విద్వేషాలకు మీ భర్తలే కారణం : ఈటెల

 సీమాంధ్రమంత్రుల భార్యలు ధర్నా చేయడం దారుణమని, ‘ప్రాంతాల మధ్య విద్వేషాలకు మీ భర్తలే కారణ’మని టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ ఆన్నారు. సీమాంధ్ర మంత్రులు, వారి భార్యలు ఒక్క రోజైనా తెలంగాణ అమరవీరుల గురించి ఆలోచించిన్రా అని ఆయన ప్రశ్నించారు. గల్ఫ్‌లో చనిపోయిన తెలంగాణ బిడ్డల గురించి ఏనాడు పట్టించుకోకుండా, కనీసం శవాన్నైనా తెచ్చివ్వలేదని ఈటెల మండిపడ్డారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు వెకిలి చేష్టలు ఆపాలని ఆయన హెచ్చరించారు.

విడిపోతే సీమాంధ్రకు ఓ మంచి రాజధాని వస్తుందని సీమాంధ్ర ప్రజలకు ఈటెల సూచించారు. తిరుపతికి తెలంగాణ నుంచి ఒక కారు పోతే సహించలేరని విమర్శించారు. బీడీ కార్మికుల జీతాలు పెంచి కార్మికులను కాపాడమంటే ఎందుకు స్పందించలేదని సీమాంధ్ర మంత్రులను ప్రశ్నించారు.
నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి వరకు 56 ఏళ్ల సమైక్యరాష్ట్రంలో 50 ఏళ్లకు పైగా పాలించింది సీమాంధ్ర నాయకులేనని ఈటెల పేర్కొన్నారు.
మాటలు మారుస్తున్న చంద్రబాబు మరోసారి తన మోసాలకు తెర తీస్తున్నాడని ఆయన విమర్శించారు. తెలంగాణ ఎందుకు కావాలో ఆనాడు చంద్రబాబు 3 గంటలు మాట్లాడింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో ఆటు ఇటు కాకుండా ఉన్నాడన్నారు. చంద్రబాబు తన పాలనలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని అమ్మేసీ తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టింది నిజం కాదా? అని ఈటెల ప్రశ్నించారు.
ఇక సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వింత నాటకాలు అడుతున్నారని ఈటెల మండిపడ్డారు. ‘హైకమాండ్ సీల్డ్ కవర్‌లో నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే అనాడు ఎందుకు వద్దనలేదని’, హైకమాండ్ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటానన్న సీఎం కిరణ్ హైకమాండ్‌ను ధిక్కరించడంలో ఆర్థం లేదన్నారు. ఎవరి మీద విద్వేషంతో సీమాంధ్ర నేతల లేఖ మీద సీఎం సంతకం పెట్టిండో చెప్పాలన్నారు. మమ్మల్ని ద్వేషించే వాళ్లకు మమ్మల్ని పాలించే హక్కు లేదన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.