విధ్వంసక విత్తనాలు నాటుతూ..!

వైఎస్ పారిచ్చిన రక్తం
ఇప్పుడిప్పుడిప్పుడే ఘనీభవిస్తున్నది
ఆ ఘనీభవించిన దారుల్లో
ఆమె తోడేళ్లగుంపుతో
దండయాత్రకు దిగుతున్నది
ఇనుప చువ్వల దండు
ఇళ్లంత కలెదిరిగి
ఒళ్లంత గుచ్చితే
ఆమె ఇప్పుడు నెయ్యిపట్టుకొని వస్తున్నది
***
కొడుకు రాముడు, రహీమ్,
శిలువ చెక్కిన బొమ్మ
నోట్లకట్టలతో మహాసౌధాన్ని
నిర్మించుకున్న యువరాజు
పార్లమెంట్‌లో గుండెను విప్పిన మనిషి
గుండెలు తెగిపడ్డ నేలపై కొత్తరాజ్యాన్ని
నిర్మించాలని తలపోసి
తల్లిని దూతగా పంపిండు
***
నీ కొడుకు జైల్లో ఉంటే
నీకడుపు భరించలేకపోయింది
వందలాది మంది తల్లులు
తమ బిడ్డల్ని భూమిలో దాచుకున్నరు
నీ ఓటుకు ప్రతిఫలంగా నీ కొడుకు
ఇయ్యాల్నో రేపో నీ ఇంటికి వస్తడు
అగ్నిశిలగా మారుతున్న మా దేహాన్ని
బూడిద చేయడానికి నువు పెట్టుకున్న
సరికొత్త పేరు దీక్ష
***
ఆమె దారిపొడవునా
విధ్వంసక విత్తనాలు
నాటుతూ వాటికి దండలేస్తూ
ఇగ రోజూ పూజించండని
ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తూ
ఉరిసిల్లగా మారుతున్న సిరిసిల్లను
సిరుల శాలగా మారుస్తనని
శపథం చేస్తున్నది
ఒక చేత్తో వీసా పాస్‌పోర్ట్
మరొక చేత్తో బెయిల్ దరఖాస్తు పట్టుకొని
***
చంద్రదండు కొత్తకాదు
కిరణ్ కొత్తవిత్తనం ఎరుగక కాదు
నీ ఫ్యాక్షన్ దండూ కొత్తకాదు
నైజామునే ఎదిరించిన గడ్డ ఇది
నువ్వెంత..నీ దండు ఎంత
మా రహెమున్నీసా కాలిచెప్పు ముందు..!

-వర్షిత్

This entry was posted in POEMS.

Comments are closed.