు బలపరిచినా, అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం మరోసారి రుజువైందని అన్నారు.

టీజీవో అధ్యక్షుడు వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. శాంతియుతంగా సమైక్య ఉద్యమాన్ని నడుపుతున్నామని ఊదరగొడుతూ దళిత బహుజన ఉద్యోగిపైన ఏ విధంగా పోలీసులు దాడి జరుపుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ.. రెండు ప్రాంతాలలో దళితులు ఒక్కటవుతారన్న అక్కసుతో పోలీసుల సహాయంతో శ్రీరాములు గొంతు నొక్కేందుకు ప్రయత్నం చూస్తోందని విమర్శించారు. బహుజన మేధావి, ఆలోచనశీలి, సీమాంధ్ర బలహీన వర్గాలకు అండదండలందిస్తున్న శ్రీరాములును అరెస్టు చేసి పోలీసులు బహుజనుల పౌర హక్కులను కాలరాచి వేశారని జేఏసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మల్లికార్జున్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజాస్వామిక డిమాండ్‌ను బలపరుస్తున్న వారందరినీ పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారని, అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.