విద్యుత్ రంగంలో సీమాంధ్ర పెత్తనండైరెక్టర్ల భర్తీలో తెలంగాణకు అన్యాయం

విద్యుత్ రంగంలో సీమాంవూధుల ఆధిపత్యానికే సర్కారు మొగ్గుచూపుతున్నది. దీంతో విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ల భర్తీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. విద్యుత్ డైరెక్టర్ల నియామకాల్లో తెలంగాణకు న్యాయం జరగాలని తెలంగాణవాదులు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) జరిపిన ధర్నాలు, ఆందోళనలు ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అరవై ఏళ్లుగా విద్యుత్‌రంగంలో తొంభై శాతం మేరకు సీమాంవూధులే డైరెక్టర్లుగా పనిచేశారని, ఇప్పటికైనా తెలంగాణ ఇంజినీర్లకు ప్రాధాన్యం కల్పించాలని చేసిన డిమాండ్లు.. ఇచ్చిన వినతులు బుట్టదాఖలయ్యాయి. ఇటీవల జరిగిన డైరెక్టర్ల నియామకాలు, సీపీడీసీఎల్‌లో ఒకరి పదవీకాలం పొడిగింపు అంశాలే ఇందుకు తాజా ఉదాహరణలు. ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కోల్లో తెలంగాణ డైరెక్టర్లకు ప్రాధాన్యం దక్కకపోగా, ఇంకా భర్తీకావాల్సిన నాలుగు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల (డిస్కమ్) డైరెక్టర్ల పోస్టుల్లో సీమాంవూధులకే అగ్రతాంబూలం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నది.

అంతేకాకుండా వచ్చే అక్టోబర్ చివరినాటికి జెన్‌కోలో ముగ్గురు డైరెక్టర్ల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో వాటిల్లోనూ తెలంగాణ వారికి ఛాన్స్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలోని సెంట్రల్ పవర్ డిస్కమ్‌లో ఇద్దరు సీమాంధ్ర అధికారులకు అవకాశం కల్పించేందుకు సర్కారు పెద్దలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. పంచాయతీ ఎన్నికల నేపథ్యం విద్యుత్ డైరెక్టర్ల నియామకాలకు అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ లేనిపక్షంలో వీటికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు వెలువడేవి. వాస్తవానికి సీమాంవూధలో తిరుపతి కేంద్రంగా ఉన్న సదరన్ పవర్ డిస్కమ్ (ఎస్పీడీసీఎల్), విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ పవర్ డిస్కమ్ (ఈపీడీసీఎల్)లో తెలంగాణ వారికి అవకాశం కల్పించే పరిస్థితి లేదు. అదే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంట్రల్ పవర్ డిస్కమ్ (సీపీడీసీఎల్)లోని ముగ్గురు డైరెక్టర్ల పోస్టుల్లో రెండింటిని సీమాంవూధులకే ఇవ్వాలని సర్కారుపై బలంగా రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.

దీనికి ప్రత్యామ్నాయంగా వరంగల్ కంపెనీ (ఎన్పీడీసీఎల్) సీఎండీ స్థానానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యుత్‌రంగ నిపుణుడిని ఎంపిక చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారి కార్తికేయమిశ్రా నార్తరన్ పవర్ డిస్కమ్ సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఈస్ట్రన్ పవర్ డిస్కమ్ ఇన్‌చార్జి సీఎండీగా కార్తికేయ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో నార్తరన్ పవర్ డిస్కమ్‌కు నాన్ ఐఏఎస్ అధికారులు సీఎండీలుగా పనిచేసిన అనుభవాలున్నాయి. పూర్తిగా వ్యవసాయాధారిత కంపెనీగా ఉన్న ఎన్పీడీసీఎల్ పరిధిలో క్షేత్రస్థాయి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్పీడీసీఎల్‌లో ఐఏఎస్‌లు పనిచేసిన కాలం కన్నా నాన్ ఐఏఎస్‌లు సీఎండీలుగా పనిచేసిన సమయంలో ఎక్కువ ఫలితాలు కనిపించాయన్న అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.