వలసల భయంలో దేశం

 

cycleఇప్పటికీ
తెలంగాణపై దోబూచులే
పుట్టిముంచుతున్న పార్టీ వైఖరి
టీఆర్‌ఎస్‌వైపు
చూస్తున్న ప్రాంత నేతలు
దారిచూపిన ఎమ్మెల్యే గంగుల!
తెలుగుదేశం పార్టీకి వలసల భయం పట్టుకుంది. 2014ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంలో పార్టీ భవితవ్యం ఏమిటన్న మీమాంస పార్టీనేతల్లో వ్యక్తమవుతోంది. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండబోవడం లేదని అంచనాకు వస్తున్న పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు వలస బాట పడుతున్నారు. తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు మొదలయ్యాయన్న చర్చ జరుగుతోంది. ఇదే కోవలో 10 మందికిపైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడనున్నట్లు సమాచారం. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, పాలమూరు, అదిలాబాద్, రంగాడ్డి జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, పార్టీనేతలు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా టీఆర్‌ఎస్‌లో చేరే అంశంలో తర్జనభర్జన పడుతూ తన సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విషయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే గులాబీ తీర్థం పుచ్చుకోవాలని ఆయనకు సన్నిహితులు సలహా ఇచ్చినట్లు తెలిసింది.

సదరు నాయకుడు టీఆర్‌ఎస్‌లో చేరితే వ్యక్తిగతంగా నగర టీడీపీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాసయాదవ్ గెలుపు అవకాశాలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్, సనత్‌నగర్ నియోజకవర్గాలపై ఈ నేత ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఆరు నెలలుగా తమ అధినేత అనేక కష్టనష్టాలకోర్చి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నదని పలువురు టీడీపీ నేతలు మథనపడుతున్నారు. తెలంగాణ విషయంలో అనుసరిస్తున్న ధోరణి కారణంగా ప్రజల నుంచి పార్టీ దూరం అవుతున్నదని సీనియర్ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల విశ్వసనీయతను కోల్పోయామని ఆ నేత వాపోయారు. ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దానిని తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టమని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమ నాయకుడు చేసిన అతిపెద్ద పొరపాటు ఇదేనని పలువురు టీడీపీ నేతలు అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం విషయంలో కేసీఆర్‌పై తాము ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, తెలంగాణ క్రెడిట్ ఆయనదేనని అంగీకరిస్తున్నారు.

తాము ఏ స్థాయిలో విమర్శించినా, కేసీఆర్‌కు వచ్చే క్రెడిట్‌ను చేసి ఓర్వలేక విమర్శలు చేసినట్లే ఉందని చెప్పారు. కేంద్ర హోం శాఖ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం తరువాత నెలలో కేంద్రం తెలంగాణ ప్రకటించక పోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని టీడీపీ ప్రకటించింది. కానీ కేంద్రం విధించిన నెల డెడ్‌లైన్ దాటి నాలుగు నెలలవుతున్నది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యమం సంగతి పక్కన పెడితే కనీసం టీడీపీ తెలంగాణ ఫోరం ఒక్కసారి కూడా సమావేశం కాలేదు.

ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు సంక్రాంతి పండుగకు ముందు తన ఇంట్లో ఫోరం సమావేశం నిర్వహించడానికి ప్రయత్నిస్తే, పార్టీ అధినేత బాబు బలవంతంగా సమావేశాన్ని వాయిదా వేయించారన్న అభిప్రాయం ఉంది. దీంతో చాలా మంది తెలంగాణ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. కొందరు మాత్రం నామ్‌కే వాస్తే అన్నట్లు పోయివస్తున్నారేగానీ.. క్రియాశీలకంగా ఉండటం లేదు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని లేఖలు ఇచ్చినా తెలంగాణకు ఏనాడు అనుకూలం కాదన్న అభివూపాయం వ్యక్తమవుతుండటంతో పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారమేనని కొందరు నేతలు భావిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణపై నియోజకవర్గాల స్థాయిలో తమ సన్నిహిత నేతలతో, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నందున టీఆర్‌ఎస్‌లో చేరడమే మేలన్న అభిప్రాయానికి వారు వస్తున్నారని అంటున్నారు. అలాంటివారికి టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దారి చూపారన్న అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నది.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.