వారంలో తెలంగాణ తేకపోతే తరిమికొట్టండి – టీ కాంగ్రెస్ నేతల హామీపై ప్రజలకు కేకే పిలుపు

– పోస్టులకు దస్తీలేసుకునేందుకే సభ
– సీమాంవూధుల తడాఖా అంటే నోరుపెగలదా?
– నాటకాలాడి పిల్లలను చంపకండి
– శత్రువు బానిసలు తెలంగాణ నేతలు
– విలీనం పాతమాట.. పార్టీలో నిర్ణయిస్తామని వెల్లడి
చెప్పినట్టు వారం రోజుల్లో తెలంగాణ తేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు రాకుండా తరిమి కొట్టాలని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ విషయమై పదేపదే నాటకాలాడడం వారికి అలవాటైందని ఆయన అన్నారు. ఢిల్లీలో కదలికలు చూసి ‘తెలంగాణ వస్తే పోస్టులకోసం దస్తీలు వేసుకునేందుకే’ తెలంగాణ సాధన సభ పెట్టారని ఆయన దుయ్యబట్టారు. మేం జైళ్లకు వెళ్లినపుడు, అరెస్టులయినపుడు ఒక్కరూ లేరు కానీ ఇపుడు మాత్రం ఎవవరో వచ్చి తెలంగాణ అంటున్నారని ఎద్దేవా చేశారు.

మేం పోరాటంలో పాల్గొన్నప్పుడు మమ్మల్ని కొట్టించిన ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వినపుడు, మా మాటలపై ఎగిగిరి పడ్డప్పుడు గుర్తుకు రాని తెలంగాణ ఇపుడు గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తే తడాఖా చూపుతామని గాంధీభవన్‌లోనే సీమాంవూధనేతలు అంటుంటే, మా గాంధీ భవన్‌లో మేం తడాఖా చూపుతామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు అనడం లేదని కేశవరావు ప్రశ్నించారు. ఈ సభలన్నీ కుట్ర. వారం రోజుల్లో తెలంగాణ రాకపోతే పదవులు వదిలేయండి. స్థానిక ఎన్నికలకు వెళ్లబోమని చెప్పండి….అంతేతప్ప స్థానిక ఎన్నికల ఓట్లకోసం ఉద్యమాన్ని బలహీనపరిచే కుట్రలు చేసి మరో వెయ్యిమంది బిడ్డలను పొట్టనపెట్టుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఇచ్చేందుకు ఇదే సమయం..రాష్ట్రం సాధించి తెలంగాణ ఇచ్చిన ఘనత మీరే దక్కించుకోండి అని ఆయన కోరారు. 2014దాకా నేనే సీఎం అంటున్న వ్యక్తి పక్కన కూర్చుని ఇదేమిటని అడగని వారు, శత్రువుకు బానిసలుగా ఊడిగం చేసేవారు తెలంగాణ తెస్తామని అంటుంటే ఎట్లా నమ్మాలని ప్రశ్నించారు. మంత్రి శ్రీధర్‌బాబు సంతాప తీర్మానాన్ని పీసీసీ సమావేశంలో పెడదామంటున్నాడని, అసెంబ్లీలో పెడతామని ఎందుకు అనడంలేదని నిలదీశారు. సభలో జై తెలంగాణ అనాలని అంటే జానాడ్డి అనలేదని, మంత్రులను ఆ మేరకు సీఎం అదుపు చేశాడని అన్నారు.

సాధించిన సభ కావాలి : తెలంగాణ సాధించిన సభ పెట్టుకోవాల్సిన వారు సాధన కోసం సభ పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చే శక్తి ఉంది కాబట్టి ఇచ్చి సభ పెట్టుకోవాలన్నారు. వెయ్యిమంది బిడ్డలను కోల్పోయిన తండ్రిగా పార్లమెంటులో నిలదీశానని, వాళ్లు చాలకుంటే తెలంగాణ వాళ్లనందరినీ ట్యాంక్‌బండ్ మీద నిలబెట్టి కాల్చేయాలన్నానని చెప్పారు. వారం పదిరోజుల్లో తెలంగాణ వస్తుందని షబ్బీర్‌అలీ కూడా చెబుతున్నాడని అందువల్ల వారంలోగా రాకపోతే ఏంటీ అనే కార్యాచరణ కూడా పెట్టుకోవాలని ఆయన సూచించారు. నాకు తెలంగాణ కావాలి. వస్తే రాజకీయాల్లో ఉంటానో లేదో కూడా తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ తెచ్చేవారికి సహకరిస్తానన్నారు.

అప్పటి పరిస్థితులు ఇపుడు లేవు : గతంలో తెలంగాణ ఇస్తే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తామన్నారని అయితే ఇపుడా పరిస్థితులు లేవని కేశవరావు అన్నారు. అయినా పార్టీలో చర్చిస్తామని, ఇది ప్రెస్‌మీట్‌లో నిర్ణయించేది కాదని అన్నారు. రాయలతెలంగాణపై ముందు కేంద్రం నిర్ణయిస్తే అపుడు మాట్లాడతామన్నారు. బిజెనెస్‌మ్యాన్‌లు రాజకీయాల్లో వద్దని కాంగ్రెస్ అనడాన్ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో ఉన్నదే వాళ్లని, సీమాంధ్ర నేతలంతా వ్యాపారులేనన్నారు. కేంద్రమంత్రి పదవులు ఇచ్చింది పైసలేకోసమేనని వాళ్ల దగ్గరే పైసలున్నాయని అన్నారు. దేశంలో జాతీయపార్టీలు లేవని ఆ పేరుతో ఉన్న పార్టీ బోర్డులు మాత్రమే ఉన్నాయని చమత్కరించారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.